Virat Kohli: ఆ బంతి దెబ్బకు చూపు మసకబారింది.. పోరాటమా? ఫ్లైట్‌ ఎక్కడమా? అనుకున్నా: కోహ్లీ

విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఆటతో ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. కఠినమైన పిచ్‌లపైనా భారీగా పరుగులు రాబట్టాడు. అందులో ఆసీస్‌ జట్టుపైనా ఆధిపత్యం ప్రదర్శించేవాడు.

Updated : 13 Apr 2024 15:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పట్టుదల గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి ఎంతగా కవ్విస్తే అతడి ప్రదర్శన అంత అత్యుత్తమంగా ఉంటుంది. అందుకే అతడిని ఎవరూ స్లెడ్జ్‌ చేయడానికి సాహసించరు. దీనికి ఉదాహరణ 2014-15 ఆసీస్ పర్యటనే. ఆ సిరీస్‌లోనే విరాట్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ నుంచి అందుకొన్నాడు. భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ (692 పరుగులు) నిలిచాడు. ఈ సందర్భంగా ఆసీస్‌ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్‌ను టార్గెట్‌ చేస్తూ అదరగొట్టాడు. వీరిద్దరి మధ్య పోరు చూడటం కూడా భలే బాగుంది. ఆ సిరీస్‌లో జాన్సన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ఆసీస్‌ పర్యటనలో తొలి మ్యాచ్‌ సందర్భంగా జాన్సన్‌ వేసిన తొలి బంతే నా తలకు తగిలింది. ఆ బాల్‌ను నమ్మలేకపోయా. దాదాపు రెండు నెలలపాటు తీవ్రంగా శ్రమించి.. అలా ఆడాలి.. ఇలా ఆడాలి అని ఊహించుకుంటూ అక్కడికి వెళ్లా.. కానీ, ఆ ఒక్క బంతితో నా ప్రణాళికలన్నీ మారిపోయాయి. ఆ దెబ్బకు నా ఎడమ కంటిచూపు కూడా కాస్త మందగించడం ప్రారంభమైంది. కన్ను వాచినట్లు అనిపించింది. అయితే, అప్పుడు దానిని పెద్దగా పట్టించుకోలేదు. లంచ్‌ సమయంలో నా ముందు రెండు విషయాలు మాత్రమే ఉన్నాయనిపించింది. పోరాడటమా..? ఫ్లైట్‌ ఎక్కి భారత్‌కు వచ్చేయడమా? నేను మాత్రం తొలిదానికే మొగ్గు చూపా. నా తలను బంతితో కొట్టడానికి అతడికెంత ధైర్యం? అని అనుకున్నా. ఆ సిరీస్‌లో అతడి బౌలింగ్‌ను చిత్తు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. చివరికి మిచెల్‌ జాన్సన్‌పై ఆధిపత్యం ప్రదర్శించగలిగా’’ అని విరాట్ తెలిపాడు. 

ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ను 0-2 తేడాతో టీమ్‌ఇండియా కోల్పోయింది. తొలి రెండు మ్యాచుల్లో ఆసీస్‌ విజయం సాధించగా.. మిగతా రెండు డ్రాగా ముగిశాయి. ఎంఎస్ ధోనీ గైర్హాజరీతో తొలి మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత రెండు, మూడు టెస్టులకు ధోనీనే నాయకత్వం వహించాడు. అప్పుడే ధోనీ టెస్టులకు వీడ్కోలు పలకడంతో చివరి టెస్టులో విరాట్ కోహ్లీ పూర్తిస్థాయి కెప్టెన్సీని స్వీకరించాడు. ఈ సిరీస్‌లో స్టీవ్‌స్మిత్‌తో కలిసి ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇరువురూ నాలుగేసి శతకాలు బాదారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని