Virat Kohli: ఏకైక భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు

తన జట్టు గెలవకపోయినా.. విరాట్ కోహ్లీ మాత్రం ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

Published : 03 Apr 2024 09:20 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో బెంగళూరుకు మూడో ఓటమి ఎదురైంది. సొంతమైదానంలో వరుసగా రెండో పరాజయం చవిచూసింది.  లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరిగింది. ఈ క్రమంలో స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఒకే వేదికపై 100 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత క్రికెటర్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ 16 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. విరాట్ తర్వాత రోహిత్ శర్మ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో 80 మ్యాచ్‌లు, ఎంఎస్ ధోనీ చెపాక్‌ మైదానంలో 69 మ్యాచులు ఆడారు. ఒకే వేదికపై ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ముగ్గురు బ్యాటర్లు వీరే.

కోహ్లీ వరల్డ్‌ కప్‌ ఆడాల్సిందే: బ్రెట్ లీ

వన్డే ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ.. చాలా రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాడు. ఐపీఎల్‌లో అదరగొట్టేస్తున్న కోహ్లీని పొట్టి కప్‌లోనూ ఆడించాలని ఇప్పటికే మాజీ క్రికెటర్లు సూచించారు. తాజాగా ఆసీస్‌ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ కూడా ఇదే విషయంపై స్పందించాడు. యువ బౌలర్ మయాంక్‌పై ప్రశంసలు కురింపించాడు. ‘‘టీ20 ప్రపంచ కప్‌లో పెద్ద స్టార్లు ఆడాలని కోరుకుంటా. అందులో విరాట్ కోహ్లీ ఆడాల్సిందే. లఖ్‌నవూ యువ బౌలర్‌ మయాంక్ అద్భుతమైన పేసర్. ఇప్పుడు ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్’గా నిలిచాడు. అతడు 155+ వేగంతో బంతులేశాడు. అతడిపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెట్టకూడదు. ఎందుకంటే ప్రస్తుతం అతడి వయసు 21 మాత్రమే. నాణ్యమైన పేస్‌తోపాటు బౌలింగ్ శైలి కూడా చాలా బాగుంది. ఇలానే కొనసాగితే తప్పకుండా ఉన్నత స్థాయికి వెళ్తాడు. పేసర్‌గా నన్ను ఈ ఐపీఎల్‌లో ఆకట్టుకుంది జస్‌ప్రీత్ బుమ్రానే. అతడిని సరిగ్గా వినియోగించుకోవడం లేనిపిస్తోంది. బుమ్రా కొత్త బంతితో బౌలింగ్‌ చేయడం లేదు. అయినా సరే స్వింగ్‌ రాబట్టేందుకు ప్రయత్నించాడు’’ అని బ్రెట్‌ లీ వ్యాఖ్యానించాడు. జూన్‌ 1 నుంచి యూఎస్‌ఏ, విండీస్‌ సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు