WTC Final: చివరి రోజు ఆట.. విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ వైరల్‌!

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (Wtc Final 2023) భారత్‌ విజయం సాధించడానికి తీవ్రంగా పోరాడుతోంది. స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రీజ్‌లోఉండటంతో అభిమానుల్లో ఆశలు నిలిచాయి.

Published : 11 Jun 2023 14:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో (WTC Final) చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. భారత్ 280 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 164/3 స్కోరుతో ఉంది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (44*), అజింక్య రహానె (20*) ఉన్నారు. స్వల్ప వ్యవధిలో రోహిత్, పుజారా ఔటైనప్పటికీ విరాట్ మాత్రం నిలకడగా ఆడాడు. సాధికారిక ఆటతీరుతో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పెట్టిన స్టోరీ వైరల్‌గా మారింది. తన మైండ్‌సెట్‌ ఏంటో అభిమానులకు తెలిపేలా ఆసక్తికర పోస్టు పెట్టాడు. 

‘‘మనం ఆందోళనలు, భయాలు, సందేహాలు ఉంటే .. ప్రశాంతంగా జీవించడానికి, ప్రేమించడానికి చోటు ఉండదు.  అందుకే అలాంటివాటిని వదిలేసి ఉండటంపై సాధన చేయాలి’’ అని థిచ్ నాట్ హన్హ్ కొటేషన్‌ను విరాట్ ఇన్‌స్టా స్టోరీలో ఉంచాడు. రెండు రోజుల కిందట కూడా తన విమర్శకులకు ఘాటైన సమాధానం ఇస్తూ చేసిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది. ‘ఇతరుల అయిష్టాన్ని అంగీకరించ గల సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. అప్పుడే జైలును తలపించే వారి అభిప్రాయాల నుంచి బయట పడగలుగుతాం’ అనే అర్థం వచ్చేలా సందేశాన్ని ఉంచాడు.

చాలా హ్యాపీగా ఉన్నా

‘‘ప్రస్తుతం నేను ఉన్న దశలో చాలా ఆనందంగా ఉన్నా. గత కొన్నేళ్లుగా ఎన్నో జరిగిపోయాయి. సుదీర్ఘ కెరీర్‌లో మైదానం వెలుపల, బయటా ఎన్నో చూశా. ఇన్నేళ్లు ఆడటం కూడా చాలా కష్టం. ఇప్పుడు మళ్లీ నా అత్యుత్తమ క్రికెట్‌ను ఆడుతున్నట్లు అనిపిస్తోంది. జట్టు కోసం ఆడుతూనే ఎంజాయ్ చేస్తున్నా. తొలుత ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఆడా. ఆ తర్వాత నేను సారథిగా ఉన్నా. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో ఆడుతున్నా. అన్నివేళలా గర్వంగానే ఫీలవుతా. ఎప్పుడు కూడానూ ఒత్తిడిని కాకుండా గేమ్‌ను ఆస్వాదించడానికే ప్రయత్నించా’’ అని విరాట్ కోహ్లీ మాట్లాడిన వీడియోను ఐసీసీ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

సచిన్‌ను అధిగమించిన కోహ్లీ

విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును అధిగమించాడు. ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో విరాట్ 678 (16 మ్యాచుల్లో) పరుగులతో కొనసాగుతున్నాడు. గతంలో సచిన్‌ 15 మ్యాచుల్లో 657 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును విరాట్ అధిగమించాడు. ఇక ఆసీస్‌పై 2000కంటే ఎక్కువ పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా విరాట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ ఇప్పుడు 2037 పరుగులతో ఉన్నాడు. సచిన్‌ అందరికంటే ఎక్కువగా 3,630 పరుగులు చేశాడు. ఆ తర్వాత లక్ష్మణ్‌ (2,434), రాహుల్‌ ద్రవిడ్ (2,143), పుజారా (2,074) ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని