IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటన.. ‘రో-కో’ జోడీ అన్ని సిరీస్‌లకు అందుబాటులో ఉండదా..?

భారత స్టార్‌ ద్వయం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli - Rohit Sharma) ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లోనూ ఆడటం లేదు. దాదాపు నెల రోజులపాటు ఉండే దక్షిణాఫ్రికా పర్యటనకూ వీరిద్దరూ ఆలస్యంగా జట్టుతోపాటు చేరే అవకాశం ఉంది.

Published : 29 Nov 2023 13:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ ఇండియా (Team India) ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఆడుతోంది. కానీ, సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్‌, జడేజా వంటి మేటి ఆటగాళ్లు లేకుండానే సూర్యకుమార్‌ నాయత్వంలో బరిలోకి దిగింది. డిసెంబర్ 10 నుంచి దాదాపు నెల రోజులపాటు సాగే దక్షిణాఫ్రికా పర్యటనకు (IND vs SA) మాత్రం సీనియర్లు వచ్చేస్తారని అంతా భావిస్తున్నారు. కానీ, స్టార్‌ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం పరిమిత ఓవర్ల సిరీస్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డే, టీ20 సిరీస్‌ నుంచి తనకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐకి (BCCI) ప్రతిపాదించినట్లు సమాచారం. టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు విరాట్ పొట్టి ఫార్మాట్‌లో ఆడలేదు. తాజాగా వన్డే ప్రపంచకప్‌లో అతడే టాప్‌ స్కోరర్‌ అయినప్పటికీ దక్షిణాఫ్రికాతో వన్డేలకూ దూరంగా ఉండాలనుకోవడం మాత్రం అభిమానుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి వైదొలిగేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? అని చర్చకు తెరలేచింది. మరోవైపు కెప్టెన్‌ రోహిత్ నుంచి ఇంకా ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. బుమ్రా, జడ్డూ, షమీ, సిరాజ్‌ మాత్రం మూడు ఫార్మాట్లలో ఆడే అవకాశం ఉంది. 

దక్షిణాఫ్రికాతో (IND vs SA) మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులను టీమ్‌ఇండియా ఆడనుంది. డిసెంబర్ 10న మొదలయ్యే పర్యటన జనవరి 7తో ముగియనుంది. భారత జట్టు చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ సిరీస్‌లకు త్వరలోనే జట్లను ఎంపిక చేయనుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కుటుంబంతో కలిసి లండన్‌లో విహారానికి వెళ్లాడు. రోహిత్ కూడా యూకేలోనే ఉన్నట్లు క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఆసీస్‌తో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమితో భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని