Virat Kohli: ఏబీడీ లేని లోటు సుస్పష్టం.. విరాట్ ఒక్కడే గెలిపించడం అసాధ్యం: భారత మాజీలు

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్న బెంగళూరుకు సొంతమైదానం కూడా కలిసిరావడం లేదు.

Updated : 03 Apr 2024 15:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో బెంగళూరు పరిస్థితి ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక్కడే మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్టార్‌ ప్లేయర్లు డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రభావం చూపించడం లేదు. కీలకమైన నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్‌ లేని లోటు సుస్పష్టంగా కనిపిస్తోందని భారత మాజీ క్రికెటర్ మనోజ్‌ తివారీ వ్యాఖ్యానించాడు.

ఆసీస్‌కు బాగానే ఆడాడు.. కానీ: మనోజ్ తివారీ

‘‘లఖ్‌నవూ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేం కాదు. కానీ, బెంగళూరుకు ఏబీ డివిలియర్స్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కామెరూన్‌ గ్రీన్ ఆస్ట్రేలియా తరఫున అద్భుతంగా ఆడాడు. బెంగళూరు జట్టుకు మాత్రం విఫలమవుతున్నాడు. డుప్లెసిస్‌ కెప్టెన్సీ నిర్ణయాలు కూడా గొప్పగా లేవు. మరో ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు. మొత్తం 14లో కనీసం సగం మ్యాచుల్లోనైనా విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడాలి’’ అని మనోజ్ తివారీ తెలిపాడు. 

ప్రతి ఫ్రాంచైజీ కోరుకునేది అదే..: సెహ్వాగ్

‘‘ఒక్కడే ఏడెనిమిది ఇన్నింగ్స్‌ల్లో అద్భుతంగా ఆడటం కష్టం. కోహ్లీకీ అది అసాధ్యమే. ఒక్కడిపైనే ఆధారపడటం సరికాదు. భారీ మొత్తం వెచ్చించిన స్టార్‌ ఆటగాడి నుంచి ప్రతి ఫ్రాంచైజీ కనీసం రెండు మ్యాచుల్లోనైనా అద్భుత ఇన్నింగ్స్‌లను ఆశిస్తుంది. ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తే సరిపోతుంది’’ అని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో బెంగళూరు మూడు ఓటములు, ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని