Hardik Pandya: హార్దిక్‌.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత దారుణంగా ట్రోలింగ్‌కు గురైన కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్‌ హోరెత్తించారు.

Published : 24 Apr 2024 15:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి పరిస్థితి అధ్వానంగా తయారైంది. స్టార్‌ ప్లేయర్లు ఉన్నా గెలుపు కోసం కష్టపడాల్సి వస్తోంది. కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శనలోనూ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ప్రభావం చూపించడం లేదు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి కనీసం ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడమూ కష్టమేనన్న అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) పాండ్యకు కీలక సూచన చేశాడు. గత మూడు సీజన్లలోనూ రోహిత్ శర్మ (Rohit Sharma) ముంబయిని విజేతగా నిలపలేదని.. పాండ్య తన ప్రదర్శనను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. 

‘‘బ్యాటర్‌గా, బౌలర్‌గా హార్దిక్ పాండ్యపై ఒత్తిడి ఎక్కువగా ఉందని అనుకోవడం లేదు. అతడే అలా భావిస్తున్నాడేమోనని అనిపిస్తోంది. రోహిత్‌ నుంచి సారథ్య బాధ్యతలను చేపట్టిన పాండ్యపై భారీ అంచనాలు ఉండటం సహజమే. కానీ, ముంబయికి ఇలాంటి పరిస్థితి గత రెండు సీజన్ల నుంచి ఉంది. రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌గా పరుగులు చేయలేకపోయాడు. ఇటీవల ట్రోఫీని కూడా సాధించి పెట్టలేదు. కాబట్టి, పాండ్య కూడా ఎలాంటి ఒత్తిడికి గురికానక్కర్లేదు. జట్టుగా ఆడితేనే ముంబయికి విజయాలు దక్కుతాయి. అలా జరగాలంటే.. ముందు హార్దిక్‌ పాండ్య తన వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలి. కెప్టెన్సీలో జట్టు విజయాలు సాధించలేకపోవడంతో అదనపు ఒత్తిడిగా భావిస్తున్నాడు. తన బ్యాటింగ్‌ ఆర్డర్‌లోనూ మార్పులు చేసుకోవాలి. లోయర్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ వచ్చినప్పుడు ఎక్కువ బంతులు ఎదుర్కోవడం సాధ్యం కాదు. అందుకే, తనకుతానే అవకాశం సృష్టించుకోవాలి. మొదట బ్యాటింగ్‌ బాగా చేస్తే ఆటోమేటిక్‌గా బౌలింగ్‌తోపాటు కెప్టెన్సీలోనూ మెరుగుదల కనిపిస్తుంది’’ అని సెహ్వాగ్‌ తెలిపాడు. 

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబయి 8 మ్యాచ్‌లు ఆడింది. కేవలం మూడు విజయాలతో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లోనూ గెలిస్తే మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఒక్కటి ఓడినా ఛాన్స్‌లు క్రమంగా కరిగిపోయే ప్రమాదం లేకపోలేదు. లఖ్‌నవూ, కోల్‌కతాతో రెండేసి మ్యాచ్‌లు.. హైదరాబాద్, దిల్లీ జట్లతో ఒక్కో మ్యాచ్‌ను ముంబయి ఆడాల్సిఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని