Virat - Gambhir: ఓటమిని నిశ్శబ్దంగా అంగీకరించాల్సిందే: సెహ్వాగ్‌

స్టార్‌ ఆటగాళ్ల మధ్య వివాదంపై బీసీసీఐ (BCCI) కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశాడు. అలాగే ఓడిపోయిన జట్టుకు కీలక సూచనలు చేశాడు.

Published : 04 May 2023 16:12 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) మ్యాచ్‌ల మజా కంటే గంభీర్ - విరాట్ వాగ్వాదం హైలైట్‌గా నిలిచింది. ఒకరినొకరు కవ్వించుకుంటూ చేసిన హంగామా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, వీరిద్దరిపై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది. లఖ్‌నవూ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీపై ఆర్‌సీబీ విజయం సాధించడంతో ఈ వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో గంభీర్ - విరాట్ వ్యవహారంపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్ అయితే మరొక అడుగు ముందుకేసి కఠిన శిక్ష విధించాలని సూచించాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విజేతగా నిలిచిన జట్టు సంబరాలు చేసుకుంటూ వెళ్లాలని, ఓడిన జట్టు నిశ్శబ్దంగా అక్కడ నుంచి వెళ్లిపోవాలని పేర్కొన్నాడు. 

‘‘మ్యాచ్‌ ముగిసిన తర్వాత వెంటనే నేను టీవీ ఆపేస్తా. కాబట్టి విరాట్ - గంభీర్‌ ఎపిసోడ్‌ను చూడలేకపోయా. మరుసటి రోజు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అయిపోయింది. అక్కడ జరిగింది మాత్రం సరైంది కాదు. ఓడిపోయినవారు నిశ్శబ్దంగా ఓటమిని అంగీకరించి అక్కడ నుంచి వెళ్లిపోవాలి. గెలిచిన టీమ్ సంబరాలు చేసుకుంటూ వెళ్లాలి. ఒకరినొకరు ఏదొక మాట అనడం ఎందుకు? వారిద్దరూ సెలబ్రెటీలు. వారు ఏం చేసినా..? ఏం మాట్లాడినా..? లక్షల మంది చిన్నారులు, అభిమానులు చూస్తారు. ‘మా ఐకాన్‌ ఇలా చేశాడు కాబట్టి.. నేను కూడా చేయొచ్చు’ అని అనుకొనే ప్రమాదమూ లేకపోలేదు. వీటన్నింటినీ మదిలో పెట్టుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ’’ అని సెహ్వాగ్‌ తెలిపాడు. 

ఇలాంటి సంఘటనలపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వారిపై నిషేధం విధించాల్సిన అవసరమూ ఉందని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు. ‘‘ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరిపైనైనా బ్యాన్ వేస్తే పునరావృతం కాకుండా చూడొచ్చు. బీసీసీఐ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. డ్రెస్సింగ్‌ రూమ్‌లో మంచి వాతావరణం ఉండేలా చూడాలి. మైదానంలో స్టార్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు మాత్రం సహేతుకంగా లేదు’’ అని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని