Sehwag: బాబూ కెమెరామెన్.. రుతురాజ్‌ కెప్టెన్‌.. అతడిని కాస్త చూపించు: వీరేంద్ర సెహ్వాగ్‌

ఐపీఎల్ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే బెంగళూరును చెన్నై చిత్తు చేసింది. కొత్త కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ అద్భుతమైన ప్రతిభ చూపించాడు.

Updated : 23 Mar 2024 11:50 IST

ఇంటర్నెట్ డెస్క్: రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కెప్టెన్‌గా తొలి విజయం నమోదు చేశాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో బెంగళూరుతో మ్యాచ్‌కు ఒక్కరోజు ముందు ధోనీ నుంచి చెన్నై జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాలను నడిపించడంలో అద్భుత నాయకత్వం ప్రదర్శించాడు. ‘‘గొప్ప జట్టుకు సారథిగా పని చేయడం గౌరవంగా భావిస్తున్నా. నా శైలిలోనే కెప్టెన్సీ నిర్వర్తిస్తా. ధోనీ లేదా ఇతరుల బాటలో పయనించను. వారి నుంచి నేర్చుకున్న వాటిని అమలు చేస్తా’’ అని రుతురాజ్‌ తెలిపాడు. అతడు అనుకున్నట్లుగానే స్వతహాగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ క్రమంలో రుతురాజ్‌ సారథ్యంపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. సచిన్, ఇర్ఫాన్ పఠాన్‌ అభినందించగా.. వీరేంద్ర సెహ్వాగ్ కాస్త విభిన్నంగా స్పందించడం విశేషం.

‘‘తొలి 26 బంతుల్లో బెంగళూరు అద్భుతంగా ఆడింది. అయితే, చెన్నై పుంజుకొన్న తీరు బాగుంది. రుతురాజ్‌ బౌలింగ్ మార్పులు సూపర్. ఒత్తిడిలోనూ నాయకత్వం ఆకట్టుకుంది’’ - ఇర్ఫాన్ పఠాన్ 

‘‘కొన్నాళ్ల కిందట రుతురాజ్‌ను చూశా. చెన్నై జట్టుకు ఎప్పుడైనా సరే కెప్టెన్‌ అవుతాడని గతంలోనే పోస్టు పెట్టా. ప్రత్యర్థి దూకుడుగా ఆడుతున్న సమయంలో నిశ్శబ్దంగా నిర్ణయాలు తీసుకోవడం అద్భుతం. బ్యాటర్‌గానూ నాణ్యమైన షాట్లతో అలరిస్తాడు’’ - సచిన్‌ తెందూల్కర్

‘‘రుతురాజ్‌ కెప్టెన్సీ బాగుంది. అయితే, ఇక్కడ కెమెరామెన్‌కు ఓ విజ్ఞప్తి. రుతురాజ్‌ను కెమెరాల్లో చూపించండి. అతడు చెన్నై కెప్టెన్. కానీ, కెమెరామెన్‌ మాత్రం ఎక్కువగా ధోనీని చూపిస్తున్నాడు’’ - వీరేంద్ర సెహ్వాగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని