Hardik - Rohit: అప్పుడు ‘ఐదు’ ఓడారు.. ముంబయి కెప్టెన్సీ మార్పుపై కాస్త ఓపిక పట్టండి: సెహ్వాగ్

హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) కెప్టెన్సీ మార్పుపై ఇప్పుడే చర్చించడం తగదని.. సరైన సమయం కూడా కాదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు.

Updated : 03 Apr 2024 10:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: హార్దిక్‌ పాండ్య నాయకత్వంలోని ముంబయి జట్టు ఇప్పటి వరకు 17వ సీజన్‌లో బోణీ కొట్టలేదు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. దీంతో పాండ్యను కెప్టెన్‌గా పక్కన పెట్టేసి రోహిత్‌కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్లూ వస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ మనోజ్‌ తివారీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. కానీ, డ్యాషింగ్‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఇప్పుడే ఇలాంటి వాటిపై మాట్లాడటం తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించాడు. 

‘‘పాండ్య గురించి తివారీ ఇప్పుడే ఇలాంటివి చెప్పడం తొందరపాటే. గతంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ ముంబయి వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయింది. అదే ఏడాది ఛాంపియన్‌గా నిలిచింది. కాబట్టి, మనం పాండ్య కెప్టెన్సీ గురించి ఇంకాస్త ఓపిగ్గా ఉండాలి. ఓ అంచనాకు వచ్చే ముందు మరో రెండు మ్యాచ్‌ల వరకైనా వేచి చూడాలి’’ అని సెహ్వాగ్‌ తెలిపాడు. 

మనోజ్‌ తివారీ ఏమన్నాడంటే?

‘‘హార్దిక్‌ పాండ్య చాలా ఒత్తిడిలో ఉన్నాడు. బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు కూడా.. బౌలింగ్‌ దాడిని ప్రారంభించే బౌలర్‌తో తొలి ఓవర్‌ను వేయించలేదు. బుమ్రా అద్భుతంగా స్వింగ్‌ రాబట్టాడు. కానీ, అతడిని ఎక్కవ వినియోగించుకోవాలో పాండ్యకు తెలిసినట్లు లేదు. అందుకే, రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా చేస్తే బాగుంటుంది. కెప్టెన్సీ మార్పు అనేది పెద్ద నిర్ణయమే అవుతుంది’’ అని మనోజ్ తివారీ వ్యాఖ్యానించాడు.

హార్దిక్‌ ఒంటరైనట్లు అనిపిస్తోంది: హర్భజన్‌

సోషల్‌ మీడియాలో ఓ చిత్రం వైరల్‌గా మారింది. డగౌట్‌లో ఒక్కడే కూర్చున్న ఫొటో అది. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీపై హర్భజన్‌ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ అలాంటి విజువల్స్‌ చూడటం బాగోలేదు. అతడిని ఒంటరిగా వదిలేసినట్లు అనిపిస్తోంది. ఫ్రాంచైజీలోని ప్రతి ఆటగాడూ పాండ్యను కెప్టెన్‌గా అంగీకరించాల్సిందే. ఈ జట్టుకు ఆడిన ఆటగాడిగా చెబుతున్నాను.. ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు’’ అని భజ్జీ తెలిపాడు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఇదే విధంగా స్పందించాడు. ‘‘కావాలనే ఇలా జరుగుతుందని అనుకోవడం లేదు. పాండ్య అయోమయానికి గురవుతున్నాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో పెద్ద స్టార్లు ఉండటం వల్ల హార్దిక్‌ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు అనిపిస్తోంది’’ అని అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని