IPL 2023: అలా అయితే ఐపీఎల్‌లో ఆడొద్దు.. వార్నర్‌పై సెహ్వాగ్‌ తీవ్ర విమర్శలు

దూకుడుగా ఆడే డేవిడ్‌ వార్నర్ ఐపీఎల్‌ (IPL 2023) 16వ సీజన్‌లో మాత్రం తన స్థాయి ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమవుతున్నాడు. హాఫ్‌ సెంచరీలు సాధించినా జట్టును గెలిపించలేకపోతున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Published : 09 Apr 2023 14:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో (IPL) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఆసీస్ టాప్‌ బ్యాటర్ డేవిడ్‌ వార్నర్‌... ప్రస్తుత సీజన్‌లో మాత్రం దిల్లీ క్యాపిటల్స్‌కి (Delhi Capitals) ఇప్పటి వరకు అతని సారథ్యంలో ఆడిన జట్టుకు మూడు మ్యాచుల్లో ఒక్క విజయం కూడా సాధించపెట్టలేకపోయాడు. రెగ్యులర్‌ సారథి రిషభ్‌ పంత్ (Rishabh pant) రోడ్డు ప్రమాదానికి గురై ఈ సీజన్‌కు దూరం కావడంతో వార్నర్‌కు జట్టు పగ్గాలను మేనేజ్‌మెంట్ అప్పగించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లోనూ మునుపటి దూకుడు కనిపించడంలేదనే విమర్శలు వచ్చాయి. తాజాగా రాజస్థాన్‌ చేతిలోనూ 57 పరుగుల తేడాతో దిల్లీ (RR vs DC) ఓటమిపాలైంది. వార్నర్ రాజస్థాన్‌ మీద 55 బంతుల్లో 65 పరుగులు చేశాడు.  ఈ క్రమంలో డేవిడ్ వార్నర్‌ ఆటతీరు, నాయకత్వంపై టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ తీవ్ర విమర్శలు గుప్పించాడు. వేగంగా పరుగులు చేయకపోతే మాత్రం ఐపీఎల్‌లో ఆడొద్దని హితవు పలికాడు.

‘‘డేవిడ్‌ వార్నర్‌కు చెప్పాల్సిన సమయం ఇదేనని నేను భావిస్తున్నా. అతడికి బాధ కలిగినా సరే.. ఇంగ్లిష్‌లో చెప్పాలి. డేవిడ్, ఉత్తమ ఆటతీరును ప్రదర్శించు. 25 బంతుల్లో 50 పరుగులు చేయాలి కానీ.. మరీ నిదానంగా ఆడొద్దు. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను చూసి నేర్చుకో. అతడు కేవలం పాతిక బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసేశాడు. అలా ఆడలేకపోతే మాత్రం.. వార్నర్ నువ్వు ఇక్కడికి రావొద్దు.. ఐపీఎల్‌లో ఆడొద్దని చెబుతా.. డేవిడ్‌ వార్నర్.. 55 బంతుల్లో 65 పరుగులు చేసే కన్నా 30ల్లోనే ఔటైపోతే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది. వెనుక ఉన్న రోవ్‌మన్ పావెల్, ఇషాన్ పోరెల్‌ కాస్త ముందొచ్చి ఆడేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు ఫలితం మారే ఛాన్సూ ఉంది. భారీ హిట్టింగ్‌ చేయగల అలాంటి బ్యాటర్లకు తగినన్ని బంతులు వదిలేస్తే గెలిపించగలరు’’ అని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు.

అనుభవం ఉండి మరీ..: రోహన్‌ గావస్కర్

ఐపీఎల్‌లో దాదాపు 6వేలకుపైగా పరుగులు చేసిన అనుభవం కలిగిన డేవిడ్‌ వార్నర్‌ నిదానంగా ఆడటాన్ని భారత మాజీ ఆటగాడు రోహన్‌ గావస్కర్ కూడా తప్పుబట్టాడు. ‘‘ఒకవేళ 8 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటైతే.. సరైన రిథమ్‌లో లేడులే అని పట్టించుకోరు. కానీ, కెప్టెన్‌ అయి ఉండి, అనుభవం కలిగిన బ్యాటర్‌ ఎక్కువ బంతులను వృథా చేయడం సరైంది కాదు. ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడతావని నువ్వు (వార్నర్) కూడా అనుకోని ఉండవు. ఒకవేళ దిల్లీకి వార్నర్‌ కెప్టెన్‌ కాకుండా అయితే రిటైర్‌హర్ట్‌గా మేనేజ్‌మెంట్‌ వెనక్కి పిలిచేది. భారత యువ బ్యాటర్‌ ఇలాంటి ప్రదర్శన చేస్తే.. అదే అతడి చివరి మ్యాచ్‌ అయ్యేది. రాజస్థాన్‌ ఓటమికి పూర్తి బాధ్యత డేవిడ్‌ వార్నర్ తీసుకోవాల్సిందే’’ అని విమర్శించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని