Hyderabad Vs Rajasthan: ఇప్పుడే కాదు.. ఏం చేసినా కప్‌ గెలిచాకనే: షాబాజ్‌ అహ్మద్

తొలి క్వాలిఫయర్‌లో ఓటమిపాలైన హైదరాబాద్‌ మళ్లీ పుంజుకుంది. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఫైనల్‌కు చేరుకుంది.

Updated : 25 May 2024 08:02 IST

ఇంటర్నెట్ డెస్క్: రెండో క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌ అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్‌పై 36 పరుగుల తేడాతో గెలవడంలో సన్‌రైజర్స్ బౌలర్‌ షాబాజ్‌ కీలక పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులే ఇచ్చి డేంజరస్‌ బ్యాటర్లు యశస్వి జైస్వాల్‌, రియాన్‌ పరాగ్‌తోపాటు అశ్విన్‌ను ఔట్ చేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన అతడు బ్యాటింగ్‌లోనూ విలువైన 18 పరుగులు సాధించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. తమ జట్టు విజయంపై మ్యాచ్‌ అనంతరం షాబాజ్ మాట్లాడాడు. 

‘‘మ్యాచ్‌కు ముందు మా కెప్టెన్‌, మా కోచ్‌ ఒకటే మాట చెప్పారు. పరిస్థితిని బట్టి నన్ను రంగంలోకి దింపుతామన్నారు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. బ్యాటింగ్‌ లైనప్‌ కుప్పకూలినప్పుడు పంపిస్తామని.. సిద్ధంగా ఉండాలన్నారు. నేను క్రీజ్‌లోకి వచ్చాక.. అవేశ్‌ ఖాన్, సందీప్ శర్మ బౌలింగ్‌ చూసిన తర్వాత పిచ్‌ మ్యాజిక్‌ చేసేలా ఉందనిపించింది. ఇలాంటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణించి అవార్డు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. జట్టులోని వాతావరణం చాలా బాగుంది. ఇప్పుడే మేం సంబరాలు చేసుకోం. ఫైనల్‌లో గెలిచి భారీగా సెలబ్రేషన్స్‌ చేసుకొంటాం. ఈ మ్యాచ్‌లో విజయంతో కేవలం రిలాక్స్‌ అయ్యాం. ముందుంది అసలు సమరం’’ అని షాబాజ్‌ తెలిపాడు. 

నేను 4 ఓవర్లు వేస్తానని అనుకోలేదు: శర్మ

‘‘నెట్స్‌లో బౌలింగ్‌పైనా దృష్టిపెట్టా. గత రెండేళ్లు ఎక్కువగా బ్యాటింగ్‌ మాత్రమే చేసేవాడిని. ఈ మ్యాచ్‌లో నేను నాలుగు ఓవర్ల కోటా వేస్తానని అనుకోలేదు. మా నాన్నతో కలిసి బౌలింగ్ ప్రాక్టీస్‌ చేశా. రెండో ఇన్నింగ్స్‌లో బంతి ఎక్కువగా టర్న్‌ అయింది. దీంతో కమిన్స్‌ స్పిన్నర్లకే బంతినిచ్చాడు. మా జట్టు నుంచి వచ్చే సందేశం చాలా సింపుల్‌గా ఉంటుంది. స్వేచ్ఛ ఇస్తాం.. మీ సత్తా ఏంటో చూపించండి. ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడటం నా కల. ఇప్పుడది నిజమైంది. తప్పకుండా టైటిల్‌ కొడతామని భావిస్తున్నా’’ అని అభిషేక్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు.. 

  • చెపాక్‌ వేదికగా జరిగిన 8 ఐపీఎల్ ప్లేఆఫ్స్‌ మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే ఆరుసార్లు గెలిచింది. 
  • ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో ఎక్కువ ఓటములను చవిచూసిన ఆరో జట్టు రాజస్థాన్‌. మొత్తం 11 మ్యాచుల్లో 6 పరాజయాలను నమోదు చేసింది. 
  • ఐపీఎల్‌ ఫైనల్‌కు అత్యధికసార్లు చేరిన ఐదో జట్టు సన్‌రైజర్స్. ఇప్పుడు మూడోసారి ఫైనల్‌కు చేరింది. ఈ జాబితాలో సీఎస్కే (10) అందరికంటే ముందుంది.
  • ఒకే ఐపీఎల్‌ సీజన్‌లో కెప్టెన్‌గా అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడు పాట్ కమిన్స్. ఈ సీజన్‌లో ఇప్పటికి 17 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ (19) రాజస్థాన్‌ సారథిగా 2008లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. మరో రెండు వికెట్లు తీస్తే వార్న్‌ను కమిన్స్ అధిగమిస్తాడు.
  • ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో బౌలర్ షాబాజ్ (3/23). భువనేశ్వర్‌ కుమార్ 2016లో 3/19 ప్రదర్శన చేశాడు.
  • ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఒక ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీయడం ఇది రెండోసారి. తొమ్మిది ఓవర్లలో 57 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని