IPL: వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!

ఐపీఎల్‌.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్‌ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్‌ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్‌ వీరుల సందడి అంతాఇంతా కాదు.

Published : 12 Apr 2024 11:28 IST

ఐపీఎల్‌.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్‌ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్‌ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హావభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్‌ వీరుల సందడి అంతాఇంతా కాదు. ఒకప్పుడు క్రిస్‌ గేల్, డ్వేన్‌ బ్రావో లాంటి వాళ్లు ఐపీఎల్‌కు గొప్ప ఆకర్షణగా నిలిచారు. వాళ్లు చెలరేగితే ఇక మ్యాచ్‌ గెలిచినట్టే అన్న భావన కల్పించారు. ఆ అంచనాలను కొనసాగిస్తూ ఐపీఎల్‌-17లోనూ విండీస్‌ వీరులు మెరుపులు మెరిపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సునీల్‌ నరైన్, రొమారియో షెఫర్డ్, ఆండ్రీ రసెల్, నికోలస్‌ పూరన్‌ లాంటి తారలు తమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 

కోల్‌కతాలో ఇద్దరు యోధులు

ఆండ్రీ రసెల్ (Andre Russell), సునీల్‌ నరైన్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించడంలో వీరిది కీలకపాత్ర. రసెల్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 25 బంతుల్లోనే 64 పరుగులు సాధించి 2 వికెట్లు కూడా తీసి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఇక దిల్లీ క్యాపిటల్స్‌పై 19 బంతుల్లోనే 41 పరుగులు రాబట్టి కోల్‌కతా భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో అతడి దూకుడు కారణంగానే ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా కేకేఆర్‌ ఘనత సాధించింది. ఆఖర్లో వచ్చినా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో రసెల్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. గతంలోనూ అతడు కోల్‌కతాకు ఈ పాత్ర పోషించినా.. ఇప్పుడు కోచ్‌ గంభీర్‌ రాకతో మరింత సంయమనంతో.. మరింత కాలిక్యులేటెడ్‌గా ఆడుతున్నాడు. ఇక సునీల్‌ నరైన్‌ (Sunil Narine) ఓ భిన్న పాత్రలో కోల్‌కతా విజయాలకు తోడ్పాటునందిస్తున్నాడు. గతంలో బౌలర్‌గా అదరగొట్టిన అతడు ఈసారి బ్యాట్‌తో విజృంభిస్తున్నాడు. బెంగళూరుపై 47... దిల్లీపై 85 పరుగులతో జట్టు విజయాలకు బాటలు వేశాడు. ఇక ఆ రెండు మ్యాచ్‌ల్లో బంతితో మాయ చేసి ఒక్కో వికెట్‌ పడగొట్టాడీ కరీబియన్‌ స్టార్‌. ఓపెనర్‌గా బరిలో దిగుతూ ఆరంభంలోనే ధనాధన్‌ ఆటతో ప్రత్యర్థి బౌలర్లను కుదురుకోనీయకుండా చేస్తున్నాడు నరైన్‌. స్పిన్‌ అయినా పేస్‌ అయినా తొలి బంతి నుంచే దూకుడుగా ఎదుర్కొంటున్నాడు. ఫలితంగా కోల్‌కతాకు శుభారంభాలు దక్కుతున్నాయి. వెంకటేశ్‌ అయ్యర్‌ లాంటి ఆటగాళ్లు విఫలం అవుతున్నా కూడా కోల్‌కతా గెలుస్తుందంటే నరైన్‌ మెరుపులే ఓ కారణం.

అటు షెఫర్డ్‌.. ఇటు పూరన్‌ 

కేవలం 10 బంతుల ఇన్నింగ్స్‌తో తానేంటో చాటాడు రొమారియో షెఫర్డ్‌ (Romario Shepherd). ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్న ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ దిల్లీ క్యాపిటల్స్‌పై దుమ్మురేపాడు. 6 బంతుల్లోనే 32 పరుగులు సాధించిన షెఫర్డ్‌.. ముంబయి భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాక బౌలింగ్‌లోనూ ఓ వికెట్‌ పడగొట్టి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఐపీఎల్‌-17లో అతడికి ఇది రెండో మ్యాచ్‌ మాత్రమే. ఇక లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ తరఫున నికోలస్‌ పూరన్‌ గొప్పగా రాణిస్తున్నాడు. గుజరాత్‌పై 32 నాటౌట్, ఆర్సీబీపై 40 నాటౌట్, పంజాబ్‌పై 42, రాజస్థాన్‌పై 64 నాటౌట్‌.. ఇవీ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పూరన్‌ స్కోర్లు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో లఖ్‌నవూ గెలిచిందంటే పూరన్‌ ఇన్నింగ్స్‌ల విలువని అర్థం చేసుకోవచ్చు. ఒత్తిడిలోనూ ఏమాత్రం తగ్గకుండా ఆడడం పూరన్‌ స్టైల్‌. చూడటానికి పుల్లలా ఉన్నా కూడా స్టేడియాన్ని దాటించే సిక్స్‌లు బాదే పూరన్‌.. లఖ్‌నవూ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఆస్ట్రేలియాతో అరంగేట్ర సిరీస్‌లోనే అద్భుత ప్రదర్శనతో వహ్‌వా అనిపించిన పేసర్‌ షమార్‌ జోసెఫ్‌ ఎప్పుడెప్పుడు ఐపీఎల్‌ ఆడతానా అని ఎదురుచూస్తున్నాడు. అతడిని లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఇంకా పరీక్షించలేదు. లేటుగా వచ్చినా కచ్చితంగా షమార్‌ ఐపీఎల్‌పై ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని