WI vs PNG: టీ20 ప్రపంచకప్‌.. పసికూనపై చెమటోడ్చి నెగ్గిన విండీస్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌ సిలో పాపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 03 Jun 2024 02:55 IST

గయానా: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌ సిలో పాపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని విండీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్ (34; 29 బంతుల్లో 7 ఫోర్లు), నికోలస్ పూరన్ (27), రాణించారు. జాన్సన్ చార్లెస్ (0) డకౌటవ్వగా.. రొమన్‌ పావెల్ (15) పరుగులు చేశాడు. చివర్లో కాస్త ఉత్కంఠ ఏర్పడినా రోస్టన్ ఛేజ్ (42*; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి ఒక ఓవర్‌ మిగిలుండగానే విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆండ్రీ రస్సెల్ (15; 9 బంతుల్లో 1 సిక్స్) నాటౌట్‌గా నిలిచాడు. న్యూగినియా బౌలర్లలో అసద్‌ వాలా 2, జాన్‌ కారికో, చాడ్ సోపర్, అలీ నావో ఒక్కో వికెట్ తీశారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాపువా న్యూగినియా బ్యాటర్లలో సెసే బావు (50; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం బాదాడు. కెప్టెన్ అసద్ వాలా (21), కిప్లిన్ డోరిగా (27) పరుగులు చేశారు. టోనీ ఉరా (2), లెగా సియాకా (1), హిరీ హిరీ (2) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్‌ చేరారు. వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్ 2, అల్జారీ జోసెఫ్‌ 2, అకీలా హొసేన్, రొమారియో షెఫర్డ్, గుడాకేష్ మోటీ తలో వికెట్ పడగొట్టారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని