T20 World Cup: టీ20 ప్రపంచకప్‌.. ‘డిఫెండింగ్‌’ ఛాంపియన్స్‌ పరిస్థితేంటి?

ఐపీఎల్‌ తర్వాత క్రికెట్‌ అభిమానులను అలరించడానికి మెగా టోర్నీ సిద్ధమైంది. జూన్ 2 నుంచి యూఎస్ఏ - విండీస్‌ సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.

Updated : 31 May 2024 10:18 IST

హేమాహేమీ టీమ్‌లు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటేందుకు ప్రపంచ కప్‌లను వేదికగా చేసుకుంటాయి. జూన్ 2 నుంచి మరో సంగ్రామం మొదలుకానుంది. అదే టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024). ఇప్పటివరకు ఎనిమిది టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలు జరిగాయి. ఒక్కసారి కూడా డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జట్టు మళ్లీ విజేతగా నిలవలేదు. మరి ‘9’లో ఏమవుతుందనేది ఆసక్తికరం. గత పొట్టి కప్‌ల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ పరిస్థితేంటో చూద్దాం. 

  • 2007: తొలిసారి ఐసీసీ నిర్వహించిన టీ20 ప్రపంచ కప్‌ ఇదే. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. యువరాజ్, గంభీర్‌, సెహ్వాగ్‌ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌లో పాక్‌పై 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన టోర్నీ ఇది. 
  • 2009: డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా భారత్‌ బరిలోకి దిగింది. ఈసారి మాత్రం దారుణ ఫలితాలను చవిచూసింది. ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన టోర్నీలో టీమ్‌ఇండియా రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. మొదటి ఎడిషన్‌లో మిస్‌ అయిన కప్‌ను పాక్‌ ఈసారి ఒడిసిపట్టింది. శ్రీలంకను ఓడించి విజేతగా నిలిచింది. 
  • 2010: విండీస్‌ వేదికగా జరిగిన టోర్నీలో పాకిస్థాన్ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా పాల్గొంది. కానీ, సెమీస్‌కు చేరిన ఆ జట్టు అక్కడ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరాయి. పాల్ కాలింగ్‌వుడ్ నాయకత్వంలోని ఇంగ్లిష్‌ జట్టు టైటిల్‌ గెలుచుకుంది. 
  • 2012: శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది. దీనికి ముందు ఎడిషన్‌ టైటిల్‌ను ఇంగ్లాండ్‌ గెలుచుకుంది. ఈసారి మాత్రం రెండో రౌండ్‌కే పరిమితమై నిరాశపరిచింది. వెస్టిండీస్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో హోస్ట్‌ శ్రీలంకను ఓడించింది. 
  • 2014: అంతకుముందు (2012) జరిగిన టైటిల్‌ను సాధించడంలో శ్రీలంక విఫలమైంది. ఫైనల్‌లో విండీస్‌ చేతిలో ఓడింది. ఈసారి బంగ్లాదేశ్‌ ఆతిథ్యం ఇచ్చిన మెగా టోర్నీ విజేతగా శ్రీలంక నిలిచింది. ఫైనల్‌లో భారత్‌ను ఓడించి లంక కప్‌ను దక్కించుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా వచ్చిన విండీస్‌ సెమీస్‌ వరకు చేరుకుని నిష్క్రమించింది. 
  • 2016: ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఫైనల్‌కు వెస్టిండీస్ - ఇంగ్లాండ్‌ చేరాయి. విజేతగా విండీస్‌ నిలిచింది. ఆ జట్టు రెండోసారి కప్‌ను సాధించడం విశేషం. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన శ్రీలంకకు దారుణ ఫలితాలు ఎదురయ్యాయి. రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. 
  • 2021: కరోనా కారణంగా యూఏఈ/ఒమన్‌ వేదికగా మ్యాచ్‌లు జరిగాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన విండీస్‌ సెకండ్‌ రౌండ్‌కే పరిమితమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరాయి. టీ20 ప్రపంచ కప్‌ చరిత్రలో తొలిసారి ఆసీస్‌ విజేతగా నిలిచింది. 
  • 2022: సొంత మైదానంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్‌కు ఈసారి చుక్కెదురైంది. సెమీస్‌కూ చేరలేకపోయింది. రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్‌ రెండో సారి విజేతగా నిలిచింది. 
  • 2024: విండీస్ - యూఎస్‌ఏ సంయుక్త ఆతిథ్యం ఇవ్వనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఇంగ్లాండ్‌ బరిలోకి దిగనుంది. టీ20 ఫార్మాట్‌లో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించలేం. చాలామంది క్రికెట్ విశ్లేషకులు సెమీస్‌కు చేరే నాలుగు జట్లను మాత్రమే అంచనా వేస్తున్నారు. కప్‌ను దక్కించుకొనే టీమ్‌ను ఎవరూ చెప్పలేకపోవడం గమనార్హం. ఈసారి పోటీ తీవ్ర స్థాయిలో ఉంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని