Team India: భారత సారథి రోహిత్ శర్మ మాటల వెనుక మర్మమేంటో?

వెస్టిండీస్‌తో రెండో టెస్టు (WI vs IND) సందర్భంగా భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) ‘జట్టులో మార్పులు’పై మాట్లాడాడు. అయితే, ఎందుకు అలా చేశాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Updated : 19 Jul 2023 20:31 IST

‘‘జట్టులో మార్పులు సహజం. త్వరలోనే టీమ్‌ఇండియాలోనూ పెను మార్పులు రావచ్చు. సీనియర్ల పాత్ర చాలా కీలకం. అలాగే భారత జట్టు భవిష్యత్తు యువ క్రికెటర్లపైనే ఉంది. వారే ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి’’ ఇవీ టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వెస్టిండీస్‌తో రెండో టెస్టు ముందు (WI vs IND) విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు.. 

రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఎటు దారితీస్తాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యువ క్రికెటర్లు జట్టులోకి వచ్చేందుకు మార్గమిస్తూ సీనియర్లు వైదొలిగేలా సంకేతాలు ఇచ్చాడా..? అనే కోణంలోనూ విశ్లేషణలు ప్రారంభం కావడం విశేషం. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (2023 - 25) మూడో సీజన్‌ ప్రారంభమైంది. ఈ ఏడాదే ఆసియా కప్‌తోపాటు వన్డే ప్రపంచకప్ ఉన్నాయి. దీంతో రోహిత్ వ్యాఖ్యలపై ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణ చేసుకోవడం గమనార్హం. 

వారంతా రెడీ..!

ప్రస్తుతం టీమ్‌ఇండియాలో రోహిత్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, షమీ, బుమ్రా (ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు), ఛెతేశ్వర్ పుజారా సీనియర్లు. మహా అయితే వీరంతా రెండు లేదా మూడేళ్లు కంటే ఎక్కువ ఆడలేరు. ఇప్పటికే 35 నుంచి 37 ఏళ్ల మధ్య ఉన్నారు. అందుకే, వీరికి విశ్రాంతినిస్తూ యువకులకు ఎక్కువగా అవకాశం కల్పించాలి. ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఘోరంగా విఫలమైన పుజారాను విండీస్‌తో సిరీస్‌కు తీసుకోలేదు. అతడు ఆడే మూడో స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగాడు. గిల్ త్వరగానే పెవిలియన్‌కు చేరినప్పటికీ.. ఆ స్థానంలో ఆడాలని ముందుకు రావడం మాత్రం ప్రశంసనీయం. సాధారణంగా గిల్ ఓపెనర్‌గా వస్తాడు. కానీ, యశస్వి జైస్వాల్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఓపెనర్‌గా అతడికి అవకాశం ఇచ్చింది. దీంతో గిల్ వన్‌డౌన్‌లో వచ్చాడు. యశస్వి భారీ సెంచరీతో ఘనంగా కెరీర్‌లో ముందడుగు వేశాడు. 

జట్టులో మార్పులు సహజం.. సీనియర్ల పాత్ర చాలా కీలకం

ఇషాన్‌ కిషన్‌ను కూడా జట్టులోకి తీసుకున్నప్పటికీ బ్యాటింగ్‌ చేసే అవకాశం కొద్దిగానే వచ్చింది. అయితే రిషభ్ పంత్ మళ్లీ జట్టులోకి వస్తే ఇషాన్‌కు చోటు దక్కడం అనుమానమే. ఆలోగా తన సత్తాను చాటితే రేసులో నిలిచేందుకు అవకాశం ఉంటుంది. ఇక రుతురాజ్‌ గైక్వాడ్ కూడా కాచుకుని ఉన్నాడు. ఫామ్‌లో లేని పృథ్వీ షా, సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా టెస్టుల్లో ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి అవకాశం రావాలంటే సీనియర్లు తమంతట తాము వైదొలిగితేనే సాధ్యం. బౌలర్ల విభాగంలోనూ యువకులు అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌, ప్రసిధ్‌ కృష్ణ, ముకేశ్ కుమార్‌, నవ్‌దీప్‌ సైని తదితరులు అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 

అదంతా యువకులతోనే..

ప్రస్తుతం టెస్టు ఫార్మాట్‌ జట్టులో మార్పులు తెచ్చేందుకు బీసీసీఐ నడుం బిగించగా.. గత ఏడాది నుంచే టీ20 జట్టును సమూలంగా మార్చేసింది. గతేడాది పొట్టి కప్‌ తర్వాత నుంచి సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 మ్యాచ్‌లను ఆడనేలేదని చెప్పాలి. కెప్టెన్సీని కూడా హార్దిక్‌ పాండ్యకే అప్పగిస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. దాని కోసం పాండ్య నాయకత్వంలోనే జట్టును సిద్ధం చేయడం వల్ల కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం పెరగడం ఖాయం.  ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ ఉండటంతో 50 ఓవర్ల జట్టులో మార్పులు చేయకుండా సీనియర్లనే ఆడించేందుకు మొగ్గు చూపింది. అయితే, ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత సీనియర్లే ఒక్కొక్కరు కెరీర్‌కు వీడ్కోలు చెప్పే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనా. 

భారీగా పెరిగిన ఆశావహులు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL)తో యువ క్రికెటర్లు తమ టాలెంట్‌ను చూపించేందుకు అద్భుతమైన వేదిక దొరికింది. దేశవాళీ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌లోనూ రాణిస్తే జాతీయ జట్టులో చోటు ఖాయమనే భరోసానిచ్చింది. దీనికి ఉదాహరణగా యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్. వీరిద్దరూ గత ఐపీఎల్‌లో అదరగొట్టడంతో విండీస్‌ పర్యటనకు ఎంపికయ్యారు. మరోవైపు కొత్త ఆటగాళ్లు కూడా అందుబాటులోకి వస్తుండటంతో బీసీసీఐ కూడా ఒకే సమయంలో విభిన్న దేశాల్లో సిరీస్‌ల్లో వారికి అవకాశం కల్పిస్తోంది. తాజాగా ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ జరిగే సమయంలోనూ ఆసియా క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈసారి క్రీడలకు జట్టును పంపించేందుకు నిర్ణయించి ఇప్పటికే ఆటగాళ్లను ఎంపిక చేసింది. 

ఇక్కడే జాగ్రత్తలు అవసరం

యువ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి.. వారిని ఎంపిక చేసి సీనియర్లకు విశ్రాంతి ఇద్దామని భావిస్తే మరొక ప్రమాదం పొంచి ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. అనుభవలేమితో యువకులు ఇతర దేశాల్లో ఆడి విఫలమైతే వారి మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే, సీనియర్లు తమ అనుభవాలను యువకులతో పంచుకునేలా చేయడంలో బీసీసీఐ కీలక పాత్ర పోషించాలి. సీనియర్లు ఒక్కొక్కరు జట్టును వీడే సమయంలో యువ క్రికెటర్లు కూడా తగినన్ని మ్యాచ్‌లు ఆడి అనుభవం వచ్చేలా చేయాలి. అప్పుడే రోహిత్ శర్మ అనుకున్నట్లుగా భారత క్రికెట్‌ను యువకులు మరింత ఉన్నత శిఖరాలకు చేర్చగలరు. భారత గత చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే.. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌, గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, యువీ, ధోనీ కూడా ఇలా వరుసగా ఒక్కొక్కరు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ తమ వారసులను సిద్ధం చేసుకుంటూ వెళ్లారు. ఆ బాధ్యతను ఇప్పుడున్న సీనియర్లూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు