WI vs IND: జట్టులో మార్పులు సహజం.. సీనియర్ల పాత్ర చాలా కీలకం: రోహిత్

వెస్టిండీస్ - భారత్‌ జట్ల (WI vs IND) మధ్య గురువారం నుంచి ప్రారంభమయ్యే టెస్టుకు ప్రత్యేకత ఉంది. ఇరు జట్లు తలపడే వందో టెస్టు కావడం విశేషం. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.

Published : 19 Jul 2023 12:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గురువారం నుంచి వెస్టిండీస్‌ - భారత్ (WI vs IND) జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విండీస్‌ ఆటగాళ్లు కనీసం పోరాటం చేయలేక చేతులెత్తేశారు. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ భారీ శతకంతో అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. ఈ క్రమంలో రెండో టెస్టుకు కూడా ఇదే జట్టుతో బరిలోకి దిగేందుకు అవకాశం ఉంది. రెండో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విండీస్‌ - భారత్ మధ్య ఇది 100వ టెస్టు కావడం విశేషం. ట్రినిడాడ్ పిచ్‌, యువ క్రికెటర్లు, సీనియర్ల పాత్ర.. తదితర విషయాల గురించి రోహిత్ మాట్లాడాడు.

బర్త్‌డే బాయ్‌ ఇషాన్‌ను గిఫ్ట్ అడిగిన రోహిత్

డొమినికా పిచ్‌ను చూడగానే మాకు స్పష్టత వచ్చింది. పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలిసింది. కానీ, ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ పిచ్‌ ఎలా ఉండనుందో అర్థం కావడం లేదు. అయితే, డొమినికాతో పోల్చితే.. ఇక్కడి పిచ్‌ పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ ఉండవని భావిస్తున్నా. మ్యాచ్‌కు కాస్త ముందు మాత్రమే ఏం ఎంచుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. తుది జట్టుపైనా ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేం. ఇప్పటికైతే తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగేందుకు యోచిస్తున్నాం.

వారిదే భవిష్యత్తు

భారత క్రికెట్‌లో రాబోయే కాలంలో మరిన్ని మార్పులు జరుగుతాయి. ఎక్కడైనా సరే మార్పులు సహజమే. అయితే, సీనియర్ల పాత్ర చాలా కీలకంగా మారనుంది. కొత్తగా వచ్చే యువ క్రికెటర్లు తమ సత్తా చాటుకుంటున్నారు. ఇక మేం సీనియర్లుగా వారిని సరైన మార్గంలో వెళ్లేలా చేయడమే మా కర్తవ్యం. ఆ తర్వాత జట్టు కోసం ఎలాంటి ప్రదర్శన ఇవ్వాలనేది వారి చేతుల్లోనే ఉంటుంది. భారత క్రికెట్‌కు వారే భవిష్యత్తు తరం ఆటగాళ్లు. మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారనే నమ్మకం మాకుంది.

పుంజుకోవడం ఖాయం

మొదటి టెస్టులో ఘోర ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న విండీస్‌తో జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. రెండో టెస్టులో తిరిగి పుంజుకొని పోటీనిస్తారని భావిస్తున్నాం. అలాగే ఇరు జట్ల మధ్య వందో టెస్టు జరగనుడటం గర్వంగా ఉంది. ఇలాంటి అవకాశం ప్రతిరోజూ రాదు. రెండు దేశాల క్రికెట్‌కు ఘనమైన చరిత్ర ఉంది. అద్భుతమైన క్రికెట్ ఆడాం. ఇరు దేశాల మధ్య వందో టెస్టు మ్యాచ్‌ అయినప్పటికీ.. మా ఆట తీరులో ఎలాంటి మార్పు ఉండదు. విజయం కోసం పోరాడతాం’’ అని రోహిత్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని