Team India: డబ్ల్యూటీసీ టేబుల్‌లో భారత్‌ స్థానమిదే.. నాలుగో టెస్టులో రికార్డులివే!

ఇంగ్లాండ్‌పై నాలుగో టెస్టులో (IND vs ENG) విజయం సాధించినప్పటికీ.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో స్థానం మాత్రం మారలేదు. కానీ, ఓ అంశంలో మాత్రం వృద్ధి నమోదైంది.

Published : 26 Feb 2024 16:53 IST

ఇంటర్నెట్ డెస్క్: నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ను (IND vs ENG) చిత్తు చేసిన భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 (WTC 2023-25) సీజన్‌ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌కు సమీపంగా వచ్చింది. భారత్‌ స్థానంలో ఎలాంటి మార్పు లేనప్పటికీ.. విజయాల శాతంలో మాత్రం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం భారత్‌ రెండో స్థానంలో 64.58 శాతంతో కొనసాగుతోంది. ఈ టెస్టుకు ముందు టీమ్‌ఇండియా విజయాల శాతం 59.52గా ఉండేది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ 75 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (55), బంగ్లాదేశ్‌ (50), పాకిస్థాన్‌ (36.66) తొలి ఐదింట్లో నిలిచాయి. భారత్‌ చేతిలో సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్‌ స్థానం మరింత పతనమైంది. ప్రస్తుతం 19.44 శాతంతో 8వ స్థానానికి పడిపోయింది.

రాంచీ టెస్టులో నమోదైన రికార్డులివే..

  • భారత్‌ 200 కంటే తక్కువ స్కోరును ఛేదించి గెలవడం ఇది 30వ సారి. మొత్తం 33 మ్యాచుల్లో మూడింటిని డ్రా చేసుకుంది. ఒక్క మ్యాచ్‌నూ కోల్పోకపోవడం విశేషం. 
  • గత పదేళ్లలో స్వదేశం వేదికగా భారత్‌ 150+ టార్గెట్‌ను ఛేదించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2013లో దిల్లీలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. 
  • భారత్ 0-1 తేడాతో వెనకబడి సిరీస్‌ను సొంతం చేసుకోవడం ఏడోసారి. ఇందులో ఇంగ్లాండ్‌పై మూడు సిరీస్‌లు ఉండటం విశేషం. ఇక భారత్‌లో వరుసగా 17వ ద్వైపాక్షిక సిరీస్‌ను గెలుచుకుంది. 
  • బెన్‌ స్టోక్స్ - బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ నేతృత్వంలో తొలిసారి ఇంగ్లాండ్‌ సిరీస్‌ను కోల్పోయింది. వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోవడమూ ఇదే మొదటిసారి. 
  • ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అశ్విన్‌ 17 వికెట్లు పడగొట్టాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో ఇలా అత్యధికసార్లు చేసిన భారత బౌలర్‌గా అశ్విన్‌ (99 మ్యాచుల్లో 35) నిలిచాడు. కుంబ్లే కూడా వికెట్లు తీసినప్పటికీ 132 టెస్టులు పట్టాయి. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్‌ (354) అనిల్ కుంబ్లేను (350) అధిగమించాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని