RCB: కోల్‌కతాపై బెంగళూరు గెలిచేనా.. ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయా..?

ఈ సీజన్‌లో బెంగళూరు పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది.

Updated : 21 Apr 2024 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈ సాలా కప్‌ నమదే’ అంటూ ప్రతిసారి రావడం.. అభిమానులను తీవ్రంగా నిరాశపర్చడం బెంగళూరుకు అలవాటుగా మారింది. ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో కనీస పోరాటం చేయలేకపోవడం ఆ జట్టు దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో చిట్ట చివర్లో కొనసాగుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్‌ చేరుకోవడం దాదాపు కష్టమే. కోల్‌కతాతో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బెంగళూరు తలపడుతోంది. ఇప్పటికే ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ ముగియగా ఆర్సీబీ ముందు 223 పరుగుల లక్ష్యం ఉంది. మరి ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదిస్తుందా? ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి.. వరుస ఓటములకు బ్రేక్‌ వేస్తుందా.. చూడాలి.

జట్టు నిండా స్టార్‌ బ్యాటర్లే..

పేపర్‌ మీద చూస్తే ఎంతో బలంగా కనిపించే బెంగళూరు జట్టు.. మైదానంలోకి వచ్చేసరికి పూర్తిగా తేలిపోతోంది. సార్ట్‌ బ్యాటర్లు ఉన్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరు.. నిలకడైన ఆటతీరును కొనసాగించలేకపోతున్నారు. తమ జట్టులో ‘కేజీఎఫ్‌’ ఉన్నారని గొప్పగా చెప్పుకోవడం తప్పితే.. అందులో కోహ్లీ మినహా మిగతా ఇద్దరు రాణించిందేం లేదు. ఇక మ్యాక్స్‌వెల్‌ గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. గత వన్డే ప్రపంచకప్‌లో చెలరేగిపోయిన ఈ ఆల్‌రౌండర్‌.. ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు సార్లు డకౌట్‌ అయ్యాడు. తన ఆటతీరు కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఈ సీజన్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నాడు. ఆరంభంలో కోహ్లీ.. ఫినిషర్‌గా పేరున్న డీకే చివర్లో చెలరేగుతుండటంతో జట్టు పరువు కాస్తయినా దక్కుతోంది.

బౌలింగ్‌లో తేలిపోతోంది..

ఆర్సీబీకి అతిపెద్ద సమస్య బౌలింగ్ యూనిట్‌. ప్రత్యర్థిని నియంత్రించలేక ఆ జట్టు బౌలర్లు అత్యంత సాధారణంగా కనిపిస్తున్నారు. స్టార్‌ బౌలర్‌గా పేరుతెచ్చుకున్న సిరాజ్‌ పూర్తిగా నిరాశపరిచాడు.. జట్టులో నాణ్యమైన స్పిన్నర్‌ లేకపోవడం ప్రతికూలాంశం. దీంతో బెంగళూరుతో మ్యాచ్‌ అంటే చాలు.. ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఫామ్‌లో లేని బ్యాటర్లు తిరిగి విజృంభించాలంటే ఒక్కసారి ఆర్సీబీతో ఆడితే చాలు అన్న కామెంట్లు వస్తున్నాయంటే.. ఆ జట్టు బౌలింగ్‌ దాడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయా..?

ఈ సీజన్‌లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు ఆడేసింది ఆర్సీబీ. పంజాబ్‌పై మాత్రమే విజయం సాధించి రెండు పాయింట్లతో ఉన్న ఆ జట్టుకు ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఈ రేసులో నిలవాలంటే.. మిగతా ఏడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. అదీనూ భారీ రన్‌రేట్‌తో. అప్పుడు 16 పాయింట్లతో ఇతర జట్లతో పోటీపడే అవకాశాలు ఉంటాయి. వచ్చే మ్యాచ్‌ల్లో కోల్‌కతా, హైదరాబాద్‌, చెన్నైలాంటి పెద్ద జట్లతో తలపడాల్సి ఉండటంతో.. ఆ జట్టు ఎలా నెగ్గుకు వస్తుందో చూడాలి మరి. కోహ్లీ, డీకేలతోపాటు ఇతర బ్యాటర్లు రాణించడం.. బౌలింగ్‌లో తగిన మార్పులు చేసుకుంటేనే ఆ జట్టుకు విజయావకాశాలు ఉంటాయి.

గతంలో ఇలాగే..

2009వ సీజన్‌లో బెంగళూరు ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడిపోయింది. ఆ తర్వాత ఏడు మ్యాచ్‌ల్లో నెగ్గి ఫైనల్‌ చేరింది. టైటిల్‌ను మాత్రం గెలవలేకపోయింది. ఇప్పుడు కూడా అలాగే పుంజుకోవాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని