KL Rahul: ఇప్పుడు టీ20ల్లో అదే కదా ట్రెండ్.. టాస్‌ ఓడటమూ మంచిదైంది: కేఎల్ రాహుల్

లఖ్‌నవూ పుంజుకొంది. తొలి ఓటమి తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.

Published : 03 Apr 2024 08:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బెంగళూరును చిత్తు చేసిన లఖ్‌నవూ ఐపీఎల్ 17వ సీజన్‌లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యువ బౌలర్ మయాంక్‌ యాదవ్ (Mayank Yadav) మరోసారి అదరగొట్టేశాడు. తొలుత బ్యాటింగ్‌లో క్వింటన్ డికాక్ (81), నికోలస్‌ పూరన్ (40*), స్టాయినిస్ (24), కేఎల్ రాహుల్ (20) రాణించారు. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ మయాంక్‌ వల్లే తమ జట్టు గెలిచిందని.. అతడి బౌలింగ్‌ను కీపర్‌గా చూడటం ఆనందంగా ఉందని లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అన్నాడు. 

‘‘జట్టుగా మేం మంచి ప్రదర్శనే చేశాం. బెంగళూరు పిచ్‌ చాలా విభిన్నంగా స్పందించింది. సీమర్లకు కాస్త సహకారం అందించింది. మాకు మంచి ఆరంభమే లభించింది. క్వింటన్ డికాక్ నాణ్యమైన షాట్లతో అలరించాడు. నికోలస్‌ పూరన్ దూకుడుతో మేం అదనంగా 15 పరుగులు చేసినట్లైంది. మా బౌలర్లు అదరగొట్టారు. యార్కర్లకు వెళ్లొద్దని.. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి ఉండాలని మాత్రమే చర్చించుకున్నాం. ఓవర్‌లో ఒకటీ, రెండు బౌండరీలు పడ్డాయంటే ఒత్తిడి పెరుగుతుంది. మయాంక్‌ బౌలింగ్‌ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. అతడి వేగం 20 అడుగుల దూరంలోని నన్నే బలంగా తాకేలా చేసింది. రెండేళ్లపాటు డగౌట్‌లోనే నిరీక్షించాడు. 155 కి.మీ వేగంతో బంతులేయడం తేలికైన విషయం కాదు. గాయాలు కూడా త్వరగా అవుతుంటాయి. అతడి దూకుడు అద్భుతం. స్టంప్స్‌ వెనుక ఉండి అతడి బౌలింగ్‌ను చూడటం బాగుంది. మయాంక్‌ బంతులు విసురుతున్నప్పుడు నేను వికెట్‌ కీపర్‌గా ఉండాలి. ఎప్పుడూ టాస్‌ గెలిస్తే బౌలింగ్‌ను తీసుకొనేందుకే మొగ్గు చూపుతా. ఇప్పుడు టీ20ల్లో అదే ట్రెండ్. కానీ, మా గణాంకాలు మాత్రం వాటికి విభిన్నంగా ఉన్నాయి. మొదట బ్యాటింగ్‌ చేసినప్పుడే ఎక్కువ విజయాలను నమోదు చేశాం. తొలుత టాస్‌ ఓడిపోవడం మంచిదైంది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓడిపోయాం. ఇప్పుడు పుంజుకొని వరుసగా రెండు విజయాలు నమోదు చేయడం ఆనందంగా ఉంది’’ అని కేఎల్ రాహుల్ తెలిపాడు. 

క్యాచ్‌లను డ్రాప్‌ చేయడమే ఓటమికి కారణం: డుప్లెసిస్‌

‘‘మా బౌలర్లు పవర్‌ప్లేలో కాస్త ఎక్కువగా పరుగులు ఇచ్చారు. ఆ తర్వాత పుంజుకొన్నారు. కానీ, కీలకమైన క్యాచ్‌లను చేజార్చాం. క్వింటన్ డికాక్ 30 పరుగుల్లోపే ఉన్నప్పుడు అతడి క్యాచ్‌ను వదిలేశాం. నికోలస్‌ పూరన్ కేవలం 2 పరుగుల మీద ఉన్నప్పుడే ఔట్‌ చేయాల్సింది. దీంతో లఖ్‌నవూ కనీసం 60 పరుగులు ఎక్కువ చేసింది. ఐపీఎల్‌లో ఇలాంటి పొరపాట్లే భారీ మూల్యం చెల్లించేలా చేస్తాయి. మయాంక్‌ యాదవ్ పేస్‌, కచ్చితత్వం అద్భుతం. అతడిని వాడుకున్న తీరు కూడా బాగుంది. మిడిల్‌ ఓవర్లలో కనీసం ఇద్దరు బ్యాటర్ల నుంచి మంచి భాగస్వామ్యం నమోదై ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. తప్పకుండా తదుపరి మ్యాచుల్లో దీనిపై దృష్టిసారించి పొరపాట్లను సరి చేసుకుని బరిలోకి దిగుతాం’’ అని బెంగళూరు కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (Duplessis) తెలిపాడు. సొంతమైదానంలో బెంగళూరు వరుసగా రెండోసారి ఓటమి పాలవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని