ODI WC 2023 - Team India: ప్రపంచకప్ ఛాన్స్ మిస్ అయ్యే ఆ ఇద్దరు ఎవరు?

ప్రపంచకప్ (ODI WC 2023) కోసం 15 మందితో జట్టును ప్రకటించడానికి బీసీసీఐ (BCCI) సెలక్షన్‌ కమిటీ సిద్ధమవుతోంది. 17 మంది పేర్లతో దాదాపు సిద్ధమైన జాబితా (Team India)లో ఇద్దరి పేర్లను తీసేయాలి. ఆ ఇద్దరు ఎవరు అనేదే ప్రశ్న.

Updated : 04 Sep 2023 18:50 IST

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023)కు సరిగ్గా నెల రోజులే సమయం ఉంది. ఇప్పటికే కొన్ని జట్లు ప్రపంచకప్‌నకు కొన్ని జట్లను ప్రకటించేశాయి. జట్ల ప్రకటనకు తుది గడువు మంగళవారమే. ముందు ముసాయిదా జట్లను ప్రకటించి.. ఆ తర్వాత అత్యవసర పరిస్థితులను బట్టి ICC అనుమతితో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ప్రపంచకప్ దృష్టితోనే ఆసియా కప్‌ (Asia Cup)కు 17 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశారు భారత సెలక్టర్లు. ఇందులోంచి ఇద్దరిని తప్పించి.. ప్రపంచకప్ కోసం 15 మందితో జట్టు (Team India)ను ప్రకటించాల్సి ఉంది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీ. ప్రపంచకప్ అవకాశం కోల్పోనున్న ఆ ఇద్దరు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా అయిదుగురి మీద దృష్టి ఉండగా.. అందులోంచి ‘డిలీట్’ బటన్ ఎవరి మీద ప్రెస్ అవుతుందన్నది ఆసక్తికరం.

శ్రేయస్ అయ్యర్

వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక అవుతాడా లేదా అని అనుమానాలు వ్యక్తమైన ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. ఈ ఏడాది ఐపీఎల్ కంటే ముందే అతను గాయపడి మైదానానికి దూరమయ్యాడు. శస్త్ర చికిత్స చేయించుకుని సుదీర్ఘ సమయం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో  గడిపాడు. కొన్ని వారాల ముందు అయితే అతను ప్రపంచకప్ ఆడటం కష్టమే అనుకున్నారంతా. కానీ వేగంగా ఫిట్‌నెస్ సాధించి ఆసియా కప్‌ టోర్నీకి ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి కూడా దిగాడు. బ్యాటింగ్‌లో ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినా సౌకర్యవంతంగానే కనిపించాడు. వర్షం వల్ల పాక్ ఇన్నింగ్స్ రద్దు కాకపోయి ఉంటే.. ఫీల్డింగ్‌లో శ్రేయస్ ఫిట్నె‌స్ ఎలాంటిదో చూసేవాళ్లం. ప్రస్తుతానికైతే అతడికి సమస్యలేమీ లేనట్లే కనిపిస్తోంది. నాలుగో స్థానంలో చాన్నాళ్లుగా ఆడుతున్నాడు కాబట్టి ప్రపంచకప్‌కు శ్రేయస్ ఎంపిక లాంఛనమే. మధ్యలో ఫిట్‌నెస్ సమస్యలు తిరగబెడితే తప్ప అతను ప్రపంచకప్‌లో ఆడబోతున్నట్లే.

కేఎల్ రాహుల్

శ్రేయస్ లాగే ఫిట్‌నెస్ సమస్యలతో కొన్ని నెలల పాటు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు కేఎల్ రాహుల్. ఐపీఎల్‌లో అయిన తొడ గాయానికి అతను కూడా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అతను శ్రేయస్ కంటే ముందే కోలుకుని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆసియా కప్‌నకు ఎంపిక అయినప్పటికీ.. వేరే చిన్న గాయం ఏదో కావడంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. సూపర్-4 నుంచి అతను అందుబాటులోకి వస్తాడంటున్నారు. ఫిట్‌నెస్ విషయంలో అతడికి ఎన్‌సీఏ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. గాయానికి ముందు జట్టులో కీలక బ్యాటర్లలో ఒకడు, పైగా వికెట్ కీపింగ్ కూడా చేయగలడు కాబట్టి రాహుల్‌ను ప్రపంచకప్‌నకు ఎంపిక చేయడం ఖాయం అంటున్నారు. ఫిట్‌నెస్‌ సమస్యలు తిరగబెడితే అతణ్ని తప్పించి వేరొకరని ఎంచుకోవచ్చు కానీ.. ఇప్పటికైతే అతడిపై వేటు పడదని తెలుస్తోంది.

సంజు శాంసన్

ఈ కేరళ కుర్రాడు ఐపీఎల్‌ మెరుపులు చూసి.. టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేశారు. అతడికి అవకాశం దక్కని సమయంలో సెలక్టర్లను విమర్శించారు. ఐతే కొంచెం ఆలస్యంగా అయినా అతడికి అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని అతను పెద్దగా ఉపయోగించుకోలేదు. ఇటీవలి వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనల్లో ఓ మోస్తరు ప్రదర్శనే చేశాడు. దీంతో ప్రపంచకప్‌నకు ఎంపిక చేయాల్సిందే అన్న అభిప్రాయం తన విషయంలో కలగలేదు. ఐతే రాహుల్ ఫిట్‌నెస్ మీద సందేహాలుండటంతో అతడికి బ్యాకప్‌గా ఆసియా కప్‌కు సంజును ఎంపిక చేశారు సెలక్టర్లు. మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సత్తా చాటుతుండటం సంజుకు ఇబ్బందిగా మారింది. పైగా రాహుల్ ఫిట్‌నెస్ సాధించి ఆసియా కప్‌లో సూపర్-4 దశ నుంచి ఆడబోతుండటంతో సంజుకు దారులు మూసుకుపోయినట్లే. ప్రపంచకప్ జట్టుకు దూరం కానున్న ఇద్దరిలో ఒకరు సంజునే అన్నది ఖాయం.

ప్రసిద్ధ్ కృష్ణ

ఈ కర్ణాటక పేసర్ గాయంతో పోరాడి ఈ మధ్యే ఫిట్‌నెస్ సాధించాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో పునరాగమనం చేసి సత్తా చాటాడు. ఐతే బుమ్రా ఫిట్‌నెస్ సాధించడంతో భారత పేస్ విభాగం బలం పుంజుకుంది. జట్టుకు అవసరమైన స్థాయిలో పేస్ బలగం ఉంది. ప్రస్తుతం జట్టులో బుమ్రా, షమి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌ల రూపంలో నలుగురు స్పెషలిస్టు బౌలర్లున్నారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రూపంలో మరో పేస్ బౌలింగ్ ప్రత్యామ్నాయం కూడా ఉంది. ప్రపంచకప్ జరిగేది ఇండియాలో కాబట్టి మరీ ఎక్కువమంది పేసర్లు అవసరం లేదనే అభిప్రాయం ఉండటంతో ఐదో పేసర్‌గా ప్రసిద్ధ్ అవసరం లేదనే భావిస్తున్నారు. పైగా అతను చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇన్ని రోజులు మైదానానికి దూరంగా ఉన్న పేస్ బౌలర్‌ను ఆసియా కప్‌లో కూడా ఆడించట్లేదంటే ప్రపంచకప్‌నకు దూరం పెట్టబోతున్నట్లే భావించాలి.

తిలక్ వర్మ

కొన్ని నెలల ముందు వరకు ప్రపంచకప్ చర్చల్లోనే లేడు తిలక్ వర్మ. కానీ ఈ హైదరాబాద్ కుర్రాడు వెస్టిండీస్ పర్యటన కోసం తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్కడ టీ20 సిరీస్‌లో సత్తా చాటి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో అతణ్ని ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలన్న డిమాండ్లు పెరిగాయి. ఆసియా కప్ జట్టుకు ఎంపిక కావడంతో ప్రపంచకప్‌ అవకాశం పైనా ఆశలు రేగాయి. కానీ శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో తిలక్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. కానీ శ్రేయస్, రాహుల్‌లకు ఫిట్‌నెస్ సమస్యలు తిరగబెడతాయేమో అన్న భయాలు కొనసాగుతుండటంతో తిలక్‌ను ప్రత్యామ్నాయ ఆటగాడిగా జట్టులో కొనసాగించే అవకాశాలే ఎక్కువ. కానీ ఇప్పటిదాకా ఒక్క వన్డే కూడా ఆడని తిలక్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయడం కరెక్టా అనే వాదనా ఉంది. ఒకవేళ అదనపు పేస్ బౌలర్ ఉండాలని ప్రసిద్ధ్ కృష్ణను కొనసాగిస్తే మాత్రం తిలక్‌ను ప్రపంచకప్‌ జట్టు నుంచి తప్పించవచ్చు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు