Mayank Yadav: కొత్త పేస్‌ స్టార్‌.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్‌ యాదవ్

ఐపీఎల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్‌ పేసర్‌పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు..

Updated : 03 Apr 2024 12:02 IST

క్రీజ్‌లో ఇద్దరూ దూకుడుగా ఆడేస్తున్నారు.. అప్పటికే సెంచరీ భాగస్వామ్యం నమోదైంది.. పది వికెట్లు చేతిలో ఉన్నాయి.. 50 బంతుల్లో 98 పరుగులు అవసరం. అప్పుడు మొదలైంది అతడి హవా. తన వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తన జట్టువైపు తిప్పేశాడు. తొలిసారి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన ఈ కుర్రాడు సీనియర్లనే బెంబేలెత్తించాడు. ఇంతకీ ఆ పేసర్ ఎవరా? అని సెర్చింగ్‌ మొదలెట్టేశారు.. ఇదంతా యువ పేసర్ మయాంక్‌ యాదవ్‌ గురించి..  

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 199 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 178/5 స్కోరుకే పరిమితమైంది. శిఖర్ ధావన్ (70), జానీ బెయిర్‌స్టో (42) తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించారు. వికెట్‌ కోసం లఖ్‌నవూ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అప్పుడే ధ్రువతారలా ఓ కుర్రాడు పదునైన బౌలింగ్‌తో వికెట్‌ తీసి లఖ్‌నవూ శిబిరంలో ఆశలు రేపాడు. ఆ తర్వాత వరుసగా మరో రెండు వికెట్లు తీశాడు. పంజాబ్‌ కోల్పోయిన ఐదు వికెట్లలో తొలి మూడు కూడా మయాంక్‌ యాదవ్‌ ఖాతాలోకే చేరడం విశేషం. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. 

ప్రత్యర్థులే అభినందించేలా.. 

ఐపీఎల్‌ ద్వారా కొత్త పేస్‌ స్టార్‌ వెలుగులోకి వచ్చాడని అభిమానులు సంబరపడుతున్నారు. దిల్లీకి చెందిన 21 ఏళ్ల మాయాంక్‌ వేగం అద్భుతం. నిలకడగా 145 కి.మీకుపైగా వేగంతో బంతులేస్తాడు. ప్రస్తుత సీజన్‌లో 155.8 వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించాడు. త్వరలోనే అతడి నుంచి అత్యంత వేగవంతమైన బంతిని మనం చూసే అవకాశం లేకపోలేదు. మయాంక్‌ బౌలింగ్‌లో కేవలం పేస్‌ మాత్రమే కాకుండా.. వైవిధ్యం ఉండటమే అతడి స్పెషాలిటీ. గతంలో ఉమ్రాన్‌ మాలిక్‌ కూడా వేగంగా బంతులేసేవాడు. కానీ, అతడి బౌలింగ్‌లో లైన్‌ అండ్‌ లెంగ్త్‌ ఉండేది కాదు. దీంతో భారీగా పరుగులు సమర్పించుకొనేవాడు. కానీ, మయాంక్‌ బౌలింగ్‌ మాత్రం కచ్చితత్వంతో కూడుకున్నదే. ఎంతలా ఉందంటే అతడి బౌలింగ్‌ను ఆడిన పంజాబ్‌ కెప్టెన్ శిఖర్ ధావన్‌ కూడా ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్‌ అనంతరం మయాంక్‌ పేస్‌ను ధావన్‌ అభినందించకుండా ఉండలేకపోయాడు. 

రెండేళ్ల కిందటే వచ్చాడు.. గాయంతో దూరం

రెండేళ్ల కిందటే మయాంక్‌ ఐపీఎల్‌లోకి వచ్చాడు. 2022 మెగా వేలంలో లఖ్‌నవూ అతడిని రూ.20 లక్షలకే తీసుకుంది. కానీ, ఆ సీజన్‌లో ఒక్క అవకాశమూ రాలేదు. మరుసటి ఏడాదిలో (2023) అతడికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా ఏకంగా లీగ్‌ నుంచి వైదొలిగాడు. దీంతో మయాంక్‌ స్థానంలో ఆర్పిత్ గులేరియాను లఖ్‌నవూ తీసుకుంది. కానీ, మయాంక్‌పై లఖ్‌నవూ నమ్మకం మాత్రం కొనసాగించింది. ఆ ఏడాది దియోధర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా యాదవ్‌ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. నార్త్‌ జోన్‌ తరఫున ఆడిన అతడు 12 వికెట్లు పడగొట్టాడు. ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ దిల్లీకి ఆడిన మయాంక్‌.. రెండు కీలక వికెట్లు తీసి పంజాబ్‌ను ఓడించడంలోనూ కీలక పాత్ర పోషించాడు. లిస్ట్‌ ఏ కెరీర్‌లో ఇప్పటి వరకు 34 మ్యాచుల్లో 17 వికెట్లు తీశాడు. దీంతో గత మినీ వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌ ప్రక్రియలోనూ మయాంక్‌ను లఖ్‌నవూ తమ వద్దే ఉంచేసుకుంది. ఇప్పుడు వచ్చిన తొలి మ్యాచ్‌ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మయాంక్‌.. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే జాతీయ జట్టులోకి అడుగు పెట్టడం ఖాయమని క్రికెట్‌ విశ్లేషకుల అభిప్రాయం.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని