Nuwan Seneviratne: అప్పటి బస్సు డ్రైవర్‌.. ఇప్పుడు టీమ్‌ ఇండియా త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌

నువాన్‌ సెనెవిరత్నె (Nuwan Seneviratne)... ఈ పేరు వింటే ఎవరో శ్రీలంక క్రికెటర్‌ గురించి చెబుతున్నాం అనుకోవచ్చు. నిజమే కానీ ఇప్పుడు ఆయన టీమ్‌ ఇండియా (Team India)తో కలసి పని చేస్తున్నాడు. ఎవరతను, ఎందుకు మనతో ఉన్నాడు.

Published : 13 Sep 2023 11:45 IST

భారత క్రికెట్‌ జట్టులో ప్రస్తుతం ఎవరెవరున్నారనేది ఆటను అనుసరించే వాళ్లకు తెలుసు. అదే క్రికెట్‌ పిచ్చి ఉన్న అభిమానులకు అయితే కోచింగ్, సహాయక సిబ్బంది పేర్లు కూడా తెలుసు. కానీ నువాన్‌ సెనెవిరత్నె (Nuwan Seneviratne) ఎవరు? అంటే మాత్రం సమాధానం చెప్పడం కష్టమే. టీమ్‌ఇండియా (Team India) డైహార్డ్‌ అభిమానులకూ అతనెవరో తెలిసి ఉండదు. కానీ పాకిస్థాన్‌ ప్రమాదకర లెఫ్టార్మ్‌ పేసర్‌ షహీన్‌ షా అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్, శుభ్‌మన్, కోహ్లి, రాహుల్‌.. ఎలాంటి తడబాటు లేకుండా పరుగులు సాధించడం వెనుక ఈ నువాన్‌ ఉన్నాడు. టీమ్‌ఇండియా త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ ఈ నువాన్‌. మరి శ్రీలంకకు చెందిన అతను.. భారత జట్టులో ఎలా భాగమయ్యాడు? 

అలా వెలుగులోకి.. 

పాకిస్థాన్‌తో ఆసియా కప్‌ సూపర్‌- 4 మ్యాచ్‌లో షహీన్‌ షా అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ ఫ్లిక్‌తో సిక్సర్‌ కొట్టగానే అక్కడి కెమెరాలన్నీ భారత డ్రెస్సింగ్‌ గది బాల్కనీలో నిల్చున్న నువాన్‌పై ఫోకస్‌ పెట్టాయి. అప్పుడు అతనెవరూ అన్నది చాలా మందికి తెలీదు. పోనీ అతణ్ని టీవీలో ఎందుకు చూసిస్తున్నారన్నది కూడా తెలీదు. దీంతో నువాన్‌పై చర్చ మొదలైంది. శ్రీలంకకు చెందిన నువాన్‌ 2017 నుంచి టీమ్‌ఇండియాకు త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌గా సేవలు అందిస్తున్నాడు. జట్టు సహాయక బృందంతో కలిసి పని చేస్తున్నాడు. నెట్స్‌లో, మైదానంలో తన ఎడమ చేతి వాటంతో వేగంగా నేరుగా త్రోలు విసరడమే నువాన్‌ పని. కానీ ఈ త్రోలు విసిరే విధానంలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తూ, మంచి వేగాన్ని రాబడుతూ, విభిన్న కోణాలను ప్రయత్నిస్తూ.. బ్యాటర్లకు మంచి ప్రాక్టీస్‌ లభించేలా చూస్తున్నాడు. నువాన్‌ కారణంగానే మ్యాచ్‌లో లెఫ్టార్మ్‌ పేసర్లను భారత బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నారని చెప్పొచ్చు. 

బస్సు డ్రైవర్‌గా..

43 ఏళ్ల నువాన్‌ జీవిత ప్రయాణం ఆసక్తికరం. క్రికెట్‌పై ఇష్టంతో అతను లెఫ్టార్మ్‌ పేసర్‌గా మారాడు. కానీ కేవలం రెండు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లే ఆడగలిగాడు. అక్కడితోనే ఆటగాడిగా అతని క్రికెట్‌ కెరీర్‌ ముగిసింది. భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా మారింది. పొట్టకూటి కోసం ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఓ పాఠశాల బస్సు డ్రైవర్‌గా చేరాడు. కానీ ఖాళీ సమయంలో తన పాత క్రికెట్‌ క్లబ్‌కు వెళ్లేవాడు. అక్కడి జట్లకు బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో సహాయపడేవాడు. అలా ఒకసారి 2015లో వెళ్లిన సమయంలో శ్రీలంక మాజీ బ్యాటర్‌ చరిత్‌ సేననాయకేను కలవడంతో నువాన్‌ దశ తిరిగింది. నువాన్‌ త్రోలు విసిరే విధానం చరిత్‌ను ఆకట్టుకుంది. అలాగే అతని అంకితభావం, క్రమశిక్షణ నచ్చింది. అప్పుడు జట్టు మేనేజర్‌గా ఉన్న చరిత్‌.. నువాన్‌ను జట్టు సహాయక బృందంలో చేర్చుకోవాలని సూచించాడు. 2016లో భారత్‌లో పర్యటించిన శ్రీలంక- ఎ జట్టుతో కలిసి నువాన్‌ పనిచేశాడు. ఆ తర్వాత శ్రీలంక సీనియర్‌ జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. నువాన్‌ విసిరే వేగాన్ని చూసి శ్రీలంక కోచ్‌ గ్రాహం ఫోర్డ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 

ఇలా భారత్‌కు..

బవువా అని ముద్దుగా పిలుచుకునే నువాన్‌ గురించి భారత జట్టుకు తెలిసింది. 2017లో శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు నెట్స్‌లో బౌలింగ్‌ సహాయం కోసం నువాన్‌ను టీమ్‌ఇండియా పిలిపించింది. అప్పుడు నెట్స్‌లో తన వేగంతో కోహ్లీని అతను ఇబ్బంది పెట్టాడు. అతని బంతులు కోహ్లి శరీరానికి కూడా తగిలాయి. దీంతో నువాన్‌ నైపుణ్యాలకు మెచ్చి టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌.. అతనికి ఇంటర్వ్యూ నిర్వహించి జట్టు సహాయక బృందంలో చేర్చుకుంది. దీంతో ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమమైన జట్లలో ఒకటైన భారత్‌తో పనిచేసే అవకాశం అతనికి దక్కింది. డబ్బుతో పాటు మంచి హోదా లభించింది. నువాన్‌ ఎప్పటికప్పుడూ తన నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ.. సాధనలో బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసురుతూనే ఉన్నాడు. త్రో విసిరే చేతిని బలంగా ఉంచుకోవడం కోసం జిమ్‌లో కష్టపడుతున్నాడు. లెఫ్టార్మ్‌ పేసర్లపై భారత బ్యాటర్లు ఆధిపత్యం చలాయిస్తుంటే.. తన కష్టం ఫలించిందని ఆనందపడుతున్నాడు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని