Richest Cricketer: మన దేశంలో అత్యంత సంపన్న క్రికెటర్‌ ఎవరో తెలుసా?

భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ల (Richest Cricketers) విషయానికొస్తే.. సచిన్‌, ధోనీ, కోహ్లీలను మించి ఓ క్రికెటర్‌కు ఆస్తులున్నాయి. మరి ఆ ఆటగాడెవరో తెలుసుకుందాం రండి. 

Published : 08 Jul 2023 14:19 IST

ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో క్రికెట్‌కు, క్రికెటర్లకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్‌ ఫీజులు, వార్షిక కాంట్రాక్టులకు తోడు ఐపీఎల్‌, ప్రకటనల్లో నటించడం ద్వారా ఆటగాళ్లు భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారు. ముఖ్యంగా స్టార్‌ ఆటగాళ్లు ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. చిన్న చిన్న యాడ్స్‌లో నటించినా రూ.కోట్లు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత స్టార్‌ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) నికర ఆస్తి విలువ రూ.1,000 కోట్లు దాటిందని ఇటీవలే వార్తలొచ్చాయి. క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar) ఆస్తి విలువ సుమారు రూ.1,250 కోట్లు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఆస్తి విలువ రూ.1,040 కోట్లు ఉంటుందని అంచనా.

అయితే, భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ల (Richest Cricketers) విషయానికొస్తే.. సచిన్‌, ధోనీ, కోహ్లీలను మించి ఓ క్రికెటర్‌కు ఆస్తులున్నాయి. అయితే, ఆ ఆటగాడు స్టార్‌ క్రికెటర్‌ కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇంతకీ ఆ క్రికెటర్‌ ఎవరంటే.. గుజరాత్‌లోని బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ సమర్‌జిత్‌ రంజిత్‌సిన్హ్‌ గైక్వాడ్ (Samarjeet Ranjitsinh Gaekwad). ఈయన ఆస్తి విలువ సుమారు రూ.20,000 కోట్లకు పైమాటే. రంజిత్‌సిన్హ్‌ గైక్వాడ్‌కు ఇంత ఆస్తి ఉండటానికి కారణం అతని కుటుంబ నేపథ్యమే. అతను రాజవంశానికి చెందినవాడు. వడోదర మహారాజు రంజిత్‌సిన్హ్‌ ప్రతాప్‌ గైక్వాడ్, శుభన్‌గిని రాజేల ఏకైక కుమారుడే సమర్‌జిత్‌ రంజిత్‌సిన్హ్‌ గైక్వాడ్‌. ఏప్రిల్ 25, 1967న జన్మించిన సమర్‌జిత్‌.. దేహ్రాదూన్‌లోని ది డూన్ స్కూల్‌లో విద్యనభ్యసించారు. 

2012 మేలో తన తండ్రి మరణించిన తర్వాత సమర్‌జిత్‌కు మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌, మోతి బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం యజమాని ఇతనే. లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ సమీపంలోని 600 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్‌ భూములు కూడా ఈయనే పేరిటే ఉన్నాయి. గుజరాత్‌, బెనారస్‌లలో 17దేవాలయాలను, ట్రస్ట్‌లను కూడా నిర్వహిస్తున్నారు. 2002లో వంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని సమర్‌జిత్‌ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 2014 నవంబర్‌లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన ఆయన.. 2017 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సమర్‌జిత్‌ క్రికెట్‌ కెరీర్‌ విషయానికొస్తే.. బరోడా తరఫున 1987-89 మధ్య రంజీ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌లు ఆడి 119 పరుగులు చేశారు. అత్యధిక స్కోరు 65. మూడు క్యాచ్‌లు అందుకున్నారు. బరోడా క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగానూ పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని