Saurabh Netravalkar: పాక్‌కు ‘సూపర్‌’ షాకిచ్చిన ముంబయి ఇంజినీర్‌.. ఎవరీ సౌరభ్‌ నేత్రావల్కర్‌?

Saurabh Netravalkar: పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలోనే అమెరికా సంచలన విజయాన్ని అందుకుంది. సూపర్‌ ఓవర్‌లో పాకిస్థాన్‌పై అద్భుతంగా బౌలింగ్‌ చేసిన సౌరభ్‌ నేత్రావల్కర్‌ సోషల్‌ మీడియాలో హీరో అయ్యాడు.

Updated : 07 Jun 2024 11:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ టోర్నీ (T20 World Cup 2024)లో అమెరికా అద్భుత విజయం వెనుక ఓ భారత హీరో ఉన్నాడు. పద్నాలుగేళ్ల కిందటే తన బౌలింగ్‌తో పాకిస్థాన్‌ (USA vs PAK)కు చుక్కలు చూపించిన అతడు.. ఇప్పుడు మళ్లీ బాబర్‌ జట్టును కంగుతినిపించాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ కూల్‌గా బౌలింగ్‌ చేసి అమెరికాకు ‘సూపర్‌’ విక్టరీ అందించాడు. అతడే సౌరభ్‌ నేత్రావల్కర్‌ (Saurabh Netravalkar). వృత్తిరీత్యా ఇంజినీర్‌ అయిన అతడు క్రికెట్‌పై మమకారంతో బంతి అందుకుని సంచలనం సృష్టించాడు. దీంతో సౌరభ్‌ పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో మార్మోగుతోంది. ఇంతకీ ఎవరీ నేత్రావల్కర్‌..?

ముంబయిలో పుట్టి.. భారత్‌కు ఆడి

భారత్‌కు చెందిన సౌరభ్ నరేశ్‌ నేత్రావల్కర్‌ 1991 అక్టోబరు 16న ముంబయిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకోవడమే గాక భారత్‌ తరఫున అండర్‌ -19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2010లో జరిగిన ఈ టోర్నీలో టీమ్‌ఇండియా (Team India) సభ్యుడిగా ఉన్నాడు. కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, హర్షల్‌ పటేల్‌, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌, సందీప్‌ శర్మ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు ముంబయికి రంజీల్లో ప్రాతినిధ్యం వహించాడు. భారత్‌లో తీవ్రమైన పోటీ కారణంగా ఆ తర్వాత టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. 

చదువు కోసం అమెరికా వెళ్లి.. 

ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో అవకాశాలు రాకపోవడంతో తిరిగి చదువుపై దృష్టి సారించాడు. 23 ఏళ్ల వయసులో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఆ మరుసటి ఏడాది కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరాడు. అయినా ఆటపై ఇష్టాన్ని వదులుకోలేకపోయాడు. అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకుని ఎట్టకేలకు 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌పై తొలి మ్యాచ్‌ ఆడాడు. అమెరికా జట్టుకు కొంతకాలం కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇప్పటి వరకు 48 వన్డేలు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం.. పాక్‌పై అమెరికా ‘సూపర్’ విక్టరీ

నాటి ఓటమికి ప్రతీకారం..

టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్‌తో అమెరికా తలపడటం ఇదే తొలిసారి. నేత్రావల్కర్‌ (Software Engineer Saurabh Netravalkar)కు మాత్రం గతంలోనే బాబర్‌ జట్టును ఎదుర్కొన్న అనుభవం ఉంది. 2010 అండర్‌-19 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో ఆడిన అతడు.. ఆ టోర్నీలో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ టోర్నీలో దాయాది చేతిలో భారత్‌కు ఓటమి ఎదురైంది. ఆ తర్వాత టీమ్‌ఇండియాకు దూరమైన సౌరభ్‌.. ఇప్పుడు అమెరికా జట్టులో ఆడి నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు.

గురువారం నాటి మ్యాచ్‌లోనూ నేత్రావల్కర్‌ పాక్‌ను అద్భుతంగా కట్టడి చేశాడు. అత్యంత పొదుపైన బౌలింగ్‌తో నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. వేసిన తొలి మూడు ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చాడంటే బాబర్‌ జట్టును మనోడు ఎంత కంగారుపెట్టాడో అర్థం చేసుకోవచ్చు.

అమెరికా జట్టు తరఫున ప్రపంచకప్‌ టోర్నీకి ఎంపికైన తర్వాత నేత్రావల్కర్‌ మాట్లాడుతూ..‘‘ఇది చాలా భావోద్వేగ క్షణం. ఉన్నత చదువుల కోసం బ్యాగ్ సర్దుకుని అమెరికా వచ్చేశా. మళ్లీ క్రికెట్‌ ఆడుతానని కలలో కూడా ఊహించలేదు. నా క్రికెట్‌ షూ కూడా తెచ్చుకోలేదు’’ అని అన్నాడు. ప్రస్తుతం అతడు ఒరాకిల్‌ (Oracle)లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని