Bengaluru vs Hyderabad: అపజయాల ‘బెంగ’ళూరు ఎదుట.. హైదరా‘బాదుడే’ సవాల్‌..!

బెంగళూరు-హైదరాబాద్‌ జట్ల మధ్య నేటి మ్యాచ్‌కు చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలిచింది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Published : 15 Apr 2024 14:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయిని ఓడించింది.. చెన్నైకి చెక్‌ పెట్టింది.. పంజాబ్‌పై పంజా విసిరింది.. ఈ ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్‌ ఆటతీరు అందరి మతి పోగొడుతోంది.  మరోవైపు వరుస ఓటములతో కుదేలైన బెంగళూరు పరిస్థితి ఘోరంగా తయారైంది. పేపర్‌ పై చూస్తే.. స్టార్లకు కొదవేం లేని ఆ జట్టు అరడజను మ్యాచుల్లో ఒక్కటి మాత్రమే గెలవటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టు చిన్నస్వామి వేదికగా హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది.

కళ్లన్నీ మ్యాక్స్‌వెల్‌పైనే..

బెంగళూరు ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు ఏడో మ్యాచ్‌. లీగ్‌ స్టేజ్‌లో సగం మ్యాచ్‌లు ఆడిన ఏకైక జట్టుగా అవతరించనుంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలు ముగియకుండా.. సజీవంగా ఉండాలంటే బెంగళూరుకు ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్‌ కీలకమే.

గత మ్యాచ్‌లో (ముంబయిపై) విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. మ్యాక్స్‌వెల్  గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆసీస్ జాతీయ జట్టు తరఫున అదరగొట్టే అతడు.. బెంగళూరుకు ఒక్క నాణ్యమైన ఇన్నింగ్సూ ఆడలేదు. ఫలితంగా మీమ్స్‌ మెటీరియల్‌గా మారిపోయాడు. 

ఇక వెటరన్ దినేశ్ కార్తిక్‌ దూకుడు కొనసాగుతోంది. ముంబయిపై డుప్లెసిస్‌, రజత్ పటీదార్‌ హాఫ్‌ సెంచరీలు సాధించి మళ్లీ ఫామ్‌లోకి రావడం బెంగళూరుకు సానుకూలాంశం. మ్యాక్సీ కూడా బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తే.. బెంగళూరుకు తిరుగుండదు. అయితే, హైదరాబాద్‌ బౌలింగ్‌ విభాగం బలంగా ఉంది. కెప్టెన్ పాట్ కమిన్స్, భువి, నటరాజన్‌, జయ్‌దేవ్‌తో కూడిన పేస్‌ దళం ప్రత్యర్థులను కుదురుకోనీయడంలేదు. స్పిన్‌లో మయాంక్‌ మార్కండే, షహ్‌బాజ్‌ ఫర్వాలేదనిపిస్తున్నారు.

హైదరాబాద్ బ్యాటింగ్‌ X బెంగళూరు బౌలింగ్‌

హైదరాబాద్‌ దూకుడు ఆటతో ప్రత్యర్థులను వణికిస్తోంది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ అదరగొడుతోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్‌ హెడ్, క్లాసెన్, మార్‌క్రమ్‌, రాహుల్ త్రిపాఠి, సమద్‌, నితీశ్‌ రెడ్డితో కూడిన బ్యాటింగ్ లైనప్‌ బలంగా కనిపిస్తోంది. మరోవైపు బెంగళూరు బౌలింగ్ అత్యంత దారుణంగా ఉంది. అలాంటిది హైదరాబాద్‌ను ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సిరాజ్‌, విల్‌ జాక్స్, మ్యాక్స్‌వెల్, టోప్లీ, ఆకాశ్‌ దీప్‌ నాణ్యమైన బౌలింగ్‌ చేయాల్సిందే. విజయ్‌కుమార్ వైశాఖ్‌ ఒక్కడే అప్పుడప్పుడు ఫర్వాలేదనిపిస్తున్నాడు. ముంబయి, చెన్నై బౌలింగ్‌నే ఎదుర్కొని దూకుడుగా ఆడి హైదరాబాద్‌ బ్యాటింగ్‌ త్రయం పరుగులు రాబట్టింది. ఒకవేళ బెంగళూరు తొలుత బ్యాటింగ్‌ చేసి 200+ స్కోరు చేసినా విజయం సాధించాలంటే మాత్రం బౌలింగ్‌ శ్రమించాల్సిందే. ముంబయితో మ్యాచ్‌ అనంతరం బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘మేం 250+ స్కోరు చేస్తేనే గెలిచేందుకు అవకాశం ఉంటుంది. మా బౌలింగ్‌ బలహీనంగా ఉందనేది వాస్తవం’ అని వ్యాఖ్యానించాడు. ఆ లోటును పూరించుకొని బరిలోకి దిగాలి. 

గతం ఇలా.. పిచ్‌ అలా

బెంగళూరు - హైదరాబాద్‌ మొత్తం 22 మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ గణాంకాల్లో హైదరాబాద్‌దే పైచేయి. సన్‌రైజర్స్ 12 మ్యాచుల్లో విజయం సాధించగా.. బెంగళూరు 10 గెలిచింది. 2016లో ఆ జట్టును ఓడించే హైదరాబాద్‌ ఐపీఎల్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పిచ్‌ పరిస్థితికొస్తే.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్‌ నెగ్గే సారథి కచ్చితంగా లక్ష్య ఛేదనకే మొగ్గుచూపుతాడు. మంచు ప్రభావం కూడా కలిసొస్తుంది. భారీ టార్గెట్‌ను కూడా కాపాడుకోవడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

తుది జట్లు (అంచనా)

బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లామ్రోర్, దినేశ్‌ కార్తిక్ (వికెట్ కీపర్), రీస్ టోప్లీ, విజయ్ కుమార్, ఆకాశ్‌ దీప్, సిరాజ్

హైదరాబాద్‌ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐదెన్ మార్‌క్రమ్, నితీశ్‌ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్, అబ్దుల్ సమద్, షహ్‌బాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయ్‌దేవ్ ఉనద్కత్, నటరాజన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని