Team India: అప్పుడు యువీ.. మరి ఇప్పుడు

బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ రాణించే ఆల్‌రౌండర్లు ఏ జట్టుకైనా పెద్ద బలమవుతారు. అలా రాణించే ఆటగాళ్లు ప్రపంచకప్ (ODI WC 2023) విజయంలోనూ కీలకమవుతారు.

Published : 01 Oct 2023 14:31 IST

ఆల్‌రౌండ్ మెరుపుల కోసం టీమ్ఇండియా ఆశ

భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్‌ను అందుకోవడంలో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ది అత్యంత కీలక పాత్ర. ఫైనల్లో ధోని, గంభీర్‌ల ఇన్నింగ్స్ విజయంలో కీలకంగా మారితే.. సెమీఫైనల్లో సచిన్ ఇన్నింగ్స్ జట్టును గెలిపించింది. కానీ టీమ్ ఇండియా అక్కడిదాకా రావడానికి ప్రధాన కారణం మాత్రం యువరాజ్ సింగే. బ్యాటుతో, బంతితో అతను గొప్పగా రాణించాడు ఆ టోర్నీలో. 362 పరుగులు, 15 వికెట్లతో ఆ ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును కూడా అతనే గెలిచాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ రాణించే ఆల్‌రౌండర్లు ఏ జట్టుకైనా పెద్ద బలమవుతారు. అలా రాణించే ఆటగాళ్లు ప్రపంచకప్ విజయంలోనూ కీలకమవుతారు. టీమ్‌ఇండియా ఇప్పుడు అలాంటి మెరుపుల కోసమే చూస్తోంది.

ఇంగ్లాండ్ గత వన్డే ప్రపంచకప్‌ను గెలవడంలో బెన్ స్టోక్స్ ఎంత ముఖ్య పాత్ర పోషించాడో తెలిసిందే. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ జట్టులో స్టోక్సే కాదు.. లివింగ్‌స్టన్, మొయిన్ అలీ, సామ్ కరన్, డేవిడ్ విల్లీ లాంటి ఆల్‌రౌండర్లతో కళకళలాడుతోంది. ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్, స్టాయినిస్ లాంటి ఆల్‌రౌండర్ల బలం ఉంది. న్యూజిలాండ్‌ జట్టులోనూ గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, రచిన్ రవీంద్ర, డరైల్ మిచెల్ లాంటి ఆల్‌రౌండర్లు చాలామందే ఉన్నారు. ఇలా అన్ని ప్రధాన జట్లూ ఆల్‌రౌండర్ల బలంతో వస్తున్నాయి. ఆ జట్లతో పోలిస్తే మన ఆల్‌రౌండ్ బలం తక్కువే అనిపిస్తోంది. ఐతే సొంతగడ్డపై పరిస్థితులను సమర్థంగా ఉపయోగించుకుంటే మన ఆల్‌రౌండర్లూ సత్తా చాటి జట్టును ముందుకు తీసుకెళ్తారనే ఆశ ఉంది.

ఆ ఇద్దరూ ఏం చేస్తారో?

భారత్‌కు ఈ ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్య రూపంలో ఒక పేస్ ఆల్‌రౌండర్, రవీంద్ర జడేజా రూపంలో ఒక స్పిన్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉన్నారు. శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఓ మోస్తరుగా బ్యాటింగ్ చేయగలరు కానీ.. వారిని నిఖార్సయిన ఆల్‌రౌండర్లుగా పరిగణించలేం. అక్షర్ పటేల్ ఉంటే మూడో ఆల్‌రౌండర్ ఉన్నట్లయ్యేది. మరి అందుబాటులో ఉన్న ఇద్దరు ఆల్‌రౌండర్లు టోర్నీలో ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది కీలకం. కెరీర్ ఆరంభంలో హార్దిక్ ఆడిన కొన్ని సంచలన ఇన్నింగ్స్‌లు, తన బౌలింగ్ మెరుపులు చూసి కపిల్ దేవ్ స్థాయిని అందుకుంటాడని అనుకున్నారు. కానీ అతను అంచనాలను అందుకోలేకపోయాడు. మన క్రికెట్లో పేస్ ఆల్‌రౌండర్లు గొప్ప స్థాయిని అందుకున్నది తక్కువ. కపిల్ తర్వాత ఎక్కువ ఏళ్లు జట్టులో కొనసాగుతూ ఒక స్థాయిలో ఉన్నది మాత్రం హార్దికే. మధ్యలో ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ లేమితో అతను కొంత ఇబ్బంది పడ్డాడు. పునరాగమనం తర్వాత ఓ మోస్తరు ప్రదర్శనలతో సాగిపోతున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌లో అతను కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్ కూడా పర్వాలేదు. ఆసియా కప్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. ఆసీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నాడు.

ప్రపంచకప్‌లో అతను బౌలింగ్ కంటే బ్యాటింగ్‌లోనే కీలకం. మిడిలార్డర్లో ఒకప్పుడు ధోని పోషించిన ఫినిషర్ పాత్రలో అతను రాణించాల్సి ఉంది. టాప్ ఆర్డర్ విఫలమైతే.. మిడిలార్డర్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడటం, లోయర్ మిడిలార్డర్ బ్యాటర్లతో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పడం అతడి బాధ్యతలు. అప్పుడప్పుడూ పేస్ సేవలు కూడా అందించాల్సి ఉంటుంది. భారత పిచ్‌లపై బౌలింగ్‌లో అతడి నుంచి మరీ ఎక్కువ ఆశించలేం. కానీ అవసరం అయితే పరుగులు నియంత్రించడం, వికెట్లు తీయడం చేయాల్సి  ఉంటుంది. ఇక రవీంద్ర జడేజాపై భారత్ బౌలింగ్‌లో ఎక్కువ ఆధారపడనుంది. ప్రపంచకప్‌ పిచ్‌లు ఎక్కువగా స్పిన్‌కే అనుకూలించే అవకాశముంది. అక్కడ కుల్‌దీప్ భాగస్వామ్యంలో అతను మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచడం, వికెట్లు పడగొట్టడం చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాటింగ్ పరంగా క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకోవాలి. మొదట బ్యాటింగ్ చేస్తే చివర్లో స్కోరు పెంచడం.. ఛేదనల్లో ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్‌లను ముగించడం లాంటి బాధ్యతలు జడ్డూపై ఉన్నాయి. హార్దిక్, జడేజాల ఫామ్ మరీ గొప్పగా లేదు. అలా అని తీసిపడేసేలా కూడా లేదు. కానీ సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌లో మాత్రం ఈ అనుభవజ్ఞులైన ఆల్‌రౌండర్లపై జట్టు, అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి వీరిలో 2011లో యువరాజ్ తరహాలో రాణించి హీరోగా నిలిచేదెవరో?

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని