Buzzball: బజ్‌బాల్‌.. వరమా.. భారమా? ఇంగ్లాండ్ శైలిపై భిన్నాభిప్రాయాలు

తొలి బంతి నుంచి ప్రత్యర్థిపై ఎదురుదాడి చేయడమే లక్ష్యంతో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేళ్ల కిందట కొత్త కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్‌తో కలిసి బజ్‌బాల్‌కు శ్రీకారం చుట్టాడు.

Updated : 21 Feb 2024 17:00 IST

బజ్‌బాల్.. బజ్‌బాల్.. బజ్‌బాల్.. రెండేళ్లుగా ప్రపంచ క్రికెట్లో దీని గురించి ఎంత చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంగ్లాండ్ టెస్టుల్లో అనుసరిస్తున్న ఈ శైలి టెస్టు క్రికెట్ రూపురేఖల్ని మార్చేస్తోందన్నది వాస్తవం. టెస్టుల్లో సంప్రదాయ శైలిలో నెమ్మదిగా ఆడడం వదిలేసి.. పరిమిత ఓవర్ల క్రికెట్ తరహాలో దూకుడుగా ఆడటం మొదలుపెట్టాక ఇంగ్లాండ్ సంచలన విజయాలను దక్కించుకుంది. ఇతర జట్లు కూడా ఆ జట్టును అనుసరించాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ అప్పుడప్పుడు బజ్‌బాల్ (Buzzball) వల్ల మొత్తం తలకిందులై అసలుకే మోసం వస్తోందన్న వాదనా లేకపోలేదు. భారత్ చేతిలో మూడో టెస్టులో (IND vs ENG) ఇంగ్లాండ్ చిత్తుగా ఓడడంతో ఇంగ్లాండ్ మీడియా ఆ జట్టు తీరును తూర్పారబడుతోంది.

అలా బజ్‌బాల్‌కు శ్రీకారం..

రెండేళ్ల కిందట కొత్త కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్‌తో కలిసి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్.. బజ్‌బాల్ వ్యూహానికి శ్రీకారం చుట్టాడు. దీని ప్రకారం తొలి బంతి నుంచి ప్రత్యర్థిపై ఎదురుదాడి చేయడమే లక్ష్యం. టెస్టులంటే మామూలుగా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తారు. రన్‌రేట్ 3కు అటూఇటుగా ఉంటుంది. రన్‌రేట్ 3.5-4 మధ్య ఉంటే చాలా వేగంగా ఆడినట్లు లెక్క. కానీ ఇంగ్లాండ్ మాత్రం 5-6 రన్‌రేట్‌తో ఆడటం మొదలుపెట్టింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దూకుడుగా ఆడడానికే ప్రాధాన్యమిచ్చింది. బౌలింగ్‌లోనూ ఇదే దూకుడును అనుసరించింది. ఎప్పుడూ వికెట్ కోసం ఎటాకింగ్ ఫీల్డ్ పెట్టడం.. అందుకు తగ్గట్లే బౌలింగ్ చేయడం.. ఇలా భిన్నమైన శైలిని అనుసరించింది. అలాగే ఓడినా పర్వాలేదు గెలుపు కోసం ప్రయత్నించడమే తప్ప డ్రా కోసం ఆడడం మానేసింది ఇంగ్లిష్ జట్టు.

కొనియాడిన వాళ్లే విమర్శించడంతో..

ఈ బజ్‌బాల్ శైలి వల్ల ఇంగ్లాండ్ చాలావరకు ప్రయోజనమే పొందింది. వరుసగా టెస్టులు, సిరీస్‌లు గెలిచింది. బజ్‌బాల్ శైలి వల్ల టెస్టులకు ఆకర్షణ పెరగడంతో దీన్ని చాలామంది క్రికెట్ ప్రియులు స్వాగతించారు. టెస్టు క్రికెట్‌కు ఆదరణ అంతకంతకూ తగ్గిపోతున్న రోజుల్లో ఇంగ్లాండ్ సంప్రదాయ ఫార్మాట్‌కు జీవం పోస్తోందని ఆ జట్టుపై ప్రశంసలు కూడా కురిశాయి. కానీ సానుకూల ఫలితాలు వచ్చినపుడు ఒక విధానాన్ని కొనియాడేవాళ్లే.. ఫలితాలు ప్రతికూలమైనపుడు విమర్శించడం సహజం. ‘బజ్‌బాల్’ విషయంలోనూ అదే జరుగుతోంది.

గత ఏడాది యాషెస్ సిరీస్ సందర్భంగా తొలి టెస్టు తొలి రోజు దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ 393-8 వద్ద డిక్లేర్ చేసింది. అప్పటికి ఇంకా రూట్ క్రీజులో ఉన్నాడు. సాధారణంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటయ్యే వరకు ఆడుతుంది ఏ జట్టైనా. మరీ స్కోరు 500 దాటితే కానీ డిక్లేర్ చేయదు. అది కూడా రెండో రోజు ఆ పని చేస్తారు. కానీ తొలి రోజు ఇంకా ఆట పూర్తి కాకముందే, రూట్ లాంటి బ్యాటర్ క్రీజులో ఉండగానే ఇంగ్లిష్ జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ తప్పుకి ఓటమి రూపంలో మూల్యం చెల్లించుకుంది.

బజ్‌బాల్‌ పేరుతో వెర్రి ఆలోచన చేశారంటూ స్టోక్స్, మెక్‌కలమ్ జోడీపై ఇంగ్లాండ్ అభిమానులు, మాజీల నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్ నిర్ణయాలు విమర్శలకు దారి తీశాయి. ఇక ప్రస్తుత భారత్ సిరీస్ విషయానికి వస్తే.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల భారీ లక్ష్యం నిలవగా.. అంత పెద్ద ఛేదన అసాధ్యం కాబట్టి మిగిలిన ఒకటిన్నర రోజు నెమ్మదిగా ఆడి మ్యాచ్‌ను డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాల్సిందని.. కానీ దూకుడుగా ఆడి కేవలం 122 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవం మూటగట్టుకుందని ఆ జట్టుపై స్వదేశీ మీడియా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కొందరు మాజీలు కూడా ఆ జట్టు ఆటతీరును తప్పుబడుతున్నారు.

రూట్ లాంటి మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మన్.. బజ్‌బాల్ శైలికి అలవాటుపడే క్రమంలో తన సహజ శైలిని కోల్పోయాడని.. ఫామ్‌ను కూడా దెబ్బ తీసుకున్నాడని.. ఇది బజ్‌బాల్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్ అని విమర్శిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్‌మెంట్‌ మాత్రం తమకు అద్భుత విజయాలు అందించిన బజ్‌బాల్ విషయంలో తగ్గేదే లేదంటోంది. సిరీస్‌లో మిగతా మ్యాచ్‌ల్లోనూ బజ్‌బాల్ శైలినే కొనసాగిస్తామని.. ఒకట్రెండు ప్రతికూల ఫలితాలు తమ ఆలోచనను మార్చలేవని.. సిరీస్‌లో కచ్చితంగా పుంజుకుంటామని అంటున్నాడు ఆ జట్టు కోచ్ మెక్‌కలమ్. మరి ఈ శైలి అంతిమంగా ఇంగ్లిష్ జట్టుకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

-ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని