ODI World Cup: ఆ రెండు వేదికలను మార్చాలని పాక్‌ ఎందుకు కోరుతోంది..? కారణం ఇదేనా..?

వన్డే ప్రపంచకప్‌(ODI World Cup 2023) ముసాయిదా షెడ్యూల్‌ విడుదలైంది. అయితే.. పాక్‌(Pakistan) ముఖ్యంగా రెండు వేదికలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి కారణాలను పరిశీలిస్తే..

Updated : 19 Jun 2023 15:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) కోసం బీసీసీఐ (BCCI) ఇటీవల ముసాయిదా షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ముసాయిదా షెడ్యూల్‌పై దాయాది పాకిస్థాన్‌ (Pakistan) కాస్త అసౌకర్యానికి గురవుతున్నట్లు సమాచారం.

ఈ మెగా టోర్నీ తుది షెడ్యూల్‌ను ప్రకటించే ముందు.. సభ్య దేశాల నుంచి సూచనలు, సలహాలను ఐసీసీ(ICC) కోరింది. అయితే పాక్‌ క్రికెట్‌ బోర్డు(PCB) ఈ షెడ్యూల్‌పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ అందించిన ఈ ముసాయిదా షెడ్యూల్‌ను పరిశీలించి పాక్‌ ఆడే వేదికలను ఆమోదించే పనిని పీసీబీ.. డేటా అనలిటిక్స్‌, బోర్డు వ్యూహకర్తలకు అప్పగించింది. అయితే.. ఇందులో ముఖ్యంగా రెండు వేదికలపై పాక్‌ నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. అఫ్గానిస్థాన్‌తో తలపడే చెన్నై వేదిక, ఆస్ట్రేలియాతో తలపడే బెంగళూరు వేదికలు తమకు అనుకూలం కావంటూ వారు చెప్పినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే..?

స్పిన్నర్లకు సహకరించే చెన్నై పిచ్‌పై రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌లాంటి బలమైన బౌలర్లను పాక్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరిద్దరూ ఇప్పటికే ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు మెరుగైన ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక బెంగళూరు పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీనిపై పెద్ద జట్టయిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం సవాలే. పిచ్‌ పరిస్థితులు, ఇతర విషయాల్లో పాక్‌ సవాళ్లు ఎదుర్కొనే వేదికల్లోనే కావాలని మ్యాచ్‌లు ఆడేలా భారత్‌ షెడ్యూల్‌ రూపొందించిందని పీసీబీ ప్రతినిధులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే పీసీబీ వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు వేదికలను మార్చాలని పీసీబీ కోరుతున్నట్లు తెలిసింది.

బలమైన కారణం ఉంటేనే..

ప్రయాణాలకు సంబంధించిన సూచనల కోసమే.. ప్రొటోకాల్‌ ప్రకారం సభ్య దేశాలకు ముసాయిదా షెడ్యూల్‌ పంపించడం జరిగిందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు. వేదికలను మార్చాలంటే.. అందుకు బలమైన కారణం ఉండాలని స్పష్టం చేశారు. ‘భద్రతా కారణాలతో సభ్య దేశం.. తమ వేదికను మార్చాలని ఒత్తిడి తీసుకురావొచ్చు. టీ20 ప్రపంచకప్‌-2016 సమయంలో పాక్‌.. భారత్‌లో పర్యటించేందుకు ఇలాగే కోరింది. కానీ.. జట్టు బలాలు, బలహీనతలను బట్టి వేదికలను మార్చడం కుదరదు. అలా అయితే.. షెడ్యూల్‌ను రూపొందించడం కష్టతరమవుతుంది’ అంటూ ఆ ప్రతినిధి తెలిపారు. 2016లో భారత్‌-పాక్‌ ఆడిన మ్యాచ్‌ను భద్రతా కారణాల రీత్యా ధర్మశాల నుంచి కోల్‌కతాకు మార్చిన విషయం తెలిసిందే. దీంతో బలమైన కారణం ఉంటే తప్పితే.. వేదికలను మార్చడం కుదరదని ఆ ప్రతినిధి చెప్పాడు.

ఇక ముసాయిదా షెడ్యూల్‌ ప్రకారం.. చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య  అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న మ్యాచ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని