Ind vs Pak: భారత్ X పాక్‌ మాత్రమే ప్రత్యేకమా?... ప్రపంచకప్‌లో అసమానత్వంపై చర్చ!

వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్న బీసీసీఐ, ఐసీసీ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated : 14 Oct 2023 07:12 IST

క్రికెట్లో అత్యున్నత టోర్నీ అయిన వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ఇటీవలే ప్రారంభమైంది. అంత ప్రతిష్ఠాత్మక టోర్నీ మొదలవుతుంటే, మ్యాచ్‌ ఆరంభానికి చిన్న వేడుక కూడా చేయలేదు నిర్వాహకులు. గత ప్రపంచకప్‌లో ఫైనల్‌ ఆడిన రెండు జట్లు తలపడుతుంటే ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం ప్రేక్షకులు లేక వెలవెలబోయింది. ఆ మ్యాచ్‌ను అలా పట్టించుకోకుండా వదిలేసి, టోర్నీ మొదలైన ఎనిమిది రోజులకు అదే మైదానంలో భారత్‌ - పాకిస్థాన్‌ (India vs Pakistan) మ్యాచ్‌ సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారన్న వార్తలు క్రికెట్‌ ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీశాయి.

ఆట ఏదైనా సరే ప్రపంచకప్‌ అంటే, అందులో భాగమైన అన్ని దేశాలకు సమాన అవకాశాలు కల్పించే టోర్నీ. ఒక జట్టు ఎక్కువ, ఒకటి తక్కువ అనే భావనకు అందులో అవకాశమే ఉండకూడదు. నిబంధనల నుంచి అన్నీ అందరికీ సమానంగానే ఉండాలి. కానీ భారత్‌ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌లో సమన్యాయం కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా భారత అభిమానులే ఈ విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారని, ఈ పోరును ‘రొమాంటిసైజ్‌’ చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్‌ జట్టును ప్రత్యేకంగా చూస్తుండటం, ఆ జట్టుతో మ్యాచ్‌ను సెలబ్రేట్ చేస్తుండటాన్ని తప్పుబడుతూ ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ ట్విటర్లో ట్రెండ్‌ కూడా చేస్తుండటం గమనార్హం.

ఆ మ్యాచ్‌ను అలా వదిలేసి..

ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ముంగిట ఆరంభ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఆ మ్యాచ్‌లో తలపడే జట్లు ఏవైనా సరే, భారీ స్థాయిలో వేడుకలు నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం ఏ హడావుడి లేకుండా టోర్నీని మొదలుపెట్టేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియమైన నరేంద్ర మోదీ మైదానంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ తలపడ్డ ఈ మ్యాచ్‌ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ లేక వెలవెలబోయింది. మ్యాచ్‌ ఆరంభ సమయానికి పదో వంతు కూడా స్టేడియం నిండలేదు. ఒక ఇన్నింగ్స్‌ అయ్యేసరికి మూడోవంతు జనం కనిపించారు. టీ20ల ప్రభావంతో కొన్నేళ్లుగా వన్డేలకు ఆదరణ తగ్గిపోతోంది. ఈ స్థితిలో క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే భారత్‌లో ప్రపంచకప్‌ నిర్వహించడం ఈ ఫార్మాట్‌కు మేలు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని టోర్నీ పట్ల అభిమానుల్లో ఆసక్తి పెంచాల్సిన ఐసీసీ, బీసీసీఐ అలక్ష్యం వహించాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌కు స్టేడియం చాలా వరకు ఖాళీగా కనిపించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. తొలి వారం రోజుల్లో భారత జట్టు ఆడినవి మినహా చాలా మ్యాచ్‌లకు ప్రేక్షకాదరణ అంతంతమాత్రంగానే కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ శనివారం జరిగే భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ విషయంలో నిర్వాహకులు చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సహజంగానే భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై అందరిలో అమితాసక్తి ఉంటుంది. సులువుగా స్టేడియాలు నిండిపోతాయి. టీవీల్లోనూ కోట్లాది మంది ఈ మ్యాచ్‌ను చూస్తారు. దీనికి ప్రత్యేక ఆకర్షణలేవీ జోడించాల్సిన అవసరం లేదు. కానీ బీసీసీఐ మాత్రం ఈ మ్యాచ్‌కు ముందు భారీ స్థాయిలో సంగీత విభావరి నిర్వహిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేక అతిథులుగా రప్పించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించింది. ఆరంభ మ్యాచ్‌ను పట్టించుకోకుండా వదిలేసి.. టోర్నీ మొదలైన తొమ్మిది రోజుల తర్వాత భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు మాత్రం ఇంత హడావుడి చేయడమేంటనే ప్రశ్న క్రికెట్‌ ప్రపంచం నుంచి ఉత్పన్నమవుతోంది. ఇది మిగతా జట్ల పట్ల చిన్నచూపునకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. 

ఆసియా కప్‌లో అలా..

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ పట్ల అభిమానుల్లో ఉండే ఆసక్తిని సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా బీసీసీఐ, ఇతర క్రికెట్‌ పాలకుల తీరు ఉంటోందన్నది కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తున్న అభిప్రాయం. ఈ రెండు జట్లు ప్రపంచకప్, ఆసియాకప్‌.. ఇలా ఏ టోర్నీలో తలపడ్డా ప్రపంచవ్యాప్తంగా పదుల కోట్లమంది టీవీల్లో వీక్షిస్తారు. ఆదాయం భారీ స్థాయిలో ఉంటుంది. 2012 తర్వాత ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోవడంతో ప్రపంచకప్, ఆసియాకప్, ఛాంపియన్స్‌ ట్రోఫీ లాంటి టోర్నీల్లో ఇరు జట్లు తలపడ్డపుడు అందరి చూపూ ఆ మ్యాచ్‌ల మీదే ఉంటోంది. అందుకే ఆరు దేశాలే తలపడే ఆసియా కప్‌లో ఈ రెండు జట్లూ రెండు మూడు సార్లు తలపడేలా ఫార్మాట్‌ రూపొందిస్తున్నారు. 

ఇటీవల శ్రీలంకలో జరిగిన ఆసియాకప్‌లో రెండు జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ వర్షం వల్ల మధ్యలో ఆగిపోయింది. తర్వాత సూపర్‌-4 దశలో ఈ రెండు జట్ల పోరుకు కూడా వర్షం ముప్పు ఉండడంతో ప్రత్యేకంగా రిజర్వ్‌ డే కేటాయించారు. ఇది టోర్నీ మధ్యలో తీసుకున్న నిర్ణయం. వేరే మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పున్నా, వాటికి మాత్రం నిర్వాహకులు రిజర్వ్‌ డే కేటాయించలేదు. ఈ విషయమై ఇతర జట్ల నుంచి కొంత అసంతృప్తి కూడా వ్యక్తమైంది. అయితే బీసీసీఐ అర్థ బలం దృష్ట్యా ఈ పక్షపాతాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద క్రికెట్‌ దేశాలు కూడా మౌనం వహిస్తున్నాయి. కానీ పది దేశాలు తలపడుతున్న ప్రపంచకప్‌లో రెండు జట్లను మాత్రమే ప్రత్యేకంగా చూడడం టోర్నీ ఔన్నత్యాన్ని దెబ్బ తీస్తుందనే అభిప్రాయాలు సగటు క్రికెట్‌ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని