Soft Signal: గిల్‌ ఔటుతో మరోసారి ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ చర్చలోకి..!

భారత బ్యాటర్‌ శుభమన్‌ గిల్‌ ఔటు పెను దుమారానికి దారితీసింది. బంతి నేలను తాకినట్లు కనిపించినా థర్డ్ అంపైర్‌ ఔటు ఇవ్వడంతో అభిమానులు మండిపడుతున్నారు. సాఫ్టసిగ్నల్‌ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో అని వాపోతున్నారు. 

Updated : 11 Jun 2023 12:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌(WTC Final) మ్యాచ్‌లో సాఫ్ట్‌ సిగ్నల్‌(Soft Signal) అంశం మరోసారి చర్చలో నిలిచింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో తొలివికెట్‌గా గిల్‌ (Shubman Gill) వెనుదిరిగాడు. బోలాండ్‌ వేసిన బంతి గిల్‌ బ్యాట్‌ను ముద్దాడి గల్లీలో ఉన్న గ్రీన్‌ వైపు వెళ్లింది. నేలకు అత్యంత సమీపంలో గ్రీన్‌ దీనిని అందుకొన్నాడు. ఆసీస్‌ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. ఫీల్డ్‌ అంపైర్లు మాత్రం అనుమానంతో థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశారు. ఇక్కడ స్వచ్ఛందగా ఫీల్డ్‌ అంపైర్లే థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశారు. టీవీ రీప్లేలో కూడా బంతి నేలను తాకినట్లు కనిపించినా.. థర్డ్‌ అంపైర్‌ మాత్రం ఆసీస్‌ పక్షం వహించాడు. దీంతో చేసేది లేక.. గిల్‌ తొలివికెట్‌గా పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. 

సాఫ్ట్‌ సిగ్నల్‌ నిబంధన అమల్లో ఉంటే గిల్‌ కచ్చితంగా నాటౌట్‌గా తేలేవాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. వాస్తవానికి ఈ నిబంధన అమల్లో ఉంటే.. గిల్‌ క్యాచ్‌ విషయంలో గందరగోళానికి గురైన అంపైర్లు నాటౌట్‌గా సాఫ్ట్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఔట్‌ అనడానికి పక్కా ఆధారం గిల్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌కు లభించే అవకాశం లేదు. దీంతో థర్డ్‌ అంపైర్‌ ఫీల్డ్‌ అంపైర్ల నిర్ణయానికి మద్దతు తెలపాల్సి వచ్చేదని అభిమానులు భావించారు. 

వాస్తవానికి సాఫ్ట్‌ సిగ్నల్‌ నిబంధనను ఈ నెల నుంచే ఐసీసీ తొలగించింది. ఈ మేరకు ఐసీసీ నియమించిన ఓ కమిటీ సిఫార్స్‌ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది. దీనిలో భారత్‌ మాజీ బ్యాటర్‌ గంగూలీ కూడా సభ్యుడు. సాఫ్ట్‌ సిగ్నల్‌ ప్రక్రియ సుదీర్ఘంగా ఉందని ఈ కమిటీ అభిప్రాయపడింది. ఈ నిబంధన అనవసరమైన గందరగోళం పరిస్థితులు సృష్టిస్తోందని గంగూలీనే ఓ సందర్భంలో వెల్లడించాడు. 

ఏమిటీ సాఫ్ట్‌ సిగ్నల్‌ 

ఇన్ని రోజులు బంతిని ఆటగాళ్లు సరిగ్గా అందుకున్నారా? లేదా నేలకు తాకిందా? అనే అనుమానం ఉన్న క్యాచ్‌ల విషయంలో మైదానంలోని అంపైర్లు ఔట్‌ లేదా నాటౌట్‌ను ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’గా చూపిస్తూ.. టీవీ అంపైర్‌ను తుది నిర్ణయం తీసుకోవాలని అడిగేవాళ్లు. రీప్లేలో పరిశీలించిన తర్వాత స్పష్టత లేకుంటే, గందరగోళ పరిస్థితుల్లో మైదానంలోని అంపైర్‌ తీసుకున్న ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ను సమర్థిస్తూ టీవీ అంపైర్‌ నిర్ణయం తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నాటౌట్‌లా కనిపించినప్పటికీ మైదానంలోని అంపైర్‌ ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ ఔట్‌గా ఇవ్వడం, టీవీ అంపైర్‌ దీన్ని సమర్థించడం చాలా సార్లు వివాదాస్పదమైంది. ఈ నిబంధన రెండువైపులా పదునైన కత్తిలా ఉండటంతో తొలగించి.. గందరగోళం విషయంలో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి పెద్దపీట వేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని