IPL - T20 World Cup: ఒక్కటి తగ్గింది.. అది కూడా ఉంటే ఐపీఎల్‌ సూపర్‌’!

Super Overs in IPL - T20 World Cup | టీ20 వరల్డ్‌ కప్‌లో అప్పుడే రెండు సూపర్‌ ఓవర్లు చూశాం. మరి ఐపీఎల్‌లో ఎందుకు ఒక్కటీ రాలేదు. 

Published : 07 Jun 2024 14:49 IST

రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్‌లో ఒక్క సూపర్‌ ఓవరు లేదు. అదే ఇలా మొదలైందో లేదో ప్రపంచ కప్‌లో రెండు సూపర్‌ ఓవర్‌లు వచ్చాయి. ఐపీఎల్‌లో ఎందుకు మనం ‘సూపర్‌ ఓవర్‌’ చూడలేకపోయాం. ఈ చర్చను ఓసారి టచ్‌ చేస్తే...

టీ20 మ్యాచుల సంరంభం అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేవి ఐపీఎల్‌ (IPL), వరల్డ్‌ కప్‌ (T20 World Cup). క్రికెట్‌ ఫ్యాన్స్‌కి ఈ రెండూ వీనుల విందే. అందులోనూ ఈ ఫార్మాట్‌లో సూపర్‌ ఓవర్‌ (Super Over) మజా డబుల్‌ కిక్‌ ఇస్తుంది. అయితే 74 మ్యాచ్‌ల ఐపీఎల్‌లో ఈసారి మనం ఒక్క సూపర్‌ ఓవర్‌ కూడా చూడలేకపోయాం. కట్‌ చేస్తే ప్రపంచ కప్‌లో ఇప్పటికే రెండు సూపర్‌ ఓవర్‌లు ఎదురయ్యాయి. దీంతో ‘ఐపీఎల్‌ కంటే వరల్డ్‌ కప్‌ ‘సూపర్‌’ అంటున్నారు క్రికెట్‌ అభిమానులు. మరికొందరేమో ఐపీఎల్‌లో ఏదో తగ్గిందబ్బా అని ఆలోచిస్తున్నారు. 

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఒమన్‌-నమీబియా.. యూఎస్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌లు సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ అయినా, ప్రపంచకప్‌ అయినా ఫార్మాట్‌ ఒకటే. ఆడేది స్టార్‌ ప్లేయర్లే. అదే బ్యాటు, అదే బంతి. దాదాపు ఒకేలాంటి పిచ్‌లు. కానీ, మన ఫ్రాంచైజీ లీగ్‌లో ‘సూపర్‌’ ఓవర్‌ చూడలేకపోయాం. దీనికి ప్రధానంగా మూడు కారణాలు చెప్పొచ్చు. ఒకటి పిచ్‌ అయితే, రెండోది బంతి-బ్యాట్‌ సమతూకం లేకపోవడం, మూడోది ఇంపాక్ట్ ప్లేయర్‌. వీటి వల్లే మనం ఆ అదనపు ఆనందాన్ని ఐపీఎల్‌లో కోల్పోయామని చెప్పొచ్చు.

  • టీ20 క్రికెట్‌ అంటే బ్యాటర్లదే రాజ్యం అని అంటుంటారు. కానీ, కేవలం ఫోర్లు, సిక్స్‌లు మాత్రమే మ్యాచ్‌లో ఉంటే మజా ఉండదు. మధ్య మధ్యలో వికెట్లు కూడా పడుతుండాలి. దానికి కౌంటర్‌ ఎటాక్‌ బ్యాటర్లు చేయాలి. అప్పుడే బ్యాటుకు, బంతికి మధ్య సమతూకం లభిస్తుంది. ఇది ఐపీఎల్‌లో మిస్‌ అయింది. 
  • ఐపీఎల్‌కి వచ్చేసరికి బ్యాటర్లకు స్వర్గధామం లాంటి వికెట్లు సిద్ధం చేశారు. ఈ ఏడాది చూసిన భారీ స్కోర్లే దీనికి నిదర్శనం. ఒకటో, రెండో మైదానాలే బౌలర్లకు సహకరించాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక బౌండరీ డైమన్షన్లు మరీ చిన్నగా ఉన్నాయనే విమర్శలూ ఈ ఏడాది వినిపించాయి. 
  • క్రికెట్ అంటే 11 మంది ఆడే ఆట. కానీ, ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అంటూ 12వ వ్యక్తిని తీసుకొచ్చారు. దీంతో అదనపు బ్యాటరు, బౌలర్‌ అందుబాటులోకి వచ్చినట్లైంది. తుది ఓవర్లలో మ్యాచ్‌ గమనాన్ని అమాంతం తిప్పేశారు. కొన్నిసార్లు ప్రత్యర్థి నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. 

పై మూడు అంశాల వల్ల ఐపీఎల్‌లో బంతికి, బ్యాటుకి మధ్య హోరాహోరీ పోరు మిస్‌ అయ్యి.. ఏకపక్ష మ్యాచ్‌లుగా మిగిలిపోయాయి. దీంతో ‘టై’ అవ్వలేదు, సూపర్‌ ఓవరూ రాలేదు. 

ఐపీఎల్‌లో ఇప్పటివరకు సూపర్‌ ఓవర్లు ఆడలేదా అంటే కచ్చితంగా ఆడారు అనే చెప్పాలి. మొత్తంగా 17 సీజన్లలో 14 మ్యాచుల్లో అలా ఫలితం తేలింది. అత్యధికంగా అయితే గత మూడేళ్లలో ఒక్కటీ ఆడలేదు. దీంతో ప్రేక్షకులు కూడా ఆ మజాను బాగా మిస్‌ అవుతున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని