IPL 2024: భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!

ఐపీఎల్‌ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్‌ ప్రేక్షకులు ఫిక్స్‌ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. 

Published : 29 Apr 2024 11:14 IST

ఐపీఎల్‌ 17లో రికార్డు స్కోర్లు ఉన్నాయ్‌... భారీ సిక్స్‌లూ ఉన్నాయ్‌..   కళ్లు చెదిరే క్యాచ్‌లూ ఉన్నాయ్‌... కానీ మజా మాత్రం లేదు. ఏ ఐపీఎల్‌ అభిమానిని అడిగినా ఇదే మాట అంటున్నారు. ఐపీఎల్‌ (IPL)లో మజా ఎందుకు మిస్‌ అయ్యింది?

  • టీ20 క్రికెట్‌ అంటేనే బ్యాట్‌ వర్సెస్‌ బాల్‌. భారీ సిక్స్‌ కొట్టాక.. వికెట్‌ పడితే మజా వస్తుంది. బౌలర్‌ తెలివైన బంతికి... బ్యాటర్‌ సమయస్ఫూర్తి బ్యాటింగ్‌ పోటీగా నిలవాలి. కానీ ఈ ఐపీఎల్‌లో 200+ స్కోర్లు తప్ప వికెట్ల రాక కనిపించడం లేదు. గత 12 మ్యాచుల్లో పదింట 200+ స్కోర్లు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
  • ఐపీఎల్‌ గత సీజన్లను పరిశీలిస్తే సూపర్‌ ఓవర్లు, డబుల్ సూపర్‌ ఓవర్లు, హ్యాట్రిక్‌లు కనిపించేవి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు అలాంటి జాడే లేదు. దీంతో ప్రతి మ్యాచు ఒకే తరహాలో ముగుస్తోందనే భావన ఏర్పడింది. 
  • అత్యధిక పరుగుల రికార్డులు తప్ప.. ఈ ఏడాది మరే ఇతర రికార్డులు బద్ధలవ్వడం లేదు. ఆరెంజ్‌ క్యాప్‌ గురించి జరుగుతున్న చర్చ.. పర్పుల్‌ క్యాప్‌ గురించి ఎక్కడా వినిపించడం లేదు. దీంతో ఓన్లీ బ్యాటర్‌ గేమ్‌ అనే పరిస్థితి ఏర్పడింది. 
  • అందరూ కలసి 200+ స్కోరు కొట్టారా లేదా అనే లెక్క తప్ప... క్రిస్‌ గేల్‌ (175) వ్యక్తిగత స్కోరు రికార్డు స్కోరు బద్ధలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్రికెట్‌ ఎంత టీమ్‌ గేమ్‌ అయినా వ్యక్తిగత రికార్డులు టోర్నీకి ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తాయి. 
  • పాయింట్ల పట్టిక టాప్‌ 4 ఒకసారి చూడండి... ఆదివారం రాత్రి వరకు ఒక్కటంటే ఒక్కటీ స్టార్‌ టీమ్‌ లేదు. ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. ఇలా స్టార్‌ ప్లేయర్లున్న టీమ్‌లు టాప్‌లో ఉంటే.. చూసేవాళ్లకు మజా ఉంటుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పుడు పైకి వచ్చింది కాబట్టి ఏమన్నా మార్పు ఉంటుందేమో చూడాలి.
  • టీమ్‌ల కంటే వాటి కెప్టెన్ల పేరుతోనే జట్లు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంటాయి. ఇప్పటికే బెంగళూరు టీమ్‌ అంటే కోహ్లీ ఫొటోనే వాడుతుంటారు. అయితే ఈ సారి చూస్తే రోహిత్‌ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ (గతంలోనే) నాయకత్వం నుంచి పక్కకొచ్చేశారు. దీంతో ఆ ఆసక్తీ తగ్గిపోయింది. 
  • టీ20 క్రికెట్‌ అంటే ఓన్లీ క్రికెట్‌ అనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏదో చిన్న మసాలా కావాలి. ఉదాహరణకు గతంలో విరాట్‌ - నవీనుల్‌ హక్‌ - గంభీర్‌ మధ్య జరిగిన చర్చ మీకు గుర్తుండే ఉంటుంది. స్లెడ్జింగ్‌ సంగతి సరేసరి. ఈ ఏడాది ఆ మసాలాలు ఏమీ లేవు. దీంతో చప్పగా ఉంది అనేవారూ ఉన్నారు. 
  • ఆఖరి ఓవర్‌ వరకు మ్యాచ్‌ను తీసుకొచ్చి టీమ్‌ను గెలిపిస్తే మజా ఉంటుంది. అయితే ఆ విన్నింగ్‌ రింకు సింగ్‌ స్టైల్‌లో ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టేలా ఉంటే ఇంకా మజా ఉంటుంది. ఈ ఏడాది ఆ మ్యాజిక్‌ లేదు. ఛేజింగ్‌లో ఆఖరి ఓవర్‌ ఫైర్‌ వర్క్స్‌ మిస్‌ అయ్యేసరికి ఆసక్తి తగ్గిపోయింది. 
  • రోహిత్‌ చెప్పినట్లు 11 మంది ఆట 11 మందే ఆడాలి. 12వ ప్లేయర్‌ వచ్చేసరికి... ఏదో తేడా కొడుతోంది. మ్యాజిక్‌ తగ్గించేసింది అని చెప్పాలి. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు ఆడేవాళ్లు  మ్యాచ్‌ను మలుపు తిప్పాలి కానీ ఒక ఇన్నింగ్స్‌ డగౌట్‌లో కూర్చునే వాళ్లు కాదు.
  • ఇక ప్రతి నాలుగైదు బంతులకు బౌండరీ బాదడం ఓకే.. అయితే దీని కోసమే బౌండరీ లైన్స్‌ కుదించారనే విమర్శలూ వస్తున్నాయి. ఇవి టీ20 మజాను చంపేసేవే. బౌండరీ దగ్గరకు బంతి వెళ్లాలి కానీ..  బౌండరీ లైన్‌ ముందుకు జరగకూడదు అనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. 

నిపుణులు, స్టార్‌ క్రికెటర్లు, మాజీలు చేస్తున్న సూచనలను పరిశీలనలోకి తీసుకొని ఐపీఎల్‌ పాలకవర్గం ఏమన్నా మార్పులు చేస్తే వచ్చే ఐపీఎల్‌ అయినా మజానిస్తుంది. లేదంటే కష్టమే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని