WPL 2024: ఈ WPLలో తెలుగమ్మాయిలు మెరుస్తారా?

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) రెండో సీజన్‌ నేడే మొదలవుతోంది. ఈ లీగ్‌లో తెలుగు అమ్మాయిలు సత్తా చాటుతారా?

Updated : 23 Feb 2024 15:53 IST

ఏటా దేశంలో క్రికెట్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే టోర్నీ.. ఐపీఎల్‌. 16 ఏళ్లుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఈ లీగ్‌.. మరో నెల రోజుల్లో కొత్త సీజన్‌తో రాబోతోంది. ఈలోపు క్రికెట్‌ ప్రేమికులకు వినోదం పంచడానికి మేమూ ఉన్నాం అంటూ వస్తున్నారు అమ్మాయిలు. గతేడాదే మొదలైన మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (WPL 2024)లో రెండో సీజన్‌ నేడు మొదలవుతోంది. దీనిలో సత్తా చాటడానికి తెలుగు అమ్మాయిలు కూడా సై అంటున్నారు.

పొదుపుగా.. వేగంతో

డబ్ల్యూపీఎల్‌లో అదృష్టం పరీక్షించుకోబోతున్న తెలుగు అమ్మాయిలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. వారిలో ఎక్కువ అంచనాలున్నది యువ పేసర్‌ అంజలి శర్వాణి మీదే. కొన్ని నెలల కిందటే ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టుపై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. ఇప్పటిదాకా ఆమె 6 మ్యాచ్‌లాడి 3 వికెట్లు పడగొట్టింది. వికెట్ల సంఖ్య పరంగా తక్కువే అయినా.. పొదుపుగా, మంచి వేగంతో బౌలింగ్‌ చేసి ఆకట్టుకుంది. ఆమె డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. తెలుగు క్రికెటర్లలో అత్యధిక ధర దక్కించుకున్నది ఆమే. రూ.55 లక్షలకు యూపీ సొంతమైన ఆమె.. తొలి సీజన్లో 9 మ్యాచ్‌లాడి 4 వికెట్లు పడగొట్టింది. ఇప్పుడు అంతర్జాతీయ అనుభవంతో డబ్ల్యూపీఎల్‌లో అడుగు పెడుతున్న అంజలిని యూపీ ప్రధాన బౌలర్లలో ఒకరిగా చూడబోతున్నాం. ఈ సీజన్లో ఆమె తనదైన ముద్ర వేస్తుందని భావిస్తున్నారు.

డీసీ ధీమా.. మేఘన కొత్తగా

ఇప్పటికే భారత జట్టుకు 26 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన సీనియర్‌ పేసర్‌ అరుంధతి రెడ్డి.. డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ సభ్యురాలు. ఆమెను రూ.30 లక్షలకు కొనుక్కుంది డీసీ. కానీ తొలి సీజన్లో ఆమె నిరాశపరిచింది. 7 మ్యాచ్‌ల్లో 2 వికెట్లే తీసింది. తన బౌలింగ్‌కు మెరుగులు దిద్దుకుని వస్తున్న అరుంధతి ఈసారి మెరుగైన ప్రదర్శన చేస్తానన్న ధీమాతో ఉంది. భారత జట్టుకు 3 వన్డేలు, 17 టీ20లు ఆడిన సబ్బినేని మేఘన దూకుడైన బ్యాటర్‌. రూ.30 లక్షలకు గుజరాత్‌ జెయింట్స్‌ ఆమెను కొనుగోలు చేసింది. ఓపెనింగ్‌లో దూకుడుగా ఆడే మేఘన.. డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్లో అంచనాలను అందుకోలేకపోయింది. 6 మ్యాచ్‌లాడి 81 పరుగులు చేసింది. టీ20లకు అవసరమైన హిట్టింగ్‌ సామర్థ్యం ఉన్నప్పటికీ నిలకడ కొరవడిన మేఘన.. రెండో సీజన్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మారింది. అక్కడ ఆమె ఏమేర రాణిస్తుందో చూడాలి.

సీనియర్‌ సుల్తానా.. రికార్డుల దీప్తి

టీమ్‌ఇండియాకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తెలుగుమ్మాయిల్లో గౌహర్‌ సుల్తానా ఒకరు. ఈ హైదరాబాద్‌ స్పిన్నర్‌.. 50 వన్డేలు, 37 టీ20లు ఆడింది. ఒకప్పుడు ఆమె భారత జట్టులో రెగ్యులర్‌ క్రికెటర్‌. కానీ, తర్వాత చోటు కోల్పోయింది. ఈ మధ్య దేశవాళీల్లో కూడా తక్కువగానే ఆడుతోంది. 35 ఏళ్ల గౌహర్‌.. యూపీకి ఆడుతోంది. తొలి సీజన్లో ఆమెకు అవకాశం దక్కలేదు. ఈసారి తుది జట్టులో స్థానం దక్కితే సత్తా చాటాలని చూస్తోంది. నిరుడు 10 లక్షలతో యూపీ వారియర్స్‌ కొనుగోలు చేసిన యశశ్రీకి ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. అందులో ఒక వికెట్‌ పడగొట్టింది. ఈ హైదరాబాదీ పేసర్‌కు మరో అవకాశం రాలేదు. మంచి వేగంతో బౌలింగ్‌ చేసే యశశ్రీ ఈసారి తనకు తగినన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది.  

2013లో 16 ఏళ్ల వయసులోనే టీ20 మ్యాచ్‌ ఆడి భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది స్నేహ దీప్తి. తర్వాత షెఫాలీ వర్మ ఆమె రికార్డును బద్దలు కొట్టింది. అయితే భారత్‌కు ఆడిన 2 టీ20లు, ఒక వన్డేలో ఆమె సత్తా చాటకపోవడంతో చోటు కోల్పోయింది. డబ్ల్యూపీఎల్‌లో ఈ ఏపీ బ్యాటర్‌ దిల్లీ క్యాపిటల్స్‌ సభ్యురాలు. తొలి సీజన్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఆమెకు.. ఈసారి అవకాశం వస్తుందేమో చూడాలి.

 

ఇంకా మీడియం పేసర్‌ షబ్నం షకిల్‌ (గుజరాత్‌ జెయింట్స్‌), బ్యాటర్‌ త్రిష పూజిత (గుజరాత్‌ జెయింట్స్‌) కూడా లీగ్‌లో అవకాశం లభిస్తే సత్తా చాటాలని చూస్తున్నారు. మరి వీరిలో లీగ్‌ ముగిసేనాటికి ఎంతమంది పేర్లు గట్టిగా వినిపిస్తాయో చూడాలి.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని