T20 World Cup 2024: చివరిసారిగా విజ్ఞప్తి చేస్తున్నా.. నువ్వు వరల్డ్‌ కప్‌లో ఆడు: ఆండ్రి రస్సెల్

క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మెగా టోర్నీ సిద్ధమవుతోంది. దాదాపు 20 దేశాలు కప్ కోసం తలపడే టీ20 ప్రపంచ కప్‌ సందడి వచ్చే నెల నుంచి ఆరంభం కానుంది. 

Updated : 22 May 2024 12:31 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌ ముగిసిన తర్వాత విండీస్-అమెరికా సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) మొదలు కానుంది. ఇప్పటికే ప్రాథమికంగా జట్లను ప్రకటించినప్పటికీ.. ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవడానికి ఈ నెల 25 వరకు సమయం ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అదరగొట్టేస్తున్న విండీస్‌ ఆటగాడు సునీల్‌ నరైన్‌కు ఆ జట్టు స్టార్ ఆటగాడు ఆండ్రి రస్సెల్ చివరిసారిగా ఓ విజ్ఞప్తి చేశాడు. స్వదేశంలో జరగనున్న పొట్టి కప్‌లో ఆడితే బాగుంటుందని కోరాడు. 

‘‘ఐపీఎల్‌లో నరైన్ ప్రదర్శన చూసిన తర్వాతే.. చాలా సంతోషించా. గౌతమ్‌ గంభీర్‌ వచ్చాక మాకు మరింత ఉత్సాహం వచ్చింది. నరైన్‌తో ఇన్నింగ్స్‌ ఓపెనింగ్‌ చేయించాలని పట్టుబట్టాడు. గత సీజన్లలో అతడిని 9 లేదా 10వ స్థానంలో ఆడించాం. అక్కడ అతడి అవసరం పెద్దగా లేదు. ఈసారి ఓపెనర్‌గా తనకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఓ బౌలర్‌ దాదాపు 500 పరుగులు చేయడం సాధారణ విషయం కాదు. ఇటు బౌలింగ్‌లోనూ 16 వికెట్లనూ పడగొట్టాడు. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో కోల్‌కతా ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గంభీర్‌ నిర్ణయం వల్లే అతడికి ప్రమోషన్ లభించింది.

ఈ స్థాయి ఫామ్‌లో ఉన్న నరైన్‌ను టీ20 ప్రపంచ కప్‌లోనూ చూడాలనేది నా కోరిక. గతంలో మా జట్టును ప్రకటించే సమయంలోనూ చాలా చెప్పి చూశా. దాదాపు రెండు వారాలపాటు అతడితో మాట్లాడుతూనే ఉన్నాం. ‘ప్లీజ్‌.. ఈ వరల్డ్‌ కప్‌లో ఆడు. ఆ తర్వాత నువ్వు రిటైర్ అయినా ఫర్వాలేదు. ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు’ అని విజ్ఞప్తి చేశాం. అప్పటికే అతడు ఓ నిర్ణయం తీసేసుకున్నాడు. దానిని మనం గౌరవించాలి. ఒకవేళ ఏదైనా మార్చుకొని ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తే విండీస్‌ మొత్తం ఆనందిస్తుంది’’ అని రస్సెల్ వ్యాఖ్యానించాడు. జూన్ 2 (భారత కాలమానం ప్రకారం) టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని