IPL-2023: గిల్‌, గైక్వాడ్‌లను చూసి.. ఆట తీరు మార్చుకో : పృథ్వీషా ప్రదర్శనపై సెహ్వాగ్‌

ఈ ఐపీఎల్‌(IPL 2023)లో ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శనతో దిల్లీ ఓపెనర్‌ పృథ్వీషా(Prithvi Shaw) విమర్శలనెదుర్కొంటున్నాడు.

Published : 06 Apr 2023 01:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఐపీఎల్‌(IPL-2023)లో దిల్లీ(Delhi Capitals) మరోసారి నిరాశపర్చింది. గుజరాత్‌(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ జట్టు టాప్‌ ఆర్డర్‌ విఫలమవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో అంచనాలు ఉన్న పృథ్వీషా(Prithvi Shaw) పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. దీనిపై మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌(Virender Sehwag) స్పందించాడు. శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill), రుతురాజ్‌ గైక్వాడ్‌(Ruturaj Gaikwad)తో పోల్చుతూ షా ప్రదర్శనపై విమర్శలు గుప్పించాడు.

అండర్‌-19 ప్రపంచకప్‌ తర్వాత పృథ్వీషా ప్రదర్శన తగ్గుతోందని.. అదే టోర్నీలో షా సహచర ఆటగాడైన గిల్‌ అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్నాడని సెహ్వాగ్‌ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నాడు. ‘ఒకే రకమైన షాట్లు ఆడి షా చాలా సార్లు ఔట్‌ అవుతున్నాడు. అయితే.. అతడు తప్పుల నుంచి నేర్చుకోవాలి కదా.. లేదు. శుభ్‌మన్‌ గిల్‌ను చూడండి. షాతో కలిసి అండర్‌ -19 క్రికెట్‌ ఆడాడు. ఇప్పుడు టెస్టు, వన్డేలు, టీ20ల్లో రాణిస్తున్నాడు. కానీ.. షా ఇంకా ఐపీఎల్‌లోనే ఇబ్బంది పడుతున్నాడు. అతడు ఈ ఐపీఎల్‌ను ఉపయోగించుకుని.. ఆటను మెరుగుపరుచుకోవాలి’ అని సెహ్వాగ్‌ అన్నాడు.

ఇక ఈ ఐపీఎల్‌లో ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్న చెన్నై ఆటగాడు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌తో కూడా షాను పోల్చాడు సెహ్వాగ్‌. ‘రుత్‌రాజ్‌ ఓ ఐపీఎల్‌ సీజన్‌లో 600కుపైగా పరుగులు చేశాడు. గిల్‌ కూడా భారీగా పరుగులు చేస్తున్నాడు’ అని షా తన ఆట తీరును పరిశీలన చేసుకోవాలని సెహ్వాగ్‌ సూచించాడు. ఇక లఖ్‌నవూతో ఆడిన తొలి మ్యాచ్‌లో షా 12 పరుగులు చేయగా.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగులు మాత్రమే చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని