IPL 2024 FINAL - Gautam Gambhir: గంభీర్‌ రాకతో.. కేకేఆర్‌ కథ మారిందిలా..

ఈ ఐపీఎల్‌ ఆసాంతం ఛాంపియన్‌గా కనిపించిన జట్టేదయినా ఉంది అంటే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాత్రమే. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, మరోవైపు ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన ఆ జట్టు విజేతగా నిలవడంలో ఆశ్చర్యం లేదు.

Published : 27 May 2024 03:45 IST

ఈ ఐపీఎల్‌ (IPL) ఆసాంతం ఛాంపియన్‌గా కనిపించిన జట్టేదయినా ఉంది అంటే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) మాత్రమే. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, మరోవైపు ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన ఆ జట్టు విజేతగా నిలవడంలో ఆశ్చర్యం లేదు. కానీ టోర్నీ ఆరంభానికి ముందు మాత్రం ఆ జట్టుపై పెద్దగా అంచనాలేమీ లేవు. మరి.. నిరుడు, అంతకుముందు ఏడాది ఏడో స్థానంతో సరిపెట్టుకున్న కోల్‌కతాలో ఈ మార్పెలా? ట్రోఫీ ఎలా ఆ జట్టు సొంతమైంది..!

ఈనాడు క్రీడావిభాగం

అందరూ అంటున్న మాట మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) రాక కోల్‌కతా దశను మార్చేసిందని! నైట్‌రైడర్స్‌తో అతడి అనుబంధం ప్రత్యేకమైంది. ఐపీఎల్‌లో మేటి ఫ్రాంఛైజీల్లో ఒకటిగా కోల్‌కతా కూడా ఉందంటే నిస్సందేహంగా అందుకు ప్రధాన కారణం గంభీరే. కెప్టెన్‌గా 2012, 2014 ఆ జట్టుకు ట్రోఫీలను అందించిన గంభీర్‌.. ఈసారి మెంటార్‌గానూ టైటిల్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. మంచి క్రికెటింగ్‌ బుర్ర అతడి సొంతం. నరైన్‌ను ఓపెనర్‌గా పంపాలని అతడు తీసుకున్న నిర్ణయం కోల్‌కతాకు అద్భుత ఫలితాలనిచ్చింది. నరైన్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో ఆ జట్టు ఫైనల్‌ చేరడంలో ముఖ్య భూమికను నిర్వర్తించాడు. వేలంలో అతడు స్టార్క్‌ను ఎంచుకోవడం కూడా చక్కని ఫలితాన్నిచ్చింది. మరోవైపు జట్టులో ఆటగాళ్లందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చిన గంభీర్‌.. ఎవరూ అభద్రతాభావానికి గురికాకుండా చూశాడు. ఆటగాళ్లు ఒకరినొకరు విశ్వసించే వాతావరణాన్ని కల్పించిన అతడు.. మైదానం లోపల, బయట వాళ్ల మధ్య బంధం పెరిగేలా చేశాడు. అదే ఆ జట్టు విజయంలో కీలకమైంది. గంభీర్‌ మార్గనిర్దేశనంలో నైట్‌రైడర్స్‌ నిర్భయంగా ఆడింది. గంభీర్‌ వ్యూహాలు టోర్నీ ఆసాంతం జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయని కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చెప్పాడు.


నరైన్‌ షో..

రైన్‌ (Sunil Narine) లేని కోల్‌కతాను ఊహించలేం. ఈ సీజన్‌లో అంత గొప్పగా ఆడాడతడు. బ్యాటుతో, బంతితో అతడి పాత్ర అమూల్యం. ముఖ్యంగా ఓపెనర్‌గా వచ్చి ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదిరే ఆరంభాలనిచ్చిన నరైన్‌.. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి  బ్యాటర్లను కట్టిపడేశాడు. 15 మ్యాచ్‌ల్లో 180.74 స్ట్రైక్‌రేట్‌తో 488 పరుగులతో కోల్‌కతా టాప్‌ స్కోరర్‌గా నిలిచిన అతడు.. 6.69 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. సాల్ట్‌ (12 మ్యాచ్‌ల్లో 435) జోడీగా జట్టుకు భారీ స్కోర్లను అందించిన నరైన్‌.. బౌలింగ్‌లో వరుణ్‌ (21 వికెట్లు)తో కలిసి ప్రత్యర్థులను దెబ్బతీశాడు.

నిలకడగా..: కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపిన అత్యంత కీలకాంశం నిలకడ. టోర్నీ ఆసాంతం ఆ జట్టు నిలకడను ప్రదర్శించింది. కేవలం మూడు ఓటములతో లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిందంటే ఆ జట్టు ఎలా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌.. కోల్‌కతా ఈ సీజన్‌లో ఇలా అన్ని విభాగాల్లోనూ విశేషంగా రాణించింది. ఏ ఒక్క వ్యక్తి మీదో, ఏ ఒక్క విభాగం మీదో అతిగా ఆధారపడలేదు. బంతితో వరుణ్‌ చక్రవర్తి, నరైన్, హర్షిత్‌ రాణా (19 వికెట్లు) గొప్ప పదర్శన చేశారు.భారీ ధరకు న్యాయం చేయట్లేదంటూ మొదట్లో విమర్శలు ఎదుర్కొన్న స్టార్క్‌ (17 వికెట్లు).. ఆలస్యంగానైనా పుంజుకుని ఫైనల్‌ సహా కీలక మ్యాచ్‌ల్లో గొప్పగా బౌలింగ్‌ చేశాడు. ఇక బ్యాటుతో నరైన్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ (351), వెంకటేశ్‌ అయ్యర్‌ (370) జట్టుకు విలువైన పరుగులను అందించారు.


శ్రేయస్‌ కెప్టెన్సీ.. 

శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) సమర్థ నాయకుడు అనడంలో సందేహం రాలేదు. కాకపోతే కెప్టెన్‌గా అతడికి రావాల్సినంత పేరు రాలేదు. గాయం కారణంగా నిరుడు ఐపీఎల్‌కు దూరమైన అతడు.. ఈసారి జట్టును ప్రశాంతంగా నడిపించాడు. మైదానంలో అతడు జట్టును నడిపించిన తీరును పలువురు వ్యాఖ్యాతలు, మాజీ ఆటగాళ్లు మెచ్చుకున్నారు. ‘‘మనమెప్పుడూ గంభీర్‌ గురించే మాట్లాడుతున్నాం. కానీ అతడు మైదానంలోకి అడుగుపెట్టలేడు కదా. ఆటగాళ్లతో ఉండేది శ్రేయస్‌. ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎదగడానికి కెప్టెన్సీ అతడికి ఉపయోగపడుతుంది. శ్రేయస్‌కు మంచి భవిష్యత్తుంది’’ అని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని