RCB: అమ్మాయిలు గెలిచారు.. ఇక వారి వంతు.. ఐపీఎల్‌లో ఏం చేస్తారో?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ ఏడాది శుభారంభం చేసింది. మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL) విజేతగా నిలిచి అదరగొట్టేసింది.

Published : 18 Mar 2024 14:39 IST

రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్‌ను తమ అభిమాన జట్టు సొంతం చేసుకుంటుందనే నమ్మకం పెరిగింది. దానిక్కారణం.. మహిళల జట్టే. డబ్ల్యూపీఎల్‌ (WPL) రెండో ఎడిషన్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడా స్ఫూర్తితో ఐపీఎల్‌లోనూ పురుషుల టీమ్‌ చెలరేగిపోవాలనేది ఫ్యాన్స్‌ ఆకాంక్ష.

ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL) 16 సీజన్లను పూర్తి చేసుకుంది. మరో నాలుగు రోజుల్లో 17వ ఎడిషన్‌ ప్రారంభం కానుంది. ఒక్కసారి కూడా ఆర్సీబీ (RCB) విజేతగా నిలవలేదు. స్టార్‌ క్రికెటర్లు బరిలోకి దిగినప్పటికీ.. ఫైనల్‌ వరకూ వెళ్లినా టైటిల్‌ను సొంతం చేసుకోలేకపోయింది. మూడుసార్లు ఫైనల్‌కు వెళ్లి బోల్తా పడింది. గతేడాది మినహా అంతకుముందు వరుసగా మూడేళ్లపాటు ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఆర్సీబీ టైటిల్‌ విజేత మాత్రం కాలేకపోయింది.  ఈసారి తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో తలపడనుంది. బెంగళూరు జట్టులో టాలెంట్‌కు కొదవేం లేదు. ప్రపంచస్థాయి బ్యాటర్లు, బౌలర్లు ఉన్న ఆ జట్టు భారీ లీగ్‌లో కీలక సమయాల్లో మాత్రం తేలిపోయి  డీలా పడుతోంది. 

గత చరిత్ర ఇలా.. 

ఐపీఎల్‌ తొలి సీజన్‌లో (2008) లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన బెంగళూరు.. రెండో ఎడిషన్‌లో అనూహ్యంగా పుంజుకుంది. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. మరో రెండేళ్ల తర్వాత (2011)  పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించి మరీ టైటిల్‌ రేసులోకి దూసుకెళ్లింది. కానీ, అక్కడా ఘోర పరాభవం ఎదురైంది. సీఎస్కే నిర్దేశించిన 206 పరుగుల లక్ష్య ఛేదనలో 147 పరుగులకే పరిమితమైంది. ఇక 2016 ఎడిషన్.. స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సంవత్సరం. ఆ సీజన్‌లో ఏకంగా 973 పరుగులు చేసి అదరగొట్టాడు. సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి ఎదురైంది. కేవలం 8 పరుగుల తేడాతో టైటిల్‌ను చేజార్చుకుంది. 

జట్టులో స్టార్‌ లైనప్..

బెంగళూరు జట్టులో ప్రధాన ఆకర్షణ విరాట్ కోహ్లీ (Virat Kohli). వ్యక్తిగత కారణాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ఇచ్చిన కోహ్లీ.. ఇప్పుడీ లీగ్‌ కోసం వచ్చేశాడు. గ్యాప్‌ తీసుకొని వచ్చాక అతడిని ఆపడం కష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాజీలు కూడా ఇదే మాట చెబుతుంటారు. దానికి నిదర్శనం గత వన్డే ప్రపంచకప్‌. అంతకుముందు ఫామ్‌తో ఇబ్బంది పడి క్రికెట్‌కు దూరంగా ఉండి మరీ మెగా టోర్నీలో ఆడాడు. టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈసారి కూడా అదేస్థాయిలో ఆటతీరు ఉండనుంది. ఐపీఎల్‌ తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌ జరగనుంది. ఇందులో వీరబాదుడు బాదితే పొట్టి కప్‌లో చోటు ఖాయమనే వాదనా ఉంది. ఇక కోహ్లీ తర్వాత స్టార్‌ అట్రాక్షన్ కెప్టెన్ ఫాప్‌ డుప్లెసిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్. ఇటీవలే ముంబయి నుంచి భారీ మొత్తం వెచ్చించి మరీ గ్రీన్‌ను ఆర్సీబీ తీసుకుంది. మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడటంతోపాటు బౌలింగ్‌లో కీలకమమవుతాడని మేనేజ్‌మెంట్ ఆశలు పెట్టుకుంది. సిరాజ్, అల్జారీ జోసెఫ్‌, లాకీ ఫెర్గూసన్, ఆకాశ్‌దీప్‌, టోప్లేతో పేస్‌ దళం బలంగా ఉంది. ప్రస్తుతం ఉన్న టాప్‌ స్పెషలిస్ట్‌ స్పిన్నర్లు ఎవరూ ఆ జట్టులో లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. మ్యాక్సీతోపాటు కర్ణ్‌శర్మ ఆ బాధ్యతలను చేపట్టే అవకాశం లేకపోలేదు.   

ఫ్యాన్‌ బేస్‌ అదుర్స్‌.. 

‘ఈసాలా కప్ నమదే’ (ఈసారి కప్ మనదే) నినాదంతో ప్రతీ సీజన్‌లో  జట్టును ఉత్సాహపరిచే అభిమానులు బెంగళూరు సొంతం. ఆర్సీబీకి ట్విటర్‌లో 7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో 12.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌ (14.1 మిలియన్లు) తర్వాత అత్యధిక మంది అనుసరించే జట్టు ఆర్సీబీనే. మరి అలాంటి ఫ్యాన్‌ బేస్‌ కోసం మహిళల జట్టు ఓ కప్‌ను అందించింది. డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌ సందర్భంగా ఆర్సీబీని ప్రోత్సహించడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడం విశేషం. ఐపీఎల్‌లోనూ ఆ వెలితిని తీర్చేయాలనేదే హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ కోరుకొనేది.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని