Afghanistan Cricket: మొదట ఇంగ్లాండ్‌... ఇప్పుడు పాక్‌... అఫ్గానిస్థాన్‌ కసి వెనుక కన్నీళ్లు!

డిఫెండింగ్‌ ఛాంపియన్, ఈ ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ (England)ను, మేటి జట్టుగా పేరుగాంచిన పాకిస్థాన్‌ను ఓడించి సంచలనం రేపింది అఫ్గానిస్థాన్‌ (Afghanistan). 

Updated : 24 Oct 2023 04:24 IST

డిఫెండింగ్‌ ఛాంపియన్, ఈ ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ (England)ను ఓడించి పెను సంచలనమే రేపింది అఫ్గానిస్థాన్‌ (Afghanistan). ఆ విజయం ప్రకంపనలు ఇంకా వినిపిస్తుండగానే మరో సంచలనం సృష్టించింది. ఈసారి అఫ్గాన్‌ వీరుల దెబ్బకు పాకిస్థాన్‌ కుదేలైంది. ఎంతో కసి ఉంటే కానీ... ఇలాంటి విజయాలు రావు. అయితే ఆ కసి వెనుక ఉన్న కన్నీళ్ల కథ తెలిస్తే ఇంతటి గుండె నిబ్బరం ఎలా అని అనిపించకమానదు.

అఫ్గానిస్థాన్‌ జట్టు ప్రపంచకప్‌లో ఒకటో రెండో విజయాలు సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు కానీ.. మరీ ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ లాంటి జట్లను సులువుగా ఓడించేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కొన్నేళ్లుగా అఫ్గాన్‌ జట్టును అనుసరిస్తున్న వాళ్లకు, ఈ ప్రపంచకప్‌లో వారి ప్రదర్శన చూస్తే... ఇవేవో గాలివాటం విజయాల్లా కనిపించవు. అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు ఏ స్థితిలో ప్రపంచకప్‌లో అడుగు పెట్టారో తెలిస్తే.. వాళ్ల దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే వారు సాధించిన విజయాలు ఇంకా గొప్పగా అనిపించి, ఆ జట్టు మీద అభిమానం పెరుగుతుంది.

కొన్ని రోజుల క్రితం సంభవించిన భూకంపం అఫ్గానిస్థాన్‌ను కుదిపేసింది. ఈ ఉత్పాతం ధాటికి అక్కడ ఏకంగా 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అసలే రెండేళ్ల కిందట తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాక అఫ్గానిస్థాన్‌ పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా ఆ దేశం చితికిపోయింది. అమెరికా సహా అన్ని దేశాల నుంచి అఫ్గాన్‌కు ఆర్థిక సాయం ఆగిపోయింది. దీనికి తోడు ఇప్పుడు భూకంపం తీవ్రంగా నష్టం కలిగించింది. అఫ్గాన్‌ తాలిబన్ల చేతికి వెళ్లాక ఆ దేశ క్రికెటర్లు ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. ఎవరికి వారు అన్నట్లు ఉండే ఆటగాళ్లు.. జాతీయ జట్టు తరఫున ఏదైనా సిరీస్, టోర్నీ ఆడాల్సినపుడు మాత్రమే ఒక చోటికి చేరుతున్నారు. ఇలాంటి ఆటగాళ్లలో జట్టు భావన తీసుకురావడం చిన్న విషయం కాదు. కానీ ఎప్పుడు ఆడినా సమష్టిగానే సత్తా చాటుతారు అఫ్గాన్‌ ఆటగాళ్లు. 

మిగతా సమయాల్లో వాళ్లందరూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో టీ20, టీ20 లీగ్స్‌ ఆడుతుంటారు. వాళ్ల కుటుంబాలు కూడా దుబాయ్‌ లాంటి చోట్ల స్థిరపడ్డాయి. కానీ బంధువులు, సన్నిహితులు మాత్రం అఫ్గానిస్థాన్‌లో ఉంటున్నారు. ఇప్పటికే దుర్భర స్థితిలో ఉన్న తమ దేశం భూకంపంతో నష్టపోతే అఫ్గాన్‌ ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భూకంప బాధితుల్లో వారికి తెలిసిన వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఆ జట్టు ప్రపంచకప్‌లో అడుగు పెట్టింది. బాధను అణచుకుని దిల్లీలో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ లాంటి మేటి జట్టును ఓడించింది. ఆ మ్యాచ్‌ అయ్యాక అఫ్గాన్‌ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ.. ఈ విజయాన్ని తమ దేశ భూకంప బాధితులకు అంకితమిచ్చారు. తమ దేశ ప్రజలు నవ్వడం మరిచిపోయారని.. ఈ విజయం వారి ముఖాల్లో కొంచెం చిరునవ్వును తీసుకొస్తుందని ఆశిస్తున్నామని రషీద్‌ ఖాన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

భారత్‌ అండతో..

గత దశాబ్ద కాలంలో అఫ్గానిస్థాన్‌ ప్రపంచ క్రికెట్లో ఎంత వేగంగా ఎదుగుతోందో తెలిసిందే. ఒక స్థాయి ఉన్న జట్లను ఓడించడం ఎప్పట్నుంచో అలవాటుగా మార్చుకుంది. అయితే మిగతా జట్లలా అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లకు తమ దేశంలో ఉత్తమ క్రికెట్‌ సౌకర్యాలేమీ లేవు. కొన్నేళ్ల ముందు వరకు ఆ దేశంలో క్రికెట్‌ స్టేడియమే లేదు. దశాబ్దాల క్రికెట్‌ సంస్కృతి లేకపోయినా.. గొప్ప సౌకర్యాలు లేకపోయినా.. సహజ ప్రతిభకు మెరుగులు దిద్దుకుని ఆ దేశ ఆటగాళ్లు ప్రపంచ స్థాయికి ఎదిగారు. టీ20 లీగ్స్‌ వారికి బాగా కలిసొచ్చాయి. నబి, రషీద్‌ ఖాన్, ముజీబ్‌ రెహ్మాన్, గుర్బాజ్, ఫారూఖీ, నవీనుల్‌ హక్‌ లాంటి ప్రతిభావంతులు ఆ దేశానికి ప్రపంచ క్రికెట్లో ఒక స్థాయిని తీసుకొచ్చారు.

ఎదుగుతున్న దశలో అఫ్గాన్‌కు భారత్‌ అండగా నిలిచింది. ఆ దేశంలో స్టేడియం నిర్మించడమే కాక.. మరికొన్ని క్రికెట్‌ సౌకర్యాలు సమకూర్చింది. అఫ్గాన్‌ తమ సొంతగడ్డపై ఆడాల్సిన సిరీస్‌లు కొన్నింటికి భారత్‌నే వేదికగా మార్చింది. ఆ దేశ ఆటగాళ్లు ఇక్కడి క్రికెట్‌ సౌకర్యాలను ఉపయోగించుకునే సౌలభ్యం కల్పించింది. అంతే కాక లాల్‌సింగ్‌ రాజ్‌పుత్, మనోజ్‌ ప్రభాకర్‌ గతంలో అఫ్గాన్‌కు కోచ్‌లుగా పని చేశారు. ప్రస్తుతం భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ అజయ్‌ జడేజా అఫ్గానిస్థాన్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ఇలా అఫ్గాన్‌ ఎదుగుదలలో భారత్‌ పాత్ర ఎంతో కీలకం.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని