KL Rahul - Shreyas: ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కకపోతే.. వరల్డ్‌ కప్‌లోనూ కష్టమే!

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆసియా కప్‌తోపాటు వన్డే ప్రపంచకప్ (ODi World Cup 2023) బరిలోకి దిగే జట్ల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అయితే, ఇద్దరు కీలక ఆటగాళ్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఈ వారంలో వారి ఫిట్‌నెస్‌పై ఓ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Published : 12 Aug 2023 13:02 IST

స్వదేశంలో మెగా టోర్నీ.. పదేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంత చేసుకోవాలనే పట్టుదల.. ఇదంతా నాణేనికి ఒక వైపు. 

ఓపెనర్లు ఎవరు? మిడిలార్డర్‌లో కాచుకొనే  ఆటగాళ్లు ఎవరు? మరీ కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే బ్యాటర్‌ ఎవరు? గాయాల నుంచి కోలుకొనేదెవరు? ఇదీ నాణేనికి మరోవైపు టీమ్‌ఇండియా పరిస్థితి. 

ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు.. స్పందించిన విరాట్ కోహ్లీ

వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురిపైనే ఇప్పుడందరి దృష్టి.. వారు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా. అయితే, ఇందులో బుమ్రాను ఐర్లాండ్‌ పర్యటనకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అక్కడ ఫామ్‌లోకి వస్తే భారత్‌ పేస్‌ బౌలింగ్‌ బలంగా మారనుంది. కానీ, కేఎల్ రాహుల్‌తోపాటు శ్రేయస్‌ అయ్యర్‌ గాయాల పరిస్థితిపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఈ వారంలోనే ఆసియా కప్‌ కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.  ఆగస్ట్‌ 18వ తేదీన గాయపడిన వారికి ఫిట్‌నెస్‌ టెస్టు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందులో పాసైతేనే ఆసియా కప్‌ కోసం ప్రకటించే జట్టులో స్థానం దక్కనుంది. ఒకవేళ విఫలమై విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే మాత్రం వరల్డ్‌ కప్‌ ఆడటం కూడా అనుమానమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

రానున్న రెండు రోజుల్లో...? 

ఆసియా కప్‌ స్క్వాడ్‌కు సంబంధించి చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగర్కార్‌ వచ్చే రెండు రోజుల్లో మిగతా సెలెక్టర్లతో చర్చలు జరిపే అవకాశం ఉంది. విండీస్‌ నుంచి భారత జట్టు మిగతా రెండు టీ20ల కోసం అమెరికా వెళ్లగా.. అజిత్‌ అగార్కర్‌ మాత్రం స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఐర్లాండ్‌తో భారత్‌ మూడు టీ20ల సిరీస్‌ను ఆగస్ట్ 18 నుంచి ఆడనుంది. బుమ్రాతోపాటు యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా ఫామ్‌ను నిరూపించుకుంటే వారిద్దరు ఆసియా కప్‌లో ఆడటం ఖరారు కానుంది. ఇక కేఎల్ రాహుల్, శ్రేయస్‌ పరిస్థితిపై అంచనాకు రావాలంటే ఎన్‌సీఏలో ఉంటూనే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను ఆడి ఆగస్ట్ 18న జరగనున్న ఫిట్‌నెస్‌ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. కేఎల్ రాహుల్‌ ఫిట్‌నెస్ విషయంలో పెద్దగా ఇబ్బందులు లేవు..  కానీ శ్రేయస్‌ అయ్యర్ మాత్రం వెన్ను నొప్పికి శస్త్రచికిత్స చేయించుకుని రావడంతో సందిగ్ధత నెలకొంది. పూర్తిగా కోలుకున్నట్లుగా అనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి అయితే, అయ్యర్ వస్తే మాత్రం నాలుగో స్థానంలో బరిలోకి దిగడం వల్ల జట్టుకు నిలకడ వస్తుందని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. 

వీరిద్దరు లేకపోతే.. నాలుగో స్థానం ఎవరిది? 

కేఎల్ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్ ఫిట్‌నెస్‌తోపాటు ఫామ్‌ అందిపుచ్చుకుంటే భారత్‌కు ‘నంబర్ 4’ కష్టాలు తీరతాయి. ఒకవేళ వారిద్దరు లేకపోతే మాత్రం ఎలా? అనే ప్రశ్న తలెత్తడం సహజం. కెప్టెన్ రోహిత్ శర్మ ‘యువీ తర్వాత నాలుగో స్థానంలో స్థిరంగా ఎవరూ రాణించలేకపోయారు’ అని చెప్పిన సంగతి తెలిసిందే. చాలాకాలంపాటు శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో స్థానంలో ఆడాడు. మంచి ఇన్నింగ్స్‌లు అందించాడు. ఒకవేళ అతడు లేకపోతే మాత్రం ఆ స్థానంలో సంజూ శాంసన్‌ లేదా సూర్యకుమార్‌తోపాటు యువ బ్యాటర్ తిలక్‌ వర్మ రేసులో నిలిచారు. ఇషాన్ కిషన్‌ ఉన్నప్పటికీ అతడు ఎక్కువగా ఓపెనర్‌గానే రాణించాడు. నాలుగో స్థానంలో ఉత్తమ గణాంకాలు లేవు. కాబట్టి, ఇలాంటి తలనొప్పుల నుంచి భారత్‌కు విముక్తి లభించాలంటే శ్రేయస్‌, కేఎల్‌ తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకొని ఫామ్‌లోకి రావాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. 

-ఇంటర్నెట్ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని