Asia Cup 2023: మా ఆందోళనంతా పాండ్య ఫామ్‌పైనే.. కేఎల్ కోసం వెంకటేశ్‌ ప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలు!

ఆసియా కప్ (Asia Cup 2023) కోసం ఎంపికైన సీనియర్లు కేఎల్ రాహుల్, హార్దిక్‌ పాండ్య ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పాండ్య ఫామ్‌పైనా, కేఎల్ రాణించాలని మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Published : 23 Aug 2023 16:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ (Asia Cup 2023) కోసం ప్రకటించిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) డిప్యూటీగా హార్దిక్‌ పాండ్యను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో అతడి కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చినా బీసీసీఐ మద్దతుగా నిలిచింది. బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదనింపించాడు. బ్యాటింగ్‌లో మాత్రం మునుపటి ఫామ్‌ను కొనసాగించకలేకపోయాడు. మినీ, మెగా టోర్నీల్లో పాండ్య  (Hardik Pandya) కీలకమవుతాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో భారత (Team India) మాజీ ఆటగాడు మదన్ లాల్ మాత్రం హార్దిక్‌ ఫామ్‌ ఆందోళనకు గురి చేసేలా ఉందని వ్యాఖ్యానించాడు. 

రెండింట్లో విఫలమైనా తిలక్‌ రెడీనే.. మహిళలకూ సమాన పారితోషికం.. బాబర్‌ చెత్త రికార్డు

‘‘హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) తప్పకుండా తర్వాతి కెప్టెన్‌ అవతాడనంలో అనుమానం లేదు. ఇప్పటికే అతడు టీ20ల్లో జట్టును నడిపిస్తున్నాడు. అయితే.. కెప్టెన్సీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, అతడి ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. అద్భుతమైన ఆటగాడు. అయితే, గతంలో ఆసీస్‌పై చేసిన 92 పరుగుల ఇన్నింగ్స్‌ మళ్లీ చూడలేకపోయాం. అలాంటి ఫామ్‌లోకి హార్దిక్‌ పాండ్య రావాలి. ఆసియా కప్, వరల్డ్‌ కప్‌లో బౌలింగ్‌లోనూ కీలక పాత్ర పోషిస్తాడు. అతడు బౌలింగ్‌ చేసిన తీరుపట్ల సంతోషంగా ఉంది. ఆరో బౌలర్‌గా పాండ్య అక్కరకొస్తాడు. బీసీసీఐ కూడా అతడికి ఇలాంటి కీలకమైన బాధ్యతలు అప్పగించింది’’ అని తెలిపాడు.


అప్పుడు విమర్శలు.. ఇప్పుడు ప్రార్థనలు

కొంతకాలం కిందట భారత ఆటగాడు కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్.. తాజాగా ఆసియా కప్‌ కోసం ఎంపికైన రాహుల్‌ కోసం ప్రత్యేకంగా ప్రార్థించాడట. సినీ నటుడు సునీల్ శెట్టితో కలిసి న్యూ జెర్సీలోని స్వామి నారాయణ ఆలయానికి వెంకటేశ్ ప్రసాద్ వెళ్లాడు. దీనిపై ట్విటర్ వేదికగా ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు. ‘‘న్యూజెర్సీలోని స్వామి నారాయణ్ ఆలయాన్ని అన్న (సునీల్ శెట్టి)తో కలిసి సందర్శించా. భారతీయులంతా బాగుండాలని.. వరల్డ్‌ కప్‌లో టీమ్‌ఇండియా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ప్రార్థించాం. అలాగే కేఎల్‌ రాహుల్‌ కూడా మెగా టోర్నీల్లో రాణించాలని ప్రార్థనలు చేశా. నా లాంటి విమర్శకుల నోళ్లు మూయించేలా ఆడాలి. అందరూ సంతోషంగా ఉండండి’’ అంటూ వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని