NZ vs AUS: ఆసీస్‌ చేతిలో కివీస్‌ ఘోర ఓటమి.. అగ్రస్థానానికి చేరిన భారత్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టిక అప్‌డేట్‌ అయింది. భారత్‌ మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. దానికి కారణం న్యూజిలాండ్‌ ఓడిపోవడమే..  

Published : 03 Mar 2024 10:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ (NZ vs AUS) ఓడిపోవడం భారత్‌కు కలిసొచ్చింది. అదేంటి ఆ జట్టు ఓడిపోతే మనకు కలిగిన లాభమేంటనేగా? మీ సందేహం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చి లోగా టాప్ -2 జట్లు ఫైనల్‌లో తలపడతాయి. ఇప్పటికే రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా హ్యాట్రిక్‌పై కన్నేసింది. అయితే, న్యూజిలాండ్‌ నిన్నటి వరకు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్‌ కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు ఆసీస్‌ చేతిలో పరాజయం పాలైన కివీస్‌ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 64.58 విజయాల శాతంతో టాప్‌లో నిలవగా.. న్యూజిలాండ్‌ 60 శాతం, ఆస్ట్రేలియా 59.09 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 

ఇంగ్లాండ్‌తో భారత్‌ మార్చి 7 నుంచి చివరి టెస్టు ఆడనుంది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా అందులోనూ గెలిస్తే పర్సంటేజీ మరింత మెరుగై అగ్రస్థానం నిలబడుతుంది. ఓడితే మళ్లీ మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మార్చి 8 నుంచి ఆసీస్-కివీస్‌ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత నుంచి దాదాపు మూడు నెలలపాటు టెస్టులను ఈ నాలుగు జట్లూ ఆడవు. 

తేలిపోయిన కివీస్‌.. 

కొండంత లక్ష్యం. ఓవర్‌ నైట్‌ స్కోరు 111/3 స్కోరుతో పోరాడుతున్నట్లే కనిపించిన కివీస్‌. కానీ, నాలుగో రోజు ఆటలో నాథన్ లైయన్ (6/65) దెబ్బకు  కుదేలైంది. ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 85 పరుగులను మాత్రమే జోడించి చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. ఆసీస్‌ నిర్దేశించిన 369 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్‌ 196 పరుగులకే ఆలౌటైంది. దీంతో 172 పరుగుల తేడాతో ఆసీస్‌ విజయం సాధించింది. రచిన్‌ రవీంద్ర (59) నిన్నటి స్కోరుకు మరో మూడు పరుగులు మాత్రమే జోడించాడు. డారిల్ మిచెల్ (38), స్కాట్ కుగ్గెలిజిన్‌ (26) కాసేపు పోరాడారు. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూల జట్టు 383 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 179 రన్స్‌కే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆసీస్‌ ఆలౌటైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని