Wrestlers: దుబాయ్‌ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్‌.. ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ మిస్‌

Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్‌ పునియా, సుజీత్‌..  ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు.

Published : 19 Apr 2024 12:53 IST

బిష్కెక్‌: పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics)కు అర్హత సాధించేందుకు చమటోడుస్తోన్న ప్రముఖ రెజ్లర్లు దీపక్‌ పునియా (Deepak Punia), సుజీత్‌ కలాకల్‌ (Sujeet Kalakal)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌లో ప్రారంభమైన ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ (Asia Olympic Qualifiers)కు వీరిద్దరూ దూరమయ్యారు. భారీ వర్షాల కారణంగా దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకున్న వీరు సరైన సమయానికి వేదిక వద్దకు చేరుకోలేదు. దీంతో పోటీలకు వారిని అనుమతించలేదు.

దీపక్‌, సుజీత్‌ ఇటీవల రష్యాలో శిక్షణ తీసుకున్నారు. అది ముగించుకుని దుబాయ్‌ మీదుగా బిష్కెక్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఏప్రిల్‌ 16న రష్యా నుంచి అక్కడకు చేరుకున్నారు. అయితే, ఇటీవల అక్కడ కురిసిన భారీ వర్షాలతో దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో నీరు చేరి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గత మంగళవారం నుంచి వీరు ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. చివరకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విమానం దొరకడంతో శుక్రవారం తెల్లవారుజామున కిర్గిస్థాన్‌ చేరుకున్నారు.

అంపైర్‌గా పని చేసి.. ఐపీఎల్‌లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్‌ కథ ఇది!

అయితే, విమానం ఆలస్యం కారణంగా వీరిద్దరూ షెడ్యూల్‌ సయమానికి క్వాలిఫయర్స్‌ వేదిక వద్దకు చేరుకోలేదు. నిబంధనల ప్రకారం ముందు బరువు పరీక్షించిన తర్వాత పోటీలు నిర్వహిస్తారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు బరువు పరీక్షలు నిర్వహించారు. ఆ సమయానికి వీరు అక్కడకు వెళ్లలేకపోయారు. దీపక్‌, సుజీత్‌ పరిస్థితిని మన దేశ కోచ్‌లు, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌.. ప్రపంచ రెజ్లింగ్‌ సమాఖ్య ప్రతినిధులకు వివరించారు. అదనపు సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకోసం నిర్వాహకులు డెడ్‌లైన్‌ తర్వాత 10 నిమిషాలు ఎదురుచూసినా రాకపోవడంతో ఈ రెజ్లర్లను పోటీలకు అనుమతించలేదు. దీంతో ఈ క్వాలిఫయర్స్‌కు వారు దూరమయ్యారు.

ఇక పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు వీరికి ఒకే ఒక్క అవకాశం మిగిలి ఉంది. ఈ ఏడాది మేలో తుర్కియేలో జరిగే ప్రపంచ క్వాలిఫయర్స్‌లో వీరు పాల్గొని కోటా సాధించాలి. దీపక్‌ పునియా టోక్యో ఒలింపిక్స్‌లో 86 కేజీల విభాగంలో పతకం సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈసారి పారిస్‌లోనైనా పతకం దక్కించుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని