Yash Dayal: అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్‌ దయాళ్‌

ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్‌లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్‌ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

Published : 19 May 2024 14:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా బ్యాటర్ రింకు సింగ్‌ బీభత్సానికి ఓ బౌలర్‌ బలైన సంగతి అందరికీ గుర్తుంది కదా.. అతడే యశ్‌ దయాళ్. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు ఇవ్వడంతో కొన్నాళ్లు మానసికంగా కుంగిపోయాడు. గత మినీ వేలం సందర్భంగా అతడిని ఎవరూ తీసుకోరని అంతా భావించారు. కానీ, బెంగళూరు ముందుకొచ్చి మంచి ధరనే వెచ్చించి కొనుగోలు చేసుకుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున 13 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. మరీ ముఖ్యంగా ప్లేఆఫ్స్‌కు కీలకమైన చెన్నైతో మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసి డేంజరస్ బ్యాటర్ ధోనీని ఔట్ చేసి హీరోగా మారిపోయాడు. ఈ మ్యాచ్‌ అనంతరం సిరాజ్‌తో యశ్‌ మాట్లాడుతూ.. చివరి ఓవర్ వేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా స్కోరు బోర్డు వైపు చూడలేదని తెలిపాడు.

‘‘నేను చివరి ఓవర్‌ వేయడం ఎప్పటికీ మరిచిపోలేను. మేం ప్లేఆఫ్స్‌కు చేరాలంటే అత్యంత కీలకమైన ఓవర్. తొలి బంతికే ధోనీ సిక్స్‌ కొట్టేశాడు. ఆ తర్వాత బాల్‌కే అతడిని ఔట్ చేయగలిగా. ఇదే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్. మ్యాచ్‌ మొత్తం ఒక ఎత్తు.. ఆ చివరి ఓవర్‌ మరొకెత్తు. ఆ సమయంలో నా మదిలో ఒకే ఒక్క ఆలోచన మెదిలింది. సరైన లెంగ్త్‌ డెలివరీని మాత్రమే సంధించాలని అనుకున్నా. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు వైపు చూడలేదు. మంచిగా బౌలింగ్‌ చేయడంపైనే దృష్టిపెట్టా. విరాట్ కోహ్లీ ఇచ్చిన సూచనలూ అక్కరకొచ్చాయి. స్లో డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నా. ఆ ఆత్మవిశ్వాసమే నన్ను చివరి ఓవర్‌లో ముందుకు నడిపించింది’’ అని యశ్‌ తెలిపాడు. 

మేనేజ్‌మెంట్ మద్దతుతో.. 

గతేడాది గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించిన యశ్‌.. రింకు దెబ్బకు ఒక్కసారిగా కుదేలయ్యాడు. ఇప్పుడు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఇచ్చిన మద్దతుతో రాణిస్తున్నానని వెల్లడించాడు. ‘‘ఆర్సీబీ జట్టులోకి రావడం చాలా ఉపయోగకరంగా మారింది. టీమ్‌కు నేనెంత కీలక ప్లేయర్‌గా చెబుతూ ఎప్పటికప్పుడు సపోర్ట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ ఫలితాలను సాధించడం మరింత ఆనందంగా ఉంది. ఫాఫ్‌ డుప్లెసిస్‌ మా కుర్రాళ్లకు చాలా స్వేచ్ఛ ఇస్తాడు. అతడూ గొప్ప అథ్లెట్‌. ఎప్పుడూ పాజిటివ్‌ వైబ్స్ అందిస్తాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. వీరిద్దరి వల్ల యువ క్రికెటర్లు ఎవరూ ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు’’ అని ఆర్సీబీ బౌలర్ పేర్కొన్నాడు.

రింకు స్పెషల్ పోస్టు.. 

రింకు సింగ్‌ తనకు స్నేహితుడి కంటే ఎక్కువని.. ఒక సోదరుడిలాంటివాడని గతంలోనే యశ్‌ వ్యాఖ్యానించాడు. తాజాగా చెన్నైపై ఉత్తమ ప్రదర్శన చేయడంతో యశ్‌ను అభినందిస్తూ.. ‘ఇదంతా దేవుడి ప్లాన్‌ బేబీ’ అంటూ రింకు పోస్టు చేయడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని