Yashasvi Jaiswal: అవేవీ పట్టించుకోను.. మైదానంలో ఏం చేయాలనుకుంటే అదే చేస్తా: యశస్వి

దూకుడుగా ఆడటం తామే నేర్పినట్లు వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్‌ క్రికెటర్ బెన్ డకెట్‌పై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, భారత యువ క్రికెటర్ మాత్రం వాటిపై స్పందించిన తీరు అద్భుతం.

Updated : 14 Mar 2024 14:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో (IND vs ENG) ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడికే ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇంగ్లిష్‌ జట్టు పాటించే బజ్‌బాల్ క్రికెట్‌తో ఆటాడుకున్న యశస్వి బ్యాటింగ్‌పై బెన్ డకెట్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. తమ జట్టు వల్లే భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడటం నేర్చుకున్నారని.. అందుకు సగం క్రెడిట్‌ తమకు ఇవ్వాలని డకెట్‌ వ్యాఖ్యానించాడు. దీనిపై భారత, ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్లు కొందరు విమర్శలు గుప్పించారు. తాజాగా ఇదే అంశంపై యశస్వి జైస్వాల్ స్పందించాడు. 

‘‘అలాంటి కామెంట్లపై నేనేమీ మాట్లాడను. వాటిని పట్టించుకోను. మైదానంలోకి దిగితే నా వంతు భాగస్వామ్యం అందించేందుకు ప్రయత్నిస్తా. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడంపైనే దృష్టిపెడతా. టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్, ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ముందుంటారు. మాతో నడుస్తూ సమస్యలు ఏంటనేది ద్రవిడ్ తెలుసుకుంటాడు. ఆత్మవిశ్వాసం  నింపుతూ అత్యుత్తమ ప్రదర్శన బయటకు తీసుకువస్తాడు. ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తాడు. నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటాను’’ అని జైస్వాల్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో యశస్వి 712 పరుగులు సాధించాడు. ఇందులో రెండు డబుల్‌ సెంచరీలు కూడా ఉన్నాయి.  

డకెట్‌పై నాజర్ హుస్సేన్ అసహనం

తమ వల్లే భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ దూకుడుగా ఆడుతుందనే డకెట్‌ వ్యాఖ్యలను ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ తప్పుబట్టాడు. ‘‘యశస్వి జైస్వాల్ సహా ఇతర భారత బ్యాటర్లు మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. తన నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటే ఎదిగాడు. కష్టపడిన తీరు అద్భుతం. ఆత్మవిశ్వాసంతో యశస్వి ఆడాడు. బజ్‌బాల్‌ అంటూ దూకుడుగా ఆడటంలో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు విఫలమైన సమయంలో భారత్‌ మాత్రం అద్భుతంగా పరుగులు రాబట్టింది’’ అని హుస్సేన్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని