IND vs ENG: రికార్డుల మీద రికార్డులు.. తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) అర్ధ శతకం బాది పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

Published : 08 Mar 2024 00:45 IST

ధర్మశాల: టెస్టుల్లో సూపర్‌ ఫామ్‌ని కొనసాగిస్తున్న టీమ్‌ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).. విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరిట ఉన్న ఓ రికార్డు బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్‌పై ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో జైస్వాల్ 655 పరుగులు చేశాడు. 2016లో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ 655 పరుగులు చేశాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (57; 58 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకం బాదడంతో ఇంగ్లిష్‌ జట్టుపై అత్యధిక రన్స్‌ (712) చేసిన భారత ఆటగాడిగా ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో 700కు పైగా రన్స్‌ చేసిన రెండో భారత ఆటగాడిగానూ జైస్వాల్ రికార్డు సృష్టించాడు. సునీల్ గావస్కర్‌ వెస్టిండీస్‌పై రెండుసార్లు (774 పరుగులు, 1971.. 732 పరుగులు.. 1979) ఈ ఘనత సాధించాడు. 

తొలి భారత ఆటగాడిగా 

టెస్టుల్లో తక్కువ (9) మ్యాచ్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగానూ యశస్వి రికార్డు సృష్టించాడు. అంతకుముందు సునీల్ గావస్కర్‌, ఛెతేశ్వర్‌ పుజారా 11 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ని అందుకున్నారు. అరంగేట్రం చేసిన అనంతరం తక్కువ రోజుల్లో (239) 1000 రన్స్‌ చేసిన భారత ప్లేయర్‌గానూ ఈ యువ ఆటగాడు నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు రాహుల్ ద్రవిడ్ (299 రోజులు) పేరిట ఉండేది. వినోద్‌ కాంబ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేస్తే జైస్వాల్ 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. టెస్టుల్లో ఒకే జట్టుపై అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌ కూడా జైస్వాలే. ఇంగ్లాండ్‌పై 26 సిక్స్‌లు కొట్టి సచిన్‌ (25 సిక్స్‌లు అస్ట్రేలియాపై)ను అధిగమించాడు.

కుల్‌దీప్ ‘50’ రికార్డు 

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 218 పరుగులకు ఆలౌటైంది. భారత స్నిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (5/72) విజృంభించాడు. జానీ బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా కుల్‌దీప్‌ టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలోనే భారత్‌ తరఫున టెస్టుల్లో వేగంగా (బంతుల పరంగా) 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కుల్‌దీప్‌ కేవలం 1871 బంతుల్లోనే 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు అక్షర్ పటేల్ (2205 బంతులు) పేరిట ఉండేది. బుమ్రా 2520 బంతుల్లో 50 వికెట్లు సాధించాడు. 

రోహిత్ ఖాతాలో రెండు రికార్డులు 

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ బౌలింగ్‌లో మార్క్‌వుడ్ క్యాచ్‌ను రోహిత్ అందుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో 60 లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ ఆటగాడూ ఈ ఫీట్ సాధించలేదు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ టెస్టుల్లో సిక్సర్ల పరంగా ఓ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మార్క్‌వుడ్ బౌలింగ్‌లో 151.2 కి.మీ. వేగంతో వచ్చిన షార్ట్‌బాల్‌ని ఫుల్‌షాట్‌తో అలవోకగా ఫైన్‌లెగ్‌ మీదుగా స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో డబ్ల్యూటీసీ చరిత్రలో 50 సిక్స్‌లు బాదిన తొలి భారత ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని