Yashasvi Jaiswal: యశస్వికి మీరు నేర్పలేదు..: డకెట్‌కు ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ చురక

Yashasvi Jaiswal: టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ను చూసి నేర్చుకోవాలని ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ కెప్టెన్‌ నాజిర్‌ హుస్సేన్‌ సూచించాడు.

Published : 20 Feb 2024 13:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బజ్‌బాల్‌ అంటూ దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచిన ఇంగ్లాండ్‌కు మన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ఇటీవల చుక్కలు చూపించాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టు (IND vs ENG Test Match)లో అదే బజ్‌బాల్‌ (Bazball) ఆటతో డబుల్‌ సెంచరీ కొట్టి ప్రత్యర్థిని వణికించాడు. అయితే యశస్వి ఆటకు క్రెడిట్‌ తమదేనంటూ ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆటగాడు బెన్‌ డకెట్‌ (Ben Duckett) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఆ జట్టు మాజీ కెప్టెన్‌ నాజిర్‌ హుస్సేన్‌ (Nasser Hussain) ఘాటుగా స్పందించాడు. అతడు మిమ్మల్ని చూసి నేర్చుకోలేదంటూ ఇంగ్లీష్‌ జట్టుకు చురకలంటించాడు. అసలేం జరిగిందంటే..

మూడో టెస్టు మధ్యలో యశస్వి శతకం పూర్తయిన తర్వాత డకెట్‌ దానిపై మాట్లాడుతూ.. ‘‘ఇతర జట్ల కంటే భిన్నంగా మా ప్రత్యర్థులు టెస్టు క్రికెట్‌ ఆడుతుంటే.. అప్పుడు వారి ఆటలో కొంత క్రెడిట్‌ మేం తీసుకోవాల్సిందేనని అనిపిస్తుంది. మాలాగే ఇతర జట్ల ఆటగాళ్లు కూడా దూకుడైన క్రికెట్ ఆడటం ఉత్సాహం కలిగిస్తోంది’’ అని అన్నాడు.

పరుగుల తపస్వి.. యశస్వి జైస్వాల్‌!

ఈ వ్యాఖ్యలపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ హుస్సేన్‌ స్పందిస్తూ డకెట్‌ వ్యాఖ్యలను తప్పుబట్టాడు. ‘‘యశస్విపై డకెట్‌ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే.. అతడు ఇంగ్లాండ్‌ నుంచే నేర్చుకున్నాడనే అర్థం వస్తోంది. అతడికి మీరేం నేర్పలేదు. జీవితంలో ఎదురైన సవాళ్లు, కష్టనష్టాల నుంచి, ఐపీఎల్‌ నుంచే యశస్వి ఎంతో నేర్చుకున్నాడు. కాబట్టి మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని అనుకుంటున్నా. ఈ బజ్‌బాల్‌ యుగంలో ఇంగ్లాండ్‌ మరింత మెరుగుపడాలంటే విమర్శలకు దూరంగా ఉండాలి. వీలైతే అతడి నుంచి మీరు ఏమైనా నేర్చుకోండి’’ అని సొంత జట్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని