Yashasvi Jaiswal: బాంద్రాలో ఇంటిని కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్‌.. ధర ఎంతంటే?

భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఓ ఇంటివాడయ్యాడు. అంటే అతడు వివాహ బంధంలోకి అడుగు పెట్టలేదు. ఓ ఫ్లాట్‌ను బుక్‌ చేసినట్లు సమాచారం.

Updated : 22 Feb 2024 12:37 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ఇప్పుడు ఏం చేసినా వైరల్‌ అయిపోతున్నాడు. ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు చేసిన అతడు.. ఐసీసీ ర్యాంకుల్లోనూ జోరు చూపించాడు. టాప్‌ -20లోకి వచ్చేశాడు. తాజాగా మరో విషయం బయటకొచ్చింది. అతడు ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అదీనూ అత్యంత ఖరీదైన ముంబయి మహానగరంలోని బాంద్రా ప్రాంతంలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ప్రకారం.. ఈస్ట్‌ బాంద్రాలో వింగ్‌ 3 ఏరియాలోని 1100 చ.అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్‌ ధర దాదాపు రూ. 5.4 కోట్లు ఉంటుంది. 

క్రికెటర్‌గా మారే క్రమంలో 22 ఏళ్ల యశస్వి చాలా కష్టాలను అనుభవించాడు. కొన్నాళ్లు టెంట్‌లోనూ జీవితం గడిపాడు. తర్వాత అతడి కోసం కుటుంబం యూపీ నుంచి ముంబయికి మారిపోయింది. క్రికెట్‌ శిక్షణ కోసం వెళ్లే సమయంలో పానీ పూరి బండి వద్ద పని చేసినట్లూ వార్తలు వచ్చాయి. జూనియర్‌ లెవల్‌లో తన సత్తా చూపించిన తర్వాత.. జైస్వాల్‌ వెనక్కి తిరిగి చూడలేదు. అండర్ -19 వరల్డ్‌ కప్‌ 2019లో రాణించాడు. దీంతో ఐపీఎల్‌లోకి అడుగు పెట్టే అవకాశం వచ్చింది. తొలిసారే రూ. 2.4 కోట్ల బిడ్‌ దక్కించుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్ తరఫున 2023 సీజన్‌లో 14 మ్యాచుల్లోనే 625 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ అతడే టాప్‌ స్కోరర్‌. కేవలం మూడు టెస్టుల్లోనే 545 పరుగులు సాధించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని