Mahika Gaur: 12 ఏళ్లకే టీ20ల్లో.. 17 ఏళ్లకే వన్డేల్లో... అప్పుడు యూఏఈకి.. ఇప్పుడు ఇంగ్లాండ్‌కు...

మహిక గౌర్‌ (Mahika Gaur)... మహిళా క్రికెట్‌లో ఇప్పుడు ఈమె గురించే చర్చ. అంత స్పెషల్‌గా ఆమె ఏం ఆడింది, ఎందుకు చర్చ జరుగుతోందా తెలుసా?

Published : 11 Sep 2023 18:41 IST

శ్రీలంకతో ఇంగ్లాండ్‌ మహిళల జట్టు వన్డే.. 6.2 అడుగుల ఎత్తు, మంచి శరీర సౌష్టవంతో ఉన్న అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్‌ చేస్తోంది. కొత్త బంతితో మంచి వేగం, బౌన్స్‌ రాబడుతోంది. స్వింగ్‌తో వరుస ఓవర్లలో ఇద్దరు బ్యాటర్లను కళ్లు చెదిరే రీతిలో బౌల్డ్‌ చేసి అదరగొట్టింది. మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకుంది. అది ఆమెకు తొలి వన్డేనే. అప్పటి నుంచి ఆమె ఎవరు? అనే చర్చ ఎక్కువైంది. కానీ అంతకంటే ముందు నుంచే ఆమె సంచలన ప్రయాణం ప్రారంభమైంది. ఆమెనే.. 17 ఏళ్ల మహిక గౌర్‌ (Mahika Gaur). ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో యూఏఈకి ఆడిన ఆమె.. ఇప్పుడు ఇంగ్లాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. పిన్న వయస్సులోనే రెండు దేశాల తరపున క్రికెట్‌ ఆడిన అమ్మాయిగా నిలిచింది. 

ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసి..

మహిక ఇంగ్లాండ్‌లో పుట్టింది. ఆమె తండ్రి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు చెందినవాడు. తల్లిదేమో ఇంగ్లాండ్‌. మహికాకు క్రికెట్‌పై ఇష్టం కలగడానికి ఐపీఎల్‌ మ్యాచ్‌ కారణం. ఆరేళ్ల వయసులో 2011లో జైపుర్‌లో రాజస్థాన్‌ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ను చూసేందుకు కుటుంబంతో కలిసి ఆమె వచ్చింది. ఆ మ్యాచ్‌ తనపై ఎంతో ప్రభావం చూపింది. తిరిగి ఇంగ్లాండ్‌ వెళ్లిన తర్వాత ఇంటి గార్డెన్‌లో బౌలింగ్‌ చేసేందుకు ప్రయత్నించింది. ఆమె శైలి చూసిన తండ్రి ప్రోత్సహించారు. ఆమె తండ్రి కూడా కళాశాల రోజుల్లో పేసర్‌. నాన్న మద్దతుతో మహిక ఓ క్రికెట్‌ క్లబ్‌లో చేరింది. కానీ తనకు ఎనిమిదేళ్ల వయసులో కుటుంబం దుబాయ్‌కు మారడం.. అక్కడ క్రికెట్‌ ఆడేందుకు మహికాకు క్లబ్‌ దొరకకపోవడంతో బ్యాడ్మింటన్‌ ఆడేందుకు ప్రయత్నించింది. కానీ మనసంతా క్రికెట్‌పైనే. ఓ రోజు బ్యాడ్మింటన్‌ శిక్షణకు వెళ్లే దారిలోనే ఉన్న అకాడమీలోకి వెళ్లడంతో మహిక దశ తిరిగింది. అక్కడ యూఏఈ కెప్టెన్‌కు ఆమె బౌలింగ్‌తో చేయడంతో తన క్రికెట్‌ కెరీర్‌ తిరిగి ప్రారంభమైంది. 

అరంగేట్రం అదుర్స్‌..

దుబాయ్‌లో చదువుకుంటూ యూఏఈ జట్టుతో మహిక ప్రయాణాన్ని మొదలెట్టింది. బౌలింగ్‌లో వేగం, స్వింగ్, వైవిధ్యంతో ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ వేగంగా ఎదిగింది. 12 ఏళ్ల వయసులోనే 2019లో యూఏఈ తరపున ఇండోనేసియాపై మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి 2023 వరకు యూఏఈ తరపున టీ20ల్లో ఆడింది. ఐసీసీ అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయర్‌ టోర్నీలో 11 వికెట్లతో.. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో యూఏఈ విజేతగా నిలవడంలో ఆమెది ప్రధాన పాత్ర. అనంతరం 2022 టీ20 ఆసియా కప్‌లో ఆడింది. 2023 ఐసీసీ అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో యూఏఈకి ప్రాతినిథ్యం వహించింది. 

అలా ఇంగ్లాండ్‌కు..

2020 దుబాయ్‌ ఎక్స్‌పోలో ఇంగ్లాండ్‌ దేశవాళీ జట్టు థండర్‌.. ప్రతిభాన్వేషణలో భాగంగా మహికాను గుర్తించింది. కానీ దుబాయ్‌ కళాశాలలో చదువు కోసం అక్కడే ఉంటూ మహిక యూఏఈకు ఆడింది. 2022 నుంచి ఇంగ్లాండ్‌ దేశవాళీ క్రికెట్లో ఆమె భాగమైంది. 2022 హండ్రెడ్‌ లీగ్‌లో మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ జట్టుతో చేరింది కానీ ఆడే అవకాశం రాలేదు. ఈ సారి లీగ్‌ బరిలో దిగి 6 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టింది. ఇంగ్లాండ్‌ దేశవాళీ మహిళల టీ20 కప్‌లో కాంబ్రియా తరపున మెప్పించింది. ఈ ప్రదర్శన చూసి ఇంగ్లాండ్‌ మహికపై ప్రత్యేక దృష్టి సారించింది. బ్రిటిష్‌ పాస్‌పోర్టు ఉండటంతో ఇంగ్లాండ్‌కు ఆడేందుకు ఆమెకు ఎలాంటి అడ్డంకి లేకుండా పోయింది. జూన్‌లో ఆస్ట్రేలియా- ఎ జట్టుతో టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌- ఎ జట్టుకు ఎంపికైంది. 

ఇప్పుడు శ్రీలంకతో టీ20, వన్డేల కోసం ఇంగ్లాండ్‌ సీనియర్‌ జట్టులోకి వచ్చింది. టీ20ల్లో ఇంగ్లాండ్‌ తరపున అడుగుపెట్టింది. అలాగే తొలిసారి వన్డే ఆడింది. ఇంగ్లాండ్‌ జెర్సీలో బౌలింగ్‌ చేస్తున్నట్లు ఊహించుకుంటూ నిద్రపోయే ఆమె కల ఇప్పుడు నిజమైంది. మహేంద్ర సింగ్‌ ధోని, మిచెల్‌ స్టార్క్‌లంటే ఆమెకు ఇష్టం. బ్యాటింగ్‌లోనూ రాణించే మహిక.. ధోనీలాగా మ్యాచ్‌లు ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమ్మాయిల క్రికెట్లో 6.2 అడుగుల పొడవున్న ఇలాంటి లెఫ్టార్మ్‌ స్వింగ్‌ బౌలర్‌ ఉండడం అరుదు. ఇప్పుడదే ఆమెకు కలిసొస్తోంది. ‘‘మహిక బౌలంగ్‌ శైలి బాగుంది. ఆమె బౌలింగ్‌ నన్ను ఆకట్టుకుంది. తనకు 17 ఏళ్లే. ఆమె ఎంతో వృద్ధి చెందుతుంది. అంత ఎత్తున్న ఆమె బంతిని స్వింగ్‌ చేస్తే బ్యాటర్లకు కష్టమే’’ అని ఇంగ్లాండ్‌ వెటరన్‌ పేసర్‌ అండర్సన్‌ చెప్పాడు. మహిక ఇప్పటివరకూ 21 టీ20ల్లో 10 వికెట్లు పడగొట్టింది. 

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని