Pakistan: దేశం ఆర్థిక కష్టాల్లో ఉంటే.. కరెన్సీతో ‘పాక్‌ క్రికెటర్‌’ ఆటలు!

ఓ పాకిస్థాన్‌ యువ క్రికెటర్‌..తన చేతిలో ఉన్న డాలర్లతో నుదుటిమీద చెమటను తుడుచుకోవడం సోషల్‌ మీడియాలో విమర్శలకు దారితీసింది.

Published : 23 May 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌.. సాయం కోసం అంతర్జాతీయ సంస్థల వైపు చూస్తోంది. అవి అందించే ఆర్థిక ప్యాకేజీలతో ప్రస్తుత కాలాన్ని వెల్లదీస్తోంది. ఇటువంటి సమయంలో ఓ పాకిస్థాన్‌ యువ క్రికెటర్‌ ప్రవర్తన ఆ దేశంలో చర్చనీయాంశమయ్యింది. చేతిలో ఉన్న డాలర్లతో నుదుటి మీద చెమటను తుడుచుకోవడం సోషల్‌ మీడియాలో విమర్శలకు దారితీసింది. ప్రపంచ దేశాలు తిరిగే వీళ్లకు కనీస విలువలు తెలియవంటూ నెటిజన్లు మండిపడ్డారు.

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టులో యువ ఆటగాడు ఆజం ఖాన్‌ (Azam Khan).. వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవల జాతీయజట్టు ప్లేయర్లతో సరదాగా సంభాషిస్తున్న క్రమంలో పక్కనే ఉన్న పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌.. ఏమైంది? అని ఆజంఖాన్‌ను అడిగాడు. తన చేతిలో ఉన్న డాలర్లతో ముఖంపై చెమటను తుడుచుకున్న ఆజమ్‌ఖాన్‌.. ఇక్కడ చాలా వేడిగా ఉందంటూ బదులిచ్చాడు. దాంతో అక్కడున్న తోటి క్రీడాకారులందరూ నవ్వడం ఆ వీడియోలో కనిపించింది.

ప్రపంచం మొత్తం పర్యటించినా..

ఇది కాస్త నెట్టింట చక్కర్లు కొట్టడంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘పాక్‌ క్రీడా చరిత్రలో కొందరు మినహా ఎవరికీ అంత ప్రజాదరణ లేదు. అటువంటిది ఈ యువ క్రీడాకారుడి నుంచి ఏం ఆశిస్తాం?. ప్రస్తుత పరిస్థితి మరింత దారుణంగా ఉంది’’ అని ఓ యూజర్‌ పేర్కొన్నాడు. ‘అందుకే కనీస విద్య అవసరమని చెబుతుంటాం. వీళ్లు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తుంటారు.. కానీ, కనీస విలువలు తెలియవు. అంతర్జాతీయ క్రీడలకు పంపేముందు వాళ్లను మొదట స్కూలుకు పంపాలి’ అని మరో నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు. ‘పాకిస్థానీలు ఆహారకొరత ఎదుర్కొంటుంటే.. ఆజమ్‌ మాత్రం సేదదీరుతూ పేద ప్రజలను వెక్కిరిస్తున్నాడంటూ’ మరో యూజర్‌ మండిపడ్డాడు.

ఈ వ్యవహారంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. క్రీడాకారుల వీడియోలు అధికారిక డిజిటల్‌ మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నందున అనవసర వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవద్దని సూచించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని