T20 World Cup - Yuvraj Singh: క్రికెట్‌ VS బేస్‌బాల్‌.. రెండింటి మధ్య తేడా అదేనని చెప్పా: యువరాజ్‌

తొలిసారి అమెరికా వేదికగా టీ20 ప్రపంచ కప్ సంగ్రామం జరగనున్న నేపథ్యంలో యువీ కీలక వ్యాఖ్యలు చేశాడు. యూఎస్‌ఏతోపాటు విండీస్‌ కూడా ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

Published : 01 Jun 2024 19:56 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) కోసం ఐసీసీ నియమించిన రాయబారుల్లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) ఉన్నాడు. జూన్ 2 (భారత కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు) పొట్టి కప్‌ యూఎస్‌ఏ - విండీస్‌ సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ యూఎస్‌ఏ - కెనడా (USA vs CAN) జట్ల మధ్య జరగనుంది. తొలిసారి మెగా టోర్నీకి అమెరికా ఆతిథ్యం ఇవ్వడంపై యువరాజ్‌ ఓ అమెరికన్‌ టీవీ షోలో స్పందించాడు. అక్కడ ప్రజాదరణ కలిగిన బేస్‌బాల్‌కు, క్రికెట్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఓ అమెరికన్‌ స్నేహితుడికి చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు.

‘‘అమెరికాలో ఇలా క్రికెట్ ఆడతారని అస్సలు ఊహించలేదు. చూసేందుకు చాలా ఆసక్తిగా ఉంది. ఐసీసీ ఇక్కడ కొత్తగా రెండు స్టేడియాలను నిర్మించింది. అమెరికన్లు క్రికెట్‌ చూడాలనుకోవడం నాకు నచ్చింది. ఇక్కడ ఎక్కువగా బేస్‌బాల్‌ను ఇష్టపడతారు. నాకు ఇక్కడ ఫ్రెండ్స్‌ ఉన్నారు. అమెరికన్‌ ఫ్రెండ్‌ కలిసిన ప్రతిసారీ అతడు ఒకటే ప్రశ్న అడిగేవాడు. ‘క్రికెట్ అంటే ఏంటి?’ అని. ఇది కూడా బేస్‌బాల్‌లా ఉంటుందని చెప్పా. అయితే, మీరు అక్కడ రన్‌ కోసం నాలుగువైపులా పరుగెడతారు. క్రికెట్‌లో మాత్రం కేవలం ముందుకు - వెనక్కి మాత్రమే రన్‌ చేస్తాం. స్టేడియం బయటకు కొడితే బేస్‌బాల్‌లో ‘హోమ్‌ రన్‌’ అని పిలుస్తారు. క్రికెట్‌లో అయితే సిక్స్‌ అని అంటాం’’ అని యువీ తెలిపాడు. 

ఇవాళ భారత్ - బంగ్లా వార్మప్ మ్యాచ్‌

ప్రపంచ కప్‌ సంగ్రామంలోకి అడుగుపెట్టే ముందు.. బంగ్లాదేశ్‌తో భారత్ వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇవాళ రాత్రి 8 గంటలకు న్యూయార్క్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్‌ ఛానెళ్లు, డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది. కేవలం రెండు వార్మప్‌ మ్యాచులను మాత్రమే ఐసీసీ ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. విండీస్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ను కూడా ఇప్పటికే లైవ్ స్ట్రీమింగ్‌ చేసింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని